breaking news
TRS Tickets Fight
-
సిట్టింగుల్లో అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజల్లోకి వెళ్లి పనిచేయండి.. ప్రజలకు దగ్గరగా ఉండండి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తా. పనితీరు మెరుగుపరుచుకుంటే ఎలాంటి సమస్యా లేదు. పనిచేసి పేరుతెచ్చుకుంటే చాలు.. అందరికీ టికెట్లు వస్తాయి’... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శాసనసభాపక్ష సమావేశాల్లో ఇటీవల ఒకటికి రెండు సార్లు చేసిన ప్రకటన ఇది. మరో ఏడాదిన్నరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రకటనపై భరోసాతో ఉన్నట్టు కనిపిస్తున్నా, అదే స్థాయిలో కొందరిలో అయోమయం కూడా లేకపోలేదు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అభద్రతా భావం కనిపిస్తోందని అంటున్నారు. పదే పదే సిట్టింగులకే అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తున్నా.. పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి వారు స్థిమితంగా ఉండలేక పోతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు ఉండగా ఆయా పార్టీల నుంచి గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిని ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా మరికొందరిని తీసుకుని నియోజకవర్గ ఇన్చార్జీల బాధ్యతలు కూడా అప్పజెప్పారు. కాగా, ఒకటీ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉండదని, మరో రూపంలో అవకాశం కల్పిస్తామని వారికి హామీ కూడా ఇచ్చారని సమాచారం. చేరికలతో ఆందోళన.. ఈ ఉదంతాలతో సహజంగానే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉండగానే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కవితను చేర్చుకున్నారు. ఆమె పార్టీలో చేరి రెండేళ్లవుతుండగా, ఇటీవల పార్టీ, అధికార కార్యక్రమాల్లో ఆమె దూకుడు పెంచారని, ఆమెకే ప్రాధాన్యం లభిస్తోందని అంటున్నారు. మరో వైపు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖా నాయక్ ఉండగా, టీడీపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌ను చేర్చుకున్నారు. వీరి మధ్య పొసగకపోగా పార్టీ శ్రేణులు చీలిపోయాయి. తాజాగా భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి ఉండగా, టీడీపీకి చెందిన గండ్ర సత్యనారాయణరావును చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ మీదనే ఆయన చేరారని, ఇపుడు ఆ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయం బలపడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే నల్లగొండలో దుబ్బాక నర్సింహారెడ్డి ఇన్చార్జిగా ఉండగా, టీడీపీకి చెందిన కంచర్ల భూపాల్‌రెడ్డిని చేర్చుకుని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. తప్పని ఇంటి పోరు.. మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు మొదలయ్యాయి. తొలి ఏడాదికంటే తన పనితీరుతో సీఎం సర్వేల్లో గ్రాఫ్ పెంచుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌కు గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలుతో నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మునుగోడులో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే చెన్నయ్య ఉండగా, పార్టీ ఎంపీ బాల్క సుమన్ అక్కడ దృష్టిపెట్టారని ప్రచారం జరుగుతోంది. చెన్నూరులో ప్రభు త్వ విప్ ఓదెలు ఉండగా మాజీ మంత్రి జి.వినోద్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వేములవాడలో చెన్నమనేని రమేశ్ ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు ఉండగా, మాజీ మంత్రి పి.రాములు పార్టీలో చేరారు. సిట్టింగ్‌లకు ఆందోళన కలిగించే పరిణామాలు జరుగుతున్నాయి. అంధోల్‌లో బాబూమోహన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇటీవల స్థానిక నినాదం తెరపైకి రావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జు లు ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నాయకుల కు ఆహ్వానాలు అందుతున్నాయని చెబుతున్నారు. -
తనయుల కోసం తండ్రుల తపన
కరీంనగర్: తెలంగాణ సెంటిమెంట్ తమకే సొంతమంటూ ఉత్సాహంతో ఉరకలేస్తున్న టీఆర్ఎస్లో టికెట్ల పోరు అంతర్గతంగా కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, మంథని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. పార్టీలో సీనియర్, మాజీ వుంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుడు సతీష్‌బాబు హుస్నాబాద్ నుంచి అసెంబ్లీ టికెట్టు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీగా ఉన్నారు. గత ఎన్నికల్లో కెప్టెన్ ఇదే సీటు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఈసారి తన కుమారుడిని అదే స్థానం నుంచి బరిలోకి దింపాలని పట్టుదలతో ఉన్నారు. కానీ, సీపీఐతో పొత్తు ఉంటుందని ఇటీవలే కేసీఆర్ ప్రకటించటంతో అయోమయం మొదలైంది. ఉత్తర తెలంగాణలో సీపీఐకి పట్టున్న రెండు స్థానాల్లో హుస్నాబాద్ ఒకటి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఇదే సీటుకు పట్టు బడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మంతనాల్లో తనకు హుస్నాబాద్ టికెట్టు ఇవ్వాలని సతీష్‌బాబు పట్టుబట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దానికి బదులుగా రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కేసీఆర్ నచ్చజెప్పగా విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కెప్టెన్ సైతం తన కొడుక్కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ఎదుట స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కెప్టెన్‌ను కాదనలేక, సీపీఐ పొత్తును తేల్చలేక కేసీఆర్ ఈ సీటును పెండింగ్‌లో పెట్టారు. మంథనిలోనూ ఇదే కథ.. మంథనిలో సీనియర్ నేత, వూజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి, ఆయన కుమారుడు సునీల్రెడ్డితోనూ కేసీఆర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీగా ఉన్న సునీల్‌రెడ్డి తనకే టికెట్టు వస్తుందన్న ధీవూతో ఉన్నారు. తన కుమారుడికి టికెట్టు ఇవ్వాలని రాంరెడ్డి కేసీఆర్‌ను పట్టుబడుతున్నారు. తీరా సమయానికి , పుట్ట మధును పార్టీలోకి చేర్చుకోవటంతో తండ్రీకొడుకులు అసంతృప్తితో ఉన్నారు. అయితే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ సునీల్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, అసంతృప్తితో ఉన్న రాంరెడ్డి తమకు టికెట్టు ఇవ్వకపోతే సామూహికంగా రాజీనామాలు చేస్తామని ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచర వర్గంతో చర్చలు జరిపారు.