
సత్తిబాబు ఫ్యామిలీకి సింగిల్ సీటే(నా)?
గత ఎన్నికలప్పుడు దేదీప్యమానంగా వెలిగిన బొత్స కుటుంబం ప్రభ ఇప్పుడు కొడి గడుతోంది.
ఓడలు బళ్లు అవడం అంటే ఇదేనేమో. విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇప్పటివరకు దేదీప్యమానంగా వెలిగిన బొత్స కుటుంబం ప్రభ ఇప్పుడు మిణుకు మిణకుమంటోంది. హైకమాండ్ 'సింగిల్ సీటు' పాలసీని స్ట్రిక్టుగా అమలు చేయాలని నిర్ణయించడంతో సత్తిబాబు కంగుతిన్నారు. కాంగీయుల కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి మాత్రమే పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. గత ఎన్నికలపుడూ హస్తం పార్టీలో ఈ విధానం ఉన్నా పీసీసీ సీటులో ఉన్న సత్తిబాబు చాకచక్యంగా వ్యవహరించి తన కుటుంబానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకోగలిగారు. ఏవరేమన్నా పట్టించుకోకుండా తన మాట నెగ్గించుకున్నారు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మళ్లీ ఇప్పుడు ఎన్నికల కాలం వచ్చింది. పరిస్థితులు మారాయి. 'ఏక స్థానం' విధానాన్ని విధిగా అమలు చేస్తామని ఇంతకాలం చెబుతూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం దాన్ని ఇప్పుడు చేసి చూపించింది. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల ఖరారులో విషయంలో 'సింగిల్ సీటు' పాలసీని పాటించింది. దీంతో సత్తిబాబు సంకటంలో పడిపోయారు.
తన పరివారానికి ఈసారి పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందో, లేదోనని బొత్స గబులు చెందుతున్నారు. అయితే వింతలకు, విశేషాలకు నెలవైన కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరగొచ్చు. ఈ రూల్ తెలంగాణకు మాత్రమే పరిమితమని, సీమాంధ్రలో వర్తించదని సత్తిబాబు ఫ్యామిలీ కోసం నిబంధన సవరించినా ఆశ్చర్యపడక్కర్లేదంటున్నారు.