సైనికాధికారుల పిటిషన్‌

Sakshi Editorial On Army Men Petition In Supreme Court

కల్లోలిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా బలగాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయ డాన్ని సవాల్‌ చేస్తూ సైనిక దళాల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 350మంది సుప్రీంకోర్టులో మంగ ళవారం అసాధారణ రీతిలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులు తిరుగుబాటు సంస్థల కార్య కలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సైనిక దళాల మనోసై్థర్యాన్ని దెబ్బతీస్తాయని, కల్లోలిత ప్రాంతాల్లో పనిచేసే బలగాలకు రక్షణనిస్తున్న సాయుధ దళాల(ప్రత్యేకాధికారాల) చట్ట నిబంధన లను నీరుగారుస్తాయని వారు వాదించారు. ఆ చట్టంకింద పనిచేస్తున్నవారికి నిర్దిష్టమైన మార్గదర్శ కాలను జారీచేయడం ద్వారా సదుద్దేశంతో చర్యలు తీసుకునే సైనికులు వేధింపులకు గురికాకుండా చూడాలని విన్నవించారు. దీన్ని ‘అత్యవసర పిటిషన్‌’గా పరిగణించి ఈ నెల 20న చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది. మణిపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లకు సంబంధించిన అయిదు కేసుల్లో చార్జిషీట్ల దాఖలులో తాత్సారం చేయడాన్ని సుప్రీంకోర్టు నిలదీసిన పక్షం రోజుల్లోనే తాజా పిటిషన్‌ ధర్మాసనం ముందుకొచ్చింది. సాధారణంగా సాయుధ బలగాలు తీసుకునే చర్యలపై పిటిషన్లు దాఖలైతే ప్రభుత్వాలే వాటిని సమర్ధించుకునే బాధ్యత తీసుకుంటాయి. ఇప్పుడు ఈ పిటిషనర్లంతా నిర్దిష్టమైన కేసును సవాలు చేయడంకాక సాయుధ దళాల చట్టం కింద పనిచేస్తున్నవారికి మార్గ దర్శకాలు జారీ చేయడం ద్వారా తగిన రక్షణ కల్పించాలని కోరారు.

మన దేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) 1993 అక్టోబర్‌లో ఏర్ప డింది. అది ఏర్పడటానికి ముందే అంటే ఆ ఏడాది మార్చిలోనే అప్పటి సైనిక దళాల చీఫ్‌ పీసీ జోషి సైనిక ప్రధాన కార్యాలయంలో మానవ హక్కుల విభాగం ఏర్పాటుచేశారు. అంటే ప్రభుత్వం కన్నా ముందు సైన్యమే ఈ విషయంలో చొరవ తీసుకుంది. ఆంతరంగిక భద్రతా విధుల్లో నిమగ్నమయ్యే సైనికులు మానవహక్కుల్ని ఉల్లంఘించిన సందర్భం ఏర్పడితే తగిన చర్యలు తీసుకోవటం ఈ విభాగం బాధ్యత. అలాంటి చరిత్ర గల సైన్యంపై ఇటీవలికాలంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి తరచుగా ఆరోపణలు రావడం, కొన్ని కేసుల విషయంలో చర్య తీసుకోవడానికి ఏళ్లూ పూళ్లూ పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నెల 2న సుప్రీంకోర్టు ముందుకొచ్చిన మణిపూర్‌ ఎన్‌ కౌంటర్లకు సంబంధించిన కేసు ఆ తరహాదే. ఆ రాష్ట్రంలో భద్రతా బలగాలు కొందరు అమాయక పౌరులను ఎన్‌కౌంటర్ల మాటున మట్టుబెట్టాయని పౌర సమాజ బృందాలు ఆరోపించాయి. వీటికి సంబంధించి 1,500 కేసుల్ని సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకొచ్చి విచారణకు ఆదేశించాలని 2012లో కోరాయి. ఈ కేసుల్ని సైన్యమే విచారించి సత్వరం తేల్చి ఉంటే వేరేగా ఉండేదేమో. కానీ అది జరగక పోవడం వల్ల పౌర సమాజ బృందాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఆ మరుసటి ఏడాది సర్వో న్నత న్యాయస్థానం వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన ముగ్గురు–సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జేఎం లింగ్డో, మాజీ డీజీపీ అజయ్‌ కుమార్‌ సింగ్‌లతో కమిటీని ఏర్పాటు చేసి ఆరు కేసుల్ని లోతుగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది. చిత్రమేమంటే అవన్నీ బూటకపు ఎన్‌కౌంటర్లేనని కమిటీ తేల్చింది. ఏం చేద్దామని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు అడిగినప్పుడు అటార్నీ జనరల్‌ వీటిపై విచారణ అనవసరమని వాదించారు. మణిపూర్‌లో ‘యుద్ధ వాతావరణం’ నెలకొందని, అక్కడ సాయుధ దళాల చట్టం అమల్లో ఉన్న దని, ఆ చట్టం కింద సాయుధ బలగాలకు విశేషాధికారాలుంటాయని చెప్పారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. అక్కడ విదేశీ దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు వాతా వరణం ఉన్నట్టు కేంద్రం ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదని గుర్తుచేసింది. అడపా దడపా మిలిటెంట్లు జరిపే దాడుల్ని బట్టి అక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదని చెప్పడం సరికాదన్నది. ఈ ఉదంతా లపై  కేసులు నమోదు చేయాలని సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. ఇప్పటికి 15మంది భద్రతా సిబ్బందిపై రెండు చార్జిషీట్లు నమోదయ్యాయి. మరో అయిదు ఈ నెలా ఖరుకు దాఖలు కావలసి ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఈ క్రమానికంతకూ ఏడెనిమి దేళ్లు పట్టింది. ఈ ఎడతెగని జాప్యంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ ఆర్‌సీ) కూడా మన దేశాన్ని ప్రశ్నించింది.

అటు సైనికాధికారుల పిటిషన్‌నూ, ఇటు ఎన్‌కౌంటర్‌ మృతుల కుటుంబీకుల డిమాండును గమ నిస్తే బాధితులెవరన్న ప్రశ్న తలెత్తుతుంది. తమవారు సాధారణ జీవనం గడుపుతున్నా ఎన్‌కౌంట ర్లలో బలయ్యారని ఆ కుటుంబీకులు అంటుంటే... కల్లోలిత ప్రాంతాల్లో పనిచేసే సైనికులు విధి నిర్వ హణ పర్యవసానంగా ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొనవలసి వస్తుందని, జైళ్లకు పోవాల్సి ఉంటుందని అయోమయంలో పడుతున్నారని సైనికాధికారులు చెబుతున్నారు. ఆరోపణలొచ్చిన తక్షణమే చర్యకు ఉపక్రమించే సంస్కృతి సైన్యంలో ఉంటే ఇంత అయోమయం తలెత్తే అవకాశం ఉండదు. పిటిషనర్లే చెప్పినట్టు సాయుధ దళాల చట్టం కూడా సైనికులకు గుత్తగా రక్షణ కల్పించదు. అసాధారణ పరి స్థితులు తలెత్తిన సందర్భాల్లో మాత్రమే సైనికుల చర్యలకు రక్షణ ఉంటుంది. ఈ అసాధారణ పరి స్థితులకు సంబంధించి పోలీసులకు, సీబీఐకి కూడా పూర్తి అవగాహన ఉండదని పిటిషనర్లు చేసిన వాదన నిజమే కావొచ్చు కూడా. అందుకే సైన్యంలోని మానవ హక్కుల విభాగమైనా, క్రమశిక్షణ చర్య తీసుకునే మరో విభాగమైనా చురుగ్గా వ్యవహరించాలి. ఆరోపణలొచ్చినప్పుడు ఏళ్ల తరబడి నాన్చడం అటు సైన్యానికి, ఇటు దేశ ప్రతిష్టకు కూడా మంచిది కాదు. శత్రు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు సైతం సైనికుల ప్రవర్తన ఎలా ఉండాలో ‘జెనీవా ఒప్పందం’ వంటివి నిర్దేశిస్తాయి. అలాంటిది అంతర్గతంగా పౌర ప్రాంతాల్లోని ఘర్షణలతో వ్యవహరించేటపుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోపణలకు తావీయని రీతిలో చర్యలుండటం ముఖ్యమని గుర్తించాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top