పసితనంపై మృత్యుపంజా

Hundreds Of Children Died With Acute Encephalitis Syndrome In Bihar - Sakshi

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రి మృత్యుగీతం ఆలపిస్తోంది. అమ్మలా అక్కున చేర్చుకుని ఆదరించి స్వస్థత చేకూర్చాల్సిన ఆసుపత్రి పసిపిల్లల ప్రాణాలు హరిస్తోంది. కేవలం 17 రోజుల్లో అక్కడ 130మంది మరణించారు. ఆ ఒక్కచోటే కాదు... ఆ జిల్లాలోని వేరే ప్రాంతాల్లో, పొరుగునున్న చంపారన్, మోతీహరి జిల్లాల్లో సైతం ఇప్పటికి వేయిమందికిపైగా పిల్లలు మెదడు వాపు వ్యాధి లక్షణాలతో ఇలా ఆసుపత్రుల్లో చేరారు. ఇంకా చేరుతున్నారు. ఒకపక్క ప్రభుత్వా సుపత్రులన్నీ ఇలా వ్యాధి సోకిన పిల్లలతో కిటకిటలాడుతుంటే పశ్చిమబెంగాల్‌లో వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం వైద్య సిబ్బంది సమ్మె చేయడంతో అసలే అంతంత మాత్రంగా వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి.

ముజఫర్‌పూర్, దాని పొరుగు జిల్లాల్లో 1995 మొదలుకొని ఏటా ఇదే కాలంలో ఈ వ్యాధి ప్రబలుతున్నా వ్యాధికారక వైరస్‌ ఏమిటో, అదెందుకు వ్యాపిస్తున్నదో శాస్త్రీయంగా నిర్ధారించలేకపోయారు. దాని సంగతలా ఉంచి కనీసం ఇది దాపురించే కాలానికి ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లల్ని చేర్చుకుని చికిత్స అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలోనూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మొత్తంగా దీన్ని అక్యూట్‌ ఎన్సెఫ లైటిస్‌ సిండ్రోమ్‌(ఏఈఎస్‌) అని పిలుస్తున్నా అది స్పష్టంగా ఫలానా కారణంగా వస్తుందని నిర్ధారించలేదు. వైరస్‌లు, బాక్టీరియా, ఫంగీ తదితరాలవల్ల ఈ సిండ్రోమ్‌ రావొచ్చునని, వడదెబ్బ తగలడం వల్ల సైతం ఇది ఏర్పడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి : బిహార్‌లో హాహాకారాలు)

ముజఫర్‌పూర్‌లో వ్యాధి గ్రస్తులైన పిల్లల్లో 98శాతంమందికి ఏఈఎస్‌తో పాటు హైపోగ్లైసీమియా లక్షణాలుంటున్నాయన్నది వైద్యుల మాట. ఇలాంటి స్థితి వియత్నాం, బంగ్లాదేశ్‌ల తర్వాత ముజఫర్‌పూర్‌లోనే కనిపిస్తున్నదని వారంటున్నారు. పౌష్టికాహారలోపం వల్ల లేదా సరైన తిండి తినకపోవడంవల్ల హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిలు భారీగా పడిపోవడం దీని లక్షణం. ఖాళీ కడుపున స్థానికంగా లభించే లిచీ ఫ్రూట్‌ తింటున్న పిల్లల్లో తీవ్రమైన జ్వరం రావడం, చూస్తుండగానే అయోమయావస్థలోకి వెళ్లడం లేదా పిచ్చివాళ్లుగా మారడం, చివరకు కోమాలోకి వెళ్లడం చూసి వీరందరికీ ఏఈఎస్‌తోపాటు హైపోగ్లైసీమియా కూడా ఉన్నదని తేలుస్తున్నారు.

లిచీ ఫ్రూట్‌లో ఉండే హైపోగ్లైసిన్‌–ఏ అనే పదార్ధం విషపూరితమైనదని, మితిమీరి తింటే ఆ పదార్థం శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ పండ్లు అధికంగా లభించే మే, జూన్‌ మాసాల్లోనే పిల్లల్లో ఈ ప్రాణాంతక వ్యాధి బయటపడుతోంది. పైగా ఈ పండ్లు తిన్నాకే వారంతా మంచాన çపడుతున్నారు. కనుక వ్యాధి మూలాలు లిచీ ఫ్రూట్‌లో ఉండొచ్చునని లెక్కేస్తున్నారు.  ముజఫర్‌పూర్‌లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేస్తామని, పిల్లలకు వందపడకల ఐసీయూ యూనిట్, వైరాలజీ ల్యాబ్‌ నెలకొల్పుతామని  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. ఈ పని ముందే జరిగుంటే సమస్య ఇంత ముదిరేది కాదు.

ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయదల్చుకున్నామని ఎన్‌డీఏ ప్రభుత్వం 2015లో ప్రకటించింది. దానికి సంబంధించి ముసాయిదా సిద్ధమైందని వార్తలు వెలువడ్డాయి కూడా. కానీ ఎందుకో ఇంతవరకూ అది సాకారం కాలేదు. అంతకు చాన్నాళ్లముందు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సైతం పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చింది. మొన్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తామొస్తే ఆరోగ్య పరిరక్షణను ప్రాథమిక హక్కు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ప్రకటించారు. ఇలా ఎవరెన్నిసార్లు చెబుతున్నా ఆరోగ్యరంగానికి కేటాయింపులు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. మన దేశంలో చికిత్సకు అవకాశమున్న వ్యాధుల వల్ల ఏటా 24 లక్షలమంది జనం చనిపోతున్నారంటే వైద్య సేవలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అర్ధమవుతుంది.

ఇక్కడ ప్రతి లక్షమంది రోగగ్రస్తుల్లో 122మంది నాసిరకం వైద్యసదుపాయాల కారణంగా చనిపోతున్నారని లాన్‌సెట్‌ గ్లోబల్‌ సర్వే చెబుతోంది. ఇది బ్రెజిల్‌(74), రష్యా(91), చైనా(46), దక్షిణాఫ్రికా(93), బంగ్లాదేశ్‌(57) దేశాలతో పోలిస్తే చాలాఎక్కువ. ముజఫర్‌పూర్, దాని పొరుగునున్న జిల్లాల్లో పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడం, పౌష్టికాహార లోపం లేకుండా చూడటం వంటి చర్యలు తీసుకుంటే ఇన్ని మరణాలు సంభవించేవి కాదు. కనీసం అక్కడ తగినంతమంది వైద్యులున్నా, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నా పసివాళ్ల ప్రాణాలు ఇలా గాల్లో కలిసేవి కాదు. వ్యాధి సోకిన నాలుగు గంటల్లోగా పిల్లలకు 10 శాతం డెక్స్‌ట్రోజ్‌ను అందిస్తే వారు సత్వరం కోలుకునే అవకాశమున్నదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆమాత్రం సదుపాయమైనా అందుబాటులో లేదు. చిత్రమేమంటే బిహార్‌కు పొరుగునున్న ఉత్తరప్రదేశ్‌ తూర్పుప్రాంతంలో సైతం పౌష్టికా హారలోపం అధికంగా ఉంది. దేశంలో ఏటా సంభవించే పిల్లల మరణాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 35 శాతం.

ముజఫర్‌పూర్‌ను స్మార్ట్‌ నగరంగా ప్రకటించమంటూ కేంద్ర ప్రభుత్వానికి బిహార్‌ ప్రభుత్వం ఆమధ్య నివేదిక అందజేసింది. దాని ప్రకారం ఆ నగరంలో ప్రతి లక్షమంది రోగులకు 80మంది వైద్యులున్నారు. అక్కడి ఇతర జిల్లాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి గనుక ముజఫర్‌పూర్‌ చాలా మెరుగ్గా ఉన్నదని అనుకోవాలి. ఎందుకంటే చాలాచోట్ల లక్షమంది రోగులకు సగటున కేవలం ముగ్గురు ప్రభుత్వ వైద్యులు మాత్రమే ఉన్నారు! సాధారణ పరిస్థితుల్లో కనీసం లక్షమంది రోగులకు వందమంది వైద్యులుండటం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలన్నిటికీ హితవు చెబుతోంది. పట్టించుకునేవారేరి? వైద్యరంగంపై సమగ్రమైన దృక్పథంతో వ్యవహరించి సమూల ప్రక్షాళన చేయడానికి అవసరమైన నిధులను, మానవ వనరులను అందుబాటులోకి తీసుకొస్తే తప్ప ప్రజారోగ్య వ్యవస్థ బాగుపడదు. అంతవరకూ ఈ మరణమృదంగం ఆగదు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top