ఈ ‘పంచాయతీ’ ఆగేనా? | Sakshi
Sakshi News home page

ఈ ‘పంచాయతీ’ ఆగేనా?

Published Fri, Mar 30 2018 12:44 AM

Editorial on Khap Panchayats - Sakshi

సమాజానికి బెడదగా పరిణమించిన ఖాప్‌ పంచాయతీలు కొనసాగనీయరాదని మూడు నెలల వ్యవధిలో మూడోసారి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఖాప్‌ పంచాయతీలు ‘పరువు హత్యల’కు పాల్పడిన కేసులను ప్రత్యేక లేదా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు విచారించాలని, రోజువారీ విచారణలు జరిపి తీర్పునివ్వాలని మంగళవారం తాజా ఆదేశాల్లో నిర్దేశించింది. అంతేకాదు ఈ పంచాయతీల కట్టడికి, ‘పరువు హత్యల్ని’ అరికట్టడానికి పార్లమెంటు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాల్లోని గ్రామ సీమల్లో తాము చెప్పిందే శాసనమన్నట్టు ప్రవర్తిస్తున్న ఈ ఖాప్‌ పంచాయతీల విష యంలో ప్రభుత్వాలన్నీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా జనం, ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు.   

ఖాప్‌ పంచాయతీలు ఎలా చెలరేగిపోతున్నాయో అడపా దడపా అవి వెలువ రిస్తున్న తీర్పుల వల్ల దేశ ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. ‘సమాజ ఆదర్శాల’కు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నందుకు 2007లో హర్యానాలోని ఒక ఖాప్‌ పంచాయతీ నూతన దంపతులను ‘మరణశిక్ష’ విధించి అమలు చేయించింది. ఈ కేసులో దాఖ లైన పిటిషన్‌పైనే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను వెలువరించింది. 2014–2016 మధ్య ఖాప్‌ పంచాయతీలు 288 ‘పరువు హత్యల’కు పాల్పడ్డాయి. ఖాప్‌ పంచా యతీల అరాచకానికి 2015లో రాజస్తాన్‌లో ఇచ్చిన ‘తీర్పే’ ఉదాహరణ. ‘నీ భర్త వేరొక వ్యక్తి భార్యతో అదృశ్యమయ్యాడు గనుక నువ్వెళ్లి ఆ వ్యక్తితో కాపురం చేయాల’ని ఒక మహిళను ఆ పంచాయతీ ఆదేశించింది. 

తన భర్త చేసిన నేరానికి తానెలా బాధ్యురాలినవుతానని ఆ మహిళ మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక యువతితో యువకుడు పరారైనందుకు శిక్షగా ఆ యువకుడి అక్కచెల్లెళ్లిద్దరిపైనా అత్యాచారం జరపాలని మరో ఖాప్‌ పంచాయతీ తీర్పుని చ్చింది. ఇక బయటకెళ్లినప్పుడు మహిళలు సెల్‌ఫోన్లు దగ్గరుంచుకోరాదని, సూర్యా స్తమయం తర్వాత వారు అసలు బయటికే పోకూడదని ఆ రాష్ట్రంలోని ఖాప్‌ పెద్దలు ఆదేశాలిచ్చారు. ఆడపిల్లల వస్త్రధారణ విషయంలోనూ, కులాంతర వివాహాల్లో, సగోత్రీకుల వివాహాల్లో వీటి జోక్యం ముదిరిపోయింది. తమ మాట వినని సంద ర్భాలెదురైనప్పుడు ‘పరువుహత్య’లకు కూడా ఈ పంచాయతీలు వెనకాడటం లేదు. 

పిల్లలకు పదహారేళ్ల వయసొచ్చేసరికి పెళ్లిళ్లు చేస్తే అత్యాచారాలంటూ ఉండ వని మరో ఖాప్‌ పంచాయతీ తీర్పునిచ్చింది. గ్రామంలో ఎవరొచ్చి ఫిర్యాదు చేసినా తగుదునమ్మా అని వివాదాల్లోకి చొరబడటం, ఇరుపక్షాలనూ పిలిచి తోచినట్టుగా ఆదేశాలివ్వడం వీటికి అలవాటైపోయింది. గ్రామసీమల్లో దశాబ్దాలుగా కొనసాగు తున్న ఈ పంచాయతీల జోలికి ఏ ప్రభుత్వమూ వెళ్లడం లేదు. కనుకనే జనం సైతం ఈ పంచాయతీ పెద్దలకు జడిసి నోరెత్తలేని స్థితి ఏర్పడింది. పర్యవసానంగా వారి మాటే శాసనంగా చలామణి అవుతోంది. ఖాప్‌ పంచాయతీలను పట్టుకుంటే సుల భంగా ఓట్లు రాలతాయన్న విశ్వాసంతో పార్టీలు సైతం వాటి అరాచకాల సంగతి తమకు తెలియనట్టు అమాయకత్వాన్ని నటిస్తున్నాయి. కనుకనే ఆ పార్టీల నేతృ త్వంలో ఏర్పడే ప్రభుత్వాలు ఖాప్‌ పంచాయతీలపై చట్టాన్ని తీసుకురావడానికి గానీ, వాటి నేరాలను కట్టడి చేయడానికిగానీ ప్రయత్నించడం లేదు. మరీ తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు మాత్రం తప్పనిసరై ఏదో ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంటున్నాయి. 

ఈ పంచాయతీలు ‘పరువు హత్యల’కు పాల్పడుతున్నా, బాల్యవివాహాలు జరిపిస్తున్నా, ఆడవాళ్ల హక్కులకు భంగం కలిగేలా మతిమాలిన ఆజ్ఞలు జారీచేస్తున్నా ఇవి అసలు పట్టించుకోవు. ఈ పంచాయతీల చేష్టలు పాత రాతి యుగం ధోరణులను గుర్తుకు తెచ్చేలా ఉంటున్నా, అందువల్ల మన దేశం పరువు మంటగలుస్తున్నా ప్రభుత్వాలు ఆవేదన పడటం లేదు. కేంద్రంలో ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలైనా ఇదే వరస. ఇక రాష్ట్ర ప్రభుత్వాల సంగతి చెప్పనవసరమే లేదు. 
 
ప్రజల భద్రత కోసం, వారి ప్రయోజనాల కోసం చట్టాలు, పథకాలు తీసు కురావలసిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాలదే. ఆ సంగతిని సుప్రీంకోర్టు గుర్తు చేసే పరిస్థితి ఏర్పడినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలి. యుక్త వయసొచ్చిన యువతీయువకులు పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, చేసు కోవాలనుకున్నా ఆ విషయంలో కుటుంబసభ్యులతోసహా ఎవరి జోక్యమూ ఉండ రాదని, ఆ జంటను విడదీసే హక్కు ఎవరికీ లేదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం గమనించదగ్గది. అలా పెళ్లాడటంలో చట్టపరమైన సమస్య లుంటే వాటిని పరిశీలించి పరిష్కరించే బాధ్యత న్యాయస్థానాలదే తప్ప వ్యక్తులది కాదు. ప్రభుత్వాలు మాత్రం ఇదేం తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి. 

మారుమూల పల్లెటూళ్లలో సైతం ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలు సుకునే ప్రభుత్వాలకు ఖాప్‌ పంచాయతీల గురించి, వాటి కార్యకలాపాల గురించి ఆరాతీయడం పెద్ద కష్టం కాదు. ఏ ఊరి ఖాప్‌ పంచాయతీలో ఎవరెవరు సభ్యు లుగా ఉన్నారో గుర్తించి అలాంటివి చట్టవిరుద్ధమైనవని చెప్పడం, వాటి సమా వేశాలు నిర్వహిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించడం మొదలుకావాలి. అవి ఇష్టానుసారం ఆదేశాలిచ్చినట్టు తెలియగానే బాధితుల రక్షణకు చర్యలు తీసుకుని బాధ్యులను అరెస్టు చేయాలి. బాధితుల నుంచి ఫిర్యాదు కోసం ఎదురుచూడ కూడదు. 

ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాలు మాత్రమే ఖాప్‌ పంచాయతీలను, వాటి అరాచకాలను అరికట్టలేవు. ప్రభుత్వాలు క్రియాశీలంగా వ్యవహరించాలి. 2007 మొదలుకొని ఇంతవరకూ వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే వచ్చింది. హర్యానా, రాజస్తాన్‌ హైకోర్టులు గతంలో మార్గదర్శకాలు జారీ చేశాయి. కానీ చేష్టలుడిగిన ప్రభుత్వాలవల్ల అవన్నీ వృథా అవుతున్నాయి. కనీసం ఇకనుంచి అయినా వాటి తీరు మారాలి. ఖాప్‌ పంచా యతీల విషయంలో కఠినంగా వ్యవహరించడం మొదలుకావాలి. ఒక చట్టం తీసు కొచ్చేలోగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలు ప్రారంభించాలి.

Advertisement
Advertisement