ఎట్టకేలకు గట్టి బిల్లు

A bill on Human trafficking - Sakshi

ఇంకా కళ్లు తెరవని పసి గుడ్డులు మొదలుకొని బాలబాలికలు, యువతుల వరకూ వేలాదిమందిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న మాఫియా ముఠాల ఆట కట్టించేందుకు ఎట్టకేలకు ఒక సమగ్ర చట్టం రాబోతున్నది. దీనికి సంబంధించి రూపొందించిన బిల్లు ప్రస్తుతం మంత్రుల బృందం(జీఓఎం) పరిశీలనలో ఉంది. నాగరిక విలువలనే సవాలు చేస్తున్న మనుషుల అక్రమ తరలింపు దుర్మార్గాన్ని అరికట్టడానికి అమల్లో ఉన్న చట్టాలు చాలడం లేదని, ఆ విషయంలో అత్యంత కఠినమైన చట్టం తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నడో 2004లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై ఆ న్యాయస్థానం ఆదేశాలిచ్చి కూడా రెండేళ్లు దాటింది. ఇన్నాళ్లకు ఆ బిల్లు రూపుదిద్దుకుంది. మాదక ద్రవ్యాల తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత వ్యవస్థీకృతంగా చాపకింద నీరులా సాగిపోతున్న నేరం మనుషుల అక్రమ తరలింపే. ఈ మాఫియా సామ్రాజ్యంలో మాయమాటలు చెప్పి అమాయక ఆడపిల్లల్ని వలలో వేసుకునే దళారులు మొద లుకొని అనేకులున్నారు.

బాధితుల్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికీ తర లించడం,  దేశ సరిహద్దులు కూడా దాటించడం ఇటీవలికాలంలో పలుమార్లు బయటపడింది. ఈమధ్యే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న వీరేందర్‌ దేవ్‌ దీక్షిత్‌ నిర్వహిస్తున్న మూడు కేంద్రాలపై దాడి చేస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ మూడు కేంద్రాల్లో దాదాపు 50మంది యువతులు, బాలికలను కాపాడారు. దాడులు జరగ బోతున్నాయని ముందస్తు సమాచారం అందుకుని చాలామందిని అప్పటికే వేరే చోటకు తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. నిరుడు పశ్చిమబెంగాల్‌లో వెల్లడైన ఉదంతం మరింత దుర్మార్గమైనది. రోజుల వయసున్న పిల్లల్ని బిస్కెట్ల పెట్టెల్లో పెట్టి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు బయటపడింది. ప్రసవించిన తల్లికి బిడ్డ పుట్టగానే మరణించిందని అబద్ధం చెప్పి, అందుకు కోర్టు గుమాస్తాల ద్వారా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తెప్పించి ఈ వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పుడప్పుడు దేశంలో వివిధ రైల్వే స్టేషన్లలో పదులు, వందల సంఖ్యలో పిల్లల్ని తరలిస్తూ ముఠాలు పట్టుబడుతున్నాయి. ఇలా అక్రమంగా తరలిస్తున్నవారిలో బాలికలనైతే వ్యభిచార కేంద్రాలకు విక్రయించడం, మగపిల్లల్ని వెట్టి చాకిరికి వినియోగించుకోవడానికి అమ్మడం సర్వసాధారణం. ఇవికాక పిల్లల అవయవాలు తొలగించి వారిని యాచక వృత్తిలోకి నెట్టడం కూడా రివాజు.

మనుషుల అక్రమ తరలింపు రకరకాల ముసుగుల్లో సాగుతోంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామని, ఇంటి పనులకు అవసరమని, అనాథలకు ఆశ్రయమిస్తామని, దత్తత కోసమని మభ్యపెట్టి అమాయక బాలబాలికలను తెచ్చి నరకకూపాల్లోకి తోస్తున్నారు. వ్యవసాయంలో, ఇటుకల పరిశ్రమల్లో వెట్టిచాకిరీ చేయించడానికి లేదా వ్యభిచారం చేసేందుకు తరలిస్తున్నారు. పిల్లలను చీకటికొట్టాల్లో బంధించి, చిత్రహింసలకు గురిచేసి వారిని దారికి తెచ్చుకుని ఇదంతా సాగిస్తున్నారు. అపహ రించిన పిల్లల ద్వారా ఏటా దాదాపు రూ. 200 కోట్ల వ్యాపారం సాగుతున్నదని అంచనా. ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం నిరుడు మనుషుల అక్రమ తరలింపు కేసులు 8,132 నమోదయ్యాయి. అంతక్రితం సంవత్సరం ఈ మాదిరి కేసులు 6,877. రాష్ట్రాలవారీగా చూస్తే పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌లలో మహిళల అపహరణలు అధికంగా ఉన్నాయి. న్యాయస్థానాల్లో కూడా ఈ మాదిరి కేసుల విచారణ నత్తనడక నడుస్తోంది. 2015లో న్యాయస్థానాల ముందు 5,003 కేసులుంటే కేవలం 384 కేసుల విచారణ మాత్రమే పూర్తయింది. ఇందులో 55 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి. అంటే 14.4 శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది.

చట్టంలో నేరాల నిర్వచనం సక్రమంగా లేకపోవడం, ఆ చట్టాల అమలులో చూపే నిర్లక్ష్యం నేరగాళ్లకు పరోక్షంగా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. మన దేశంలో భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 370ని సవరిస్తూ 2013లో తెచ్చిన చట్టం తొలిసారి పిల్లల అక్రమ తరలింపు అంశాన్ని నేరంగా పరిగణించింది. మనుషుల అక్రమ తరలింపుపై  కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికి మూడుసార్లు ముసాయిదా బిల్లులు రూపొందించింది. అయితే అందులోని లోటుపాట్లు ఎత్తి చూపి వాటిని సవరిస్తే తప్ప ప్రయోజనం ఉండబోదని వివిధ సంస్థలు, వ్యక్తులు చెప్పడంతో తగినంత సమగ్రతతో తాజా బిల్లు రూపొందించారు. బాధితులపై మాదకద్రవ్యాలు, రసాయనాలు లేదా హర్మోన్లు ప్రయోగించడం, అవయవాలను తొలగించి పిల్లలను భిక్షాటనలో పెట్టడం, వెట్టిచాకిరీ కోసం మనుషుల్ని తర లించడం, వ్యభిచార వృత్తిలోకి దించడం, పిల్లలను మానవ కవచాలుగా లేదా సైనికులుగా వినియోగించడం, లైంగిక దోపిడీకి పాల్పడటం, వారిని అశ్లీల చిత్రాల్లో వినియోగించడం వగైరా నేరాలకు తాజా బిల్లు కఠిన శిక్షలను ప్రతిపాదించింది.

అలాగే జాతీయ స్థాయిలో మనుషుల అక్రమ తరలింపు కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం నెలకొల్పాలని నిర్దేశించింది. రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేక అధి కారులుంటారు. మనుషుల అమ్మకాలు, కొనుగోళ్లలో పాలుపంచుకునేవారికి ఈ బిల్లు కనీసం ఏడేళ్ల కఠిన శిక్ష, గరిష్టంగా పదేళ్ల శిక్ష ప్రతిపాదిస్తోంది. లైంగిక నేరాలకు పాల్పడి వాటిని ప్రచారంలో పెడతామని బెదిరించి బాధితులనుంచి లేదా వారి కుటుంబాలనుంచి డబ్బులు వసూలు చేసినా, ఇతరత్రా ఒత్తిళ్లు తెచ్చినా మూడు నుంచి ఏడేళ్ల శిక్ష విధిస్తారు. ఈ బిల్లు సాధ్యమైనంత త్వరగా చట్టంగా మారడం తక్షణావసరం. అలాగే ఎంత కఠినమైన చట్టాలున్నా అమలు చేసే యంత్రాంగం చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో పనిచేయకపోతే ఉద్దేశం నెరవేరదు. అందువల్ల నేరగాళ్లతో కుమ్మక్కయ్యే, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలుండాలి. బాధితులకు పునరావాసం కూడా ముఖ్యం. ఇవన్నీ చేస్తేనే ఈ దుర్మార్గం దుంపనాశనమవుతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top