అరుణ్‌ జైట్లీ (ఆర్థిక మంత్రి) రాయని డైరీ

 finance minister arun jaitley unwritten diary  - Sakshi

బడ్జెట్‌కి ముందు రోజు రాత్రి మోదీజీ నన్ను ఇంటికి పిలిచారు. నేనుండేది కైలాష్‌ కాలనీలో. మోదీజీ ఉండేది లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో. పది కిలోమీటర్ల దూరం. ఇరవై నిమిషాల ప్రయాణం.  నేను వెళ్లేసరికి ‘పంచవటి’లో మోదీజీ ఒక్కరే ఉన్నారు. బాల్కనీలో నిల్చుని దూరంగా ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు.  

‘‘ప్రశాంతంగా లేను జైట్లీజీ’’ అన్నారు.. తల తిప్పకుండానే, నా అలికిడి విని. 
పంచవటి ప్రశాంతంగా ఉంటుంది. పంచవటిలో ఉన్నవాళ్లకే ప్రశాంతత ఉండదు! 
పంచవటిలో బీజేపీ ఒక టర్మే ఉంది. తర్వాత వనవాసంలోకి వెళ్లింది. తర్వాత మళ్లీ పంచవటిలోకి వచ్చింది. తర్వాత మళ్లీ వనవాసమేనా? 
‘‘పంచవటి పేరైనా మార్చాలి. పంచవటి ఉన్న ప్లేస్‌ అయినా మార్చాలి మోదీజీ.. మనం’’ అన్నాను.
‘‘దేని గురించి జైట్లీజీ మీరు మాట్లాడుతున్నది?’’ అన్నారు మోదీజీ. 
‘‘ప్రశాంతత గురించి మోదీజీ’’ అన్నాను. 
ఇద్దరం పక్కపక్కనే నిలబడి ఆకాశంలోకి చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. 
నిశ్శబ్దంగా ఉన్నారు మోదీజీ. 
‘‘ఆకాశంలో ఏం చూస్తున్నారు మోదీజీ?’’ అని అడిగాను. 
‘‘సామాన్యుడిని చూస్తున్నాను జైట్లీజీ. అందుకే ప్రశాంతంగా లేను’’ అన్నారు ఆయన.. ఇంకాస్త డీప్‌గా ఆకాశంలోకి చూస్తూ. 
‘‘జైట్లీజీ.. మీ బడ్జెట్‌తో ధనవంతుడిని కొంచెం సామాన్యుడిగా, సామాన్యుడిని కొంచెం ధనవంతుడిగా మార్చగలరా?’’ అని అడిగారు. ఆ మాట కూడా ఆకాశంలోకి చూస్తూనే అడిగారు. 
నేనూ ఆకాశంలోకే చూస్తున్నాను. అక్కడ నాకు సామాన్యుడు కనిపించడం లేదు. మోదీజీ కనిపిస్తున్నారు! ఇక్కడున్న మోదీజీ ఆకాశంలో ఉన్న సామాన్యుడిని చూస్తున్నట్టుగానే, ఆకాశంలో కనిపిస్తున్న మోదీజీ ఇక్కడున్న సామాన్యుడిని చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. 
చేతులెత్తి దండం పెట్టాను!
‘‘ఎవరికి దండం పెడుతున్నారు జైట్లీజీ? సామాన్యుడికేనా?’’ అన్నారు మోదీజీ.
మోదీజీలోని ప్రత్యేకత అదే. తనకు కనిపిస్తున్నదే అందరికీ కనిపిస్తూ ఉంటుందని అనుకుంటారు. 
‘‘అవును మోదీజీ’’ అన్నాను. 
‘‘పది కిలోమీటర్ల దూరాన్ని ఇరవై నిముషాల్లో ఎవరైనా దాటేస్తారు జైట్లీజీ. ఇరవై కిలోమీటర్ల దూరాన్ని పది నిముషాల్లో దాటగలిగినవాళ్లే సామాన్యుడికి ఏమైనా చేయగలరు’’ అన్నారు మోదీజీ!
అర్థమైంది. ఆకాశంలో మోదీజీ చూస్తున్నది సామాన్యుడిని కాదు. 
ఎవరి మీద కోపం వచ్చినా.. వారిని సామాన్యుడిలో చూసుకుంటారు మోదీజీ. అది ఆయనలోని ఇంకో ప్రత్యేకత.

- మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top