ఆచార్యునిపై చర్య?

students demand on proffessor to arrest - Sakshi

లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌పై చర్యలకు విద్యార్థుల డిమాండ్‌

జేఎన్‌టీయూకే వద్ద ఆందోళన

విధుల నుంచి బాబులు తాత్కాలిక తొలగింపు

కాకినాడ / బాలాజీచెరువు: ఎంటెక్‌ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌టీయూకే ప్రొఫెసర్‌ కె.బాబులు వ్యవహారం మరింత వేడెక్కింది. ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పించాలని విద్యార్థులు ఆదివారం రోడ్డెక్కడంతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన యూనివర్సిటీ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. మరోవైపు ప్రొఫెసర్‌ బాబులుకు అనుకూలంగా అధికార టీడీపీకి చెందిన నేతలు రంగంలోకి దిగారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు విద్యార్థులు కూడా సన్నద్ధమవుతున్నారు.

‘బాబులు’ కమిటీ భేటీ
విద్యార్థులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌టీయూకే ఐఎస్‌టీ డైరెక్టర్‌(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) ప్రొఫెసర్‌ కె.బాబులుతో ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ భేటీ అయ్యింది. ఆదివారం రెక్టార్‌ పూర్ణానందం అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎదుట ప్రొఫెసర్‌ బాబులు హాజరయ్యారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ఫిర్యాదుల నేపథ్యంలో కమిటీ సభ్యులు కూడా ప్రొఫెసర్‌కు అనేక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో బాబులు వాదనను కూడా కమిటీ రాతపూర్వకంగా స్వీకరించినట్టు వర్సిటీ వర్గాలు చెప్పాయి.

జేఎన్‌టీయూకే వద్ద నిరసన గళం
ప్రొఫెసర్‌ బాబులును తక్షణమే విధుల నుంచి తప్పించాలంటూ ఆదివారం ఎంటెక్‌ విద్యార్థులంతా రోడ్డెక్కారు. జేఎన్‌టీయూకే ప్రధాన ద్వారం వద్ద దాదాపు 200 మంది బైఠాయించి ప్రొఫెసర్‌ను విధుల నుంచి తప్పించే వరకు తరగతులను బహిష్కరిస్తామని, పరీక్షలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఉభయవర్గాల సమక్షంలోనే విచారణ జరగాలంటూ ఆందోళన కొనసాగించడంతో చివరకు వీసీ కుమార్, రెక్టార్‌ పూర్ణానందం అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో రెండు గంటల తరువాత ఆందోళన విరమించారు.

తాత్కాలికంగా తొలగింపు
ప్రొఫెసర్‌ బాబులును ఐఎస్‌టీ డైరెక్టర్‌ పదవితోపాటు, ఎంటెక్‌ కోర్సు విధుల నుంచి తప్పిస్తూ ఆదివారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో వివాదానికి తాత్కాలికంగా ముగింపుపలికారు. ఈ చర్యతో శాంతించిన విద్యార్థులు సోమవారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరయ్యేందుకు సమ్మతించారు.

రాజకీయ ఒత్తిళ్లు?
కమిటీ విచారణ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్టు విద్యార్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్‌కు అనుకూలంగా రాష్ట్రస్థాయి చైర్మన్‌ పదవిలో ఉన్న ఓ నేతతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి కూడా రంగంలోకి దిగి వీసీ, కమిటీ సభ్యులపై బాబులుకు అనుకూలంగా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇది కాస్తా బయటకు పొక్కడంతో విద్యార్థులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసి రోడ్డెక్కారు.

విచారణ తీరుపై విద్యార్థుల పెదవి విరుపు
ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన తీరుపై విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. విద్యార్థులతో ఒకసారి, ప్రొఫెసర్‌తో మరొకసారి విడివిడిగా విచారణ జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నది వీరి వాదన. ఇరు వర్గాలతో ముఖాముఖి విచారణ జరపడంతోనే వాస్తవాలు బయటకు వస్తాయనే వాదన విద్యార్థుల్లో నెలకొంది. ఈ తరహా వివాదాలు తలెత్తిన సమయంలో గతంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బయటి వర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీ వేశారని, ఇక్కడ మాత్రం స్థానిక ప్రొఫెసర్లతోనే కమిటీ వేయడం వల్ల న్యాయం జరగదన్న వాదనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top