జలజగడం | Water affray | Sakshi
Sakshi News home page

జలజగడం

Sep 27 2016 12:16 AM | Updated on Jun 1 2018 8:39 PM

జలజగడం - Sakshi

జలజగడం

తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి రావాల్సిన నీటిని విడుదల చేయడంలో టీబీ బోర్డు అధికారులు తీవ్ర వివక్షతను చూపిస్తున్నారు.

  • ఆన్‌అండ్‌ఆఫ్‌లోనూ అన్యాయం చేస్తున్న టీబీ బోర్డు
  • హెచ్‌ఎల్‌సీకి నీరు విడుదల వాయిదా
  • కర్ణాటక రైతులకు అవసరం లేకపోవడమే కారణమట
  • అనంతపురం సెంట్రల్‌ :  తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి రావాల్సిన నీటిని విడుదల చేయడంలో టీబీ బోర్డు అధికారులు తీవ్ర వివక్షతను చూపిస్తున్నారు. జిల్లా రైతులతో పనిలేకుండా కేవలం కర్ణాటక రైతుల సంక్షేమాన్నే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో వస్తున్న అరకొర నీటిని కూడా హెచ్చెల్సీకి విడుదల చేయకుండా వాయిదా వేయడమే ఇందుకు నిదర్శనం.

    తుంగభ్రద జలాశయంలోకి నీటి లభ్యత తక్కువుగా ఉందని ఈ ఏడాది హెచ్చెల్సీకి 10 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకూ 7.25 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి అయితే జలాశయంలో నీటినిల్వ వేగంగా పడిపోతోందనే ఉద్దేశంతో ఆన్‌అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 17వ తేదీ నుంచి హెచ్చెల్సీకి నీటిని నిలుపుదల చేశారు. తిరిగి సోమవారం(26) నుంచి విడుదల చేయాల్సి ఉంది. అయితే కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులకు ప్రస్తుతం నీటి అవసరం లేనందున హెచ్చెల్సీకి నీటి విడుదల వాయిదా వేసినట్లు టీబీ బోర్డు అధికారులు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే కర్ణాటక అక్రమంగా జల చౌర్యానికి పాల్పడుతోందని చెప్పకనే చెప్పవచ్చు. ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతి అంటే పదిరోజులు కర్ణాటక రైతులు వాడుకుంటే మరో పది రోజులు జిల్లా రైతులు వాడుకోవాలి. కానీ మనకు రావాల్సిన సమయంలో వారికి అవసరం లేదనే కారణంతో వాయిదా వేయడం విమర్శలకు దారి తీస్తోంది. కనీసం జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టు కింద రైతులు సాగు చేసిన పంటలకు నీరు అవసరమా లేదా అనే వివరాలను జిల్లా అధికారులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో హైలెవల్‌ మెయిన్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ కింద సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పైగా మనకు నీళ్లు విడుదల సమయంలో కూడా కర్ణాటక రైతులు వాడుకునే ప్రమాదముంది. కానీ తుంగభద్ర జలాశయం వద్ద మాత్రం జిల్లాకు విడుదల చేసిన నీటిని లెక్కలు కడుతూనే ఉంటారు. . ఇప్పటికైనా కలెక్టర్, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై దృష్టి సారించి తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి రావాల్సిన నీటి విషయంపై ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ఆయకట్టు రైతులు  విజ్జప్తి చేస్తున్నారు.

    ఈ విషయంపై హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావును వివరణ కోరగా... హెచ్చెల్సీకి నీటి విడుదల వాయిదా వేసిన విషయం నిజమే అని అంగీకరించారు. ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో హెచ్చెల్సీకి సోమవారం నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉన్నా వాయిదా వేసినట్లు బోర్డు అధికారులు తెలిపారన్నారు. కానీ జిల్లాలో హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలతో పాటు నీటి అవసరాలు ఎక్కువుగానే ఉన్నాయని వివరించారు. కానీ తమను సంప్రదించకుండానే బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. 

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement