వాసుపల్లి.. వేషం వెర్రి! | Vasupalli peethadhipati geteup | Sakshi
Sakshi News home page

వాసుపల్లి.. వేషం వెర్రి!

Aug 1 2016 11:43 PM | Updated on Sep 4 2017 7:22 AM

వాసుపల్లి.. వేషం వెర్రి!

వాసుపల్లి.. వేషం వెర్రి!

ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని గోల చేసిన బీజేపీ నాలుక ఇప్పుడు మడతపడింది..

  • హోదా గోదాలో సానుభూతి పాట్లు
  • పీఠాధిపతి వేషధారణతో విన్యాసాలు
  • ఎమ్మెల్యే వికారపు చేష్టలపై జనం అభ్యంతరాలు
  • స్వామీజీలను అవమానించడంపై ఆక్షేపణ
  • నిరసన అంటూనే పూలు చల్లించుకోవడం.. జేజేలు కొట్టించుకోవడం
  • బీజీపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు
  • మిన్నకుండటంపై విమర్శలు
  •  
     
    ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని గోల చేసిన బీజేపీ నాలుక ఇప్పుడు మడతపడింది.. 
    దానికి మద్దతిస్తున్న టీడీపీ వ్యతిరేకంగా గొంతెత్తితే ఏమవుతుందోన్న భయంతో సన్నాయి నొక్కులు నొక్కుతోంది..
    దిల్లీలో సాగుతున్న రాజకీయ డ్రామాను తలన్నేలా.. విశాఖలో సోమవారం ఓ వీధి నాటకం విస్తుగొలిపింది..
    వినూత్న నిరసన పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వేసిన వేషం వికటించింది..
    ధర్మపరిరక్షణ కోసం జీవితాలను త్యాగం చేసిన పీఠాధిపతులను అనకరిస్తూ ఆయన వేసిన వేషం.. చేసిన చేష్టలు.. 
    హోదా ఇచ్చేది లేదని తేల్చేసిన బీజేపీకే చెందిన ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడం వంటి విన్యాసాలు.. సానుభూతికి బదులు విమర్శలు కురిపించాయి.  
    ఇదేం వేషాల వెర్రి.. అని జనం ఏవగించుకునేలా చేశాయి..
     
    సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి వినూత్నంగా భావించి చేపట్టిన నిరసన చూసి విశాఖ జనం విస్తుపోయారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా ప్రచారం కోసం ఇప్పటికే ఎన్నెన్నో వేషాలు, మరెన్నో విన్యాసాలు చేసిన వాసుపల్లి సోమవారం వేసిన పీఠాధిపతి వేషం మాత్రం ప్రజలకు ఏవగింపు కలిగించింది.
    –ప్రత్యేక హోదాపై ఎన్డీయే  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ కూటమిలోని టీడీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ధర్నాలు ఇప్పటికే విమర్శలపాలవుతున్నాయి. దొంగతనం చేసిన దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్టు టీడీపీ డ్రామాలాడుతోందన్న వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రచారం కోసం రకరకాల విన్యాసాలు చేసే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి సోమవారం పీఠాధిపతి అవతారం ఎత్తడం వివాదాస్పదమైంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా ఆయన ప్రచార వికారం పరాకాష్టకు చేరిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. పీఠాధిపతులను అవమానించే విధంగా వ్యవహరించారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
    వికారపు చేష్టలు
     – వాసుపల్లి కరాసలోని తన స్వగహం నుంచి హిందూ పీఠాధిపతి వేషధారణలో భజన బందం వెంటరాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఇంటికి వెళ్లి ఆయనకు వినతి పత్రం సమర్పించారు. వాసుపల్లితో పాటు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు కూడా ఉన్నారు. నిరసన ప్రదర్శనకు వెళ్తున్నానన్న పెద్దమనిషి దారిపొడవునా పీఠాధిపతి వేషంలో ఉన్న తనపై తెలుగు మహిళలతో పూలు చల్లించుకోవడం, జేజేలు పలికించుకోవడం.. వంటి చేష్టలకు పాల్పడటం ప్రజలకు ఏవగింపును కలిగించాయి. పైగా మీడియాకు స్వయంగా తన లెటర్‌హెడ్‌తో పంపిన లేఖలో కూడా ‘పీఠాధిపతి వాసుపల్లి’ అని తనను తాను సంభోదించుకోవడం విమర్శలపాలవుతోంది. 
    విష్ణుకుమార్‌రాజుకు ఏమైంది?
    పబ్లిసిటీ కోసం చీప్‌ ట్రిక్కులకు పాల్పడ్డ వాసుపల్లి వ్యవహారం అటుంచితే.. ఆయన్ను స్వాగతించి, అతని తలపై పూలు చల్లిన బీజేపీ ఎమ్మెల్యే  విష్ణుకుమార్‌రాజు వైఖరి కూడా వివాదాస్పదమవుతోంది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడి హోదాలో ఉన్న ఆయన.. పీఠాధిపతిలను అనుకరిస్తూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన విన్యాసాలపై కనీసమాత్రంగా కూడా అభ్యంతరం చెప్పకపోవడంపై కమలనాధుల్లోనే  విస్మయం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజమెత్తుతూ వాసుపల్లి స్వామీజీ  వేస్తే... విష్ణుకుమార్‌ రాజు కుటుంబ సభ్యులతో సహా సవినయంగా స్వాగతం పలకడం, పూలు చల్లడం  ప్రజల్లో చర్చకు  దారి తీసింది. పైగా విషయాన్ని మోదీ దష్టికి తీసుకువెళ్తానని అభినవ పీఠాధిపతికి ఆయన సెలవివ్వడం ఇక్కడ  కొసమెరుపు.
    పీఠాధిపతి వేషం ఎందుకంటే..
    వాసుపల్లి వివరణ
    ప్రధాని నరేంద్రమోదీ పీఠాధిపతులకు, కార్పొరేట్‌ శక్తులకు ఇచ్చిన గౌరవం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని వాసుపల్లి పేర్కొన్నారు. అందుకే పీఠాధిపతిగా విష్ణుకుమార్‌రాజు వద్దకు వెళ్లానని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం పీఠాధిపతి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సానుకూలంగానే స్పందించారని, ప్రజాప్రతినిధుల మనోభావాలను కేంద్ర పెద్దలకు తెలియజేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వారంరోజుల్లో దిల్లీ వెళ్లి ఎమ్మెల్యేలు వాసుపల్లి, వెలగపూడి ఇచ్చిన వినతి పత్రాలను పెద్దలకు అందజేస్తానని విష్ణుకుమార్‌రాజు చెప్పినట్టు వాసుపల్లి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

పోల్

Advertisement