పిడుగు పాటుకు రెండు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి.
► రూ. 3 లక్షల ఆస్తి నష్టం
కొత్తకోట (గిద్దలూరు రూరల్): పిడుగు పాటుకు రెండు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కొత్తకోట ఎస్సీ పాలెంలో ఆదివారం వేకువజామున 2 గంటల సమయంలో జరిగింది. ఉరుములు మెరుపులు వచ్చిన సమయంలో ఓ పిడుగు కొమ్మునూరి సరోజమ్మ, కొమ్మునూరి ఓబులేసుల పూరి గుడిసెలపై పడటంతో నిప్పు అంటుకుంది. ఆరుబయట పడుకున్న యజమానులు మంటలను గమనించి కేకలు వేయడంతో స్థానికులు అగ్నిమాపకశాఖ వారికి సమాచారం అందించారు.
సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే గుడిసెలు రెండు పూర్తిగా కాలిపోయాయి. వంట పాత్రలు, బీరువా, బియ్యం బస్తాలతో పాటు రూ.4,500 నగదు, ఒక జత బంగారు కమ్మలు, వెండి పట్టీలు, వంటివి కాలిపోయాయి. తమకు నిలువ నీడలేకుండాపోయిందని బాధితులు ఆవేదన చెందారు. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితులకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.5 వేలను అందజేశారు. డిప్యూటీ తహసీల్దార్ పి.ఖాదర్‌వలి, సీనియర్ అసిస్టెంట్ సాయి, వీఆర్‌ఓ రమణ పాల్గొన్నారు.