చిన్నబోయిన సన్నాలు ‘వెల’ విల | There is also the effect of the cancellation of the notes .. | Sakshi
Sakshi News home page

చిన్నబోయిన సన్నాలు ‘వెల’ విల

Dec 27 2016 2:28 AM | Updated on Oct 1 2018 2:09 PM

చిన్నబోయిన సన్నాలు ‘వెల’ విల - Sakshi

చిన్నబోయిన సన్నాలు ‘వెల’ విల

వరి మద్దతు ధర దొడ్డు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తుంటే..

ఇళ్లు, కళ్లాల్లోనే ధాన్యం మద్దతు ధర
రూ.1,800 వట్టిమాటే..
రూ.1,600లకే
దండుకుంటున్న దళారులు
 పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌ కూడా ఉంది.
.

వరి మద్దతు ధర దొడ్డు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తుంటే.. సన్న రైతులు చిన్న బోతున్నారు.. అమ్ముకోలేక ఇళ్లలో, పొలాల వద్ద నిల్వ పెడుతున్నారు.. దొంగల పాలు కాకుండా ఎముకలు కొరికే చలిలో కాపలా ఉంటూ   జాగారం చేస్తున్నారు.. సర్కారు మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు..– బోధన్‌ రూరల్‌  

నా పేరు బేగరి శ్రీనివాస్‌. మాది బోధన్‌ మండలం ఏరాజ్‌పల్లి. నాకు ఎకరం సొంత పొలం ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సన్న రకం ధాన్యం (బీపీటీ) సాగు చేశాను. ఒక పంటకు మూడెకరాల కోసం కౌలుకు రూ.39 వేలు.. పెట్టుబడి రూ.80 వేలు ఖర్చు చేశాను. మొత్తం రూ.1.19 లక్షలు అయ్యాయి. 72 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన రూ.1800 ధర లభించక పోవడంతో బహిరంగ మార్కెట్‌లో ధాన్యం రూ.1,610 లకు అమ్ముకుంటే రూ.1.16 లక్షలు వచ్చాయి. ఈ లెక్కన ఖరీఫ్‌ అంతా కష్టపడి సాగు చేస్తే రూ.3వేల నష్టం వచ్చింది.

జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో 1.60 లక్షల హెక్టర్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. వీటిలో ప్రధానంగా వరి పంటను సుమారు 65 వేల హెక్టార్లకుపైగా సాగు చేశారు. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి సరైన సమయంతో వర్షాలు కురిసి పంటలకు ధీమా కలిగించాయి. అల్ప పీడన ప్రభావంతో సెప్టెంబర్, అక్టోబర్‌ నెలాల్లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొన్ని రకాల పంటలు నీట మునిగి నష్టపోగా.. వరి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పొచ్చు. వాతావరణం అనుకూలించడంతో వరి పంటలను సాగు చేసిన ఈ ఏడాది కరెన్సీ నోట్లు, మద్దతు ధర విషయంలో అన్నదాతలకు కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా సన్న రకం ధాన్యం సాగు చేసిన రైతులకు ఈ కష్టాలు అధికంగా వెంటాడుతున్నాయి.– బోధన్‌ రూరల్‌

అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి..
ఈ ఏడాది ఖరీఫ్‌లో సన్నరకం ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా తయారైంది. వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరుగాలం పంట పొలాల్లో శ్రమించి పండించిన పంటలు అమ్ముకుందామంటే రైతులకు నానా తిప్పలు తప్పడం లేదు. పండించిన పంటకు లాభసాటి మద్దతు ధర లభించక సన్న రకం ధాన్యం రైతులు విలవిలలాడుతున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకే మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదురుర్కొంటుంటే ఇక యాసంగిలో ఎలా సాగు చేయాలో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ ఏదాది దొడ్డు రకం ధాన్యానికి రూ.1,510 మద్దతు ధర ప్రకటించి ఐకేపీ, సివిల్‌ సప్లయ్, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. సన్న రకం ధాన్యం మాత్రం ప్రభుత్వం నుంచి ఆశించిన లాభసాటి ధర లభించడం లేదు. ఇక బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుందామంటే కరెన్సీ నోట్ల కష్టాలతో దళారులు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో చేసేది లేక రైతులు తమ ఇళ్లలో, పంట పొలాల్లో ధాన్యం నిల్వ ఉంచుకుంటున్నారు. రాత్రుళ్లు జాగారం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement