ఆర్టీసీ బస్టాండ్లలో శుద్ధి చేసిన నీటిని ఉచితంగా అందించే వ్యవస్థను అధికారులే అటకెక్కించిన తీరును కళ్లకు కడు తూ ‘కమీషన్ల దాహం..
♦ ‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారులు
♦ అధికారులను వాకబు చేసిన సీఎం కార్యాలయం
♦ నీటి సరఫరా పునరుద్ధరణకు ఆదేశించిన ఆర్టీసీ జేఎండీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్టాండ్లలో శుద్ధి చేసిన నీటిని ఉచితంగా అందించే వ్యవస్థను అధికారులే అటకెక్కించిన తీరును కళ్లకు కడు తూ ‘కమీషన్ల దాహం.. నీటికి తాళం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. స్వయంగా సీఎం కార్యాలయం వాకబు చేయటంతో ఆర్టీసీ జేఎండీ రమణరావు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి దీనిపై వివరణ కోరారు. ఇలాంటి దుస్థితి ఎందుకొచ్చిందో పూర్తి నివేదిక ఇవ్వాలంటూ సంబంధిత విభాగాన్ని రమణరావు ఆదేశించారు. నీటి సరఫరాను పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దీంతో స్థానికంగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని బస్టాండులో నాటి ఎమ్మెల్సీ నాగేశ్వర్.. తన నిధుల కోటా నుంచి రూ.3 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన నీటి సరఫరా వ్యవస్థ ఏడాదిగా పనిచేయటం లేదు. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో అధికారులు దానికి మరమ్మతు చేయించారు. కేవలం రూ.3 వేల ఖర్చుతో అది నీటిని సరఫరా చేయటం ప్రారంభించటం విశేషం. ఇలా మిగతా ప్రాంతాల్లోని నీటి సరఫరా వ్యవస్థను కూడా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కూడా దీనిపై స్పందించారు. సోమవారం ఉదయం ఆయన ఈ విషయాన్ని సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆర్టీసీ జేఎండీ రమణరావుతో కూడా మాట్లాడారు. పేద ప్రయాణికులకు ఉచిత నీటి సరఫరా ఉపయుక్తంగా ఉంటుందని, వెంటనే దాన్ని పునరుద్ధరించాలని కోరారు. లేకుంటే మరోసారి తాను నిరసన బాట పడతానని హెచ్చరించారు.