నా అనుకున్నవారే శత్రువుల్లా మారి వేధించడంతో మనస్థాపంచెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
నా అనుకున్నవారే శత్రువుల్లా మారి వేధించడంతో మనస్థాపంచెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ రూరల్ మండలం కందికొండ కాలువ గట్టు వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మేళ్లచెరువు గ్రామానికి చెందిన వి. వీరారెడ్డి(24), భవానీ(22)కు రెండేళ్లక్రితం వివాహమైంది. వీరారెడ్డి వ్యవసాయం చేసి జీవనం సాగించేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే వీరారెడ్డి తమ్ముడు, అతని భార్య, తల్లి కామేశ్వరమ్మ అకారణంగా తమను సూటిపోటిమాటలు అంటూ వేధిస్తుండేవారని వీరారెడ్డి దంపతులు రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తాను, తన భార్య ఎలాంటి తప్పు చేయకపోయినా రోజూ గొడవపడుతూ తమను మానసికంగా వేధించేవారని అందులో రాశారు. కారణంగా తమను పలు విధాలుగా బాధపెడుతుండడంతో తమకు మరణం తప్ప మరో మార్గం లేక పురుగుల మందు తాగి ఇద్దరం మరణిస్తున్నామని, తమ అనంతరం తనకు చెందిన ఆస్తి మొత్తం తన భార్య భవానీ తల్లిదండ్రులకు చెందాలని వీరారెడ్డి లేఖలో పేర్కొన్నాడు. మోటార్‌బైక్‌లో వచ్చిన వీరారెడ్డి, భవానీ దంపతులు హుజూర్‌నగర్ రూరల్ మండలం వేపలసింగారం వద్ద కందికొండ కాలువ గట్టుపై చెట్టుకింద పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు హుజూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.