రాజధాని శంకుస్థాపన పండుగలా జరపాలి | The capital must be the foundation stone of the festival | Sakshi
Sakshi News home page

రాజధాని శంకుస్థాపన పండుగలా జరపాలి

Oct 7 2015 4:32 AM | Updated on Aug 14 2018 11:24 AM

రాజధాని శంకుస్థాపన పండుగలా జరపాలి - Sakshi

రాజధాని శంకుస్థాపన పండుగలా జరపాలి

రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

♦ 13 నుంచి 21 వరకు జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
♦ అన్ని గ్రామాల నుంచి సంకల్పజ్యోతి ర్యాలీలు
♦ ప్రతి ఊరి నుంచి ‘మట్టి’ని సేకరించి.. అమరావతికి తేవాలి
♦ సీఆర్‌డీఏ సమీక్షలో  సీఎం చంద్రబాబు నిర్దేశం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని, ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పండుగ వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) సమావేశంలో శంకుస్థాపన ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి సంకల్ప జ్యోతిని ప్రతి గ్రామం నుంచి ఆయా మండలాలకు, అక్కడినుంచి జిల్లాలకు ర్యాలీలుగా తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రం నుంచి ఈ జ్యోతిని గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణం వద్దకు తీసుకొచ్చేలా చూడాలన్నారు. అక్కడ అమరావతి సంకల్ప జ్యోతిని స్వయంగా తాను స్వీకరిస్తానని చెప్పారు.

 పుణ్య నదుల జలాల్నీ తేవాలి..
 ప్రతి గ్రామంలోనూ పుట్టమట్టిని, చెరువులు, కాలువల వద్ద నుంచి మట్టిని సేకరించి.. సర్వమత ప్రార్థనలతో పవిత్రంగా అమరావతి ప్రాంగణానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. గ్రామాలనుంచి మండలాలకు, అటునుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడినుంచి శంకుస్థాపన ప్రాంగణానికి తీసుకొచ్చిన మట్టిని ఒకచోటకు చేర్చి దాన్లోని కొంతభాగాన్ని రాజధాని శంకుస్థాపనకు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలోని నదులు, ఉపనదుల నుంచి పవిత్ర జలాలతోపాటు దేశంలోని పుణ్యనదుల జలాల్నీ శంకుస్థాపనకు తీసుకురావాలన్నారు. ఆయా గ్రామాల్లో సంకల్పజ్యోతి, మట్టి సేకరణలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనాలన్నారు. రాజధానికి భూమినిచ్చిన ప్రతి రైతుకూ ప్రత్యేక ఆహ్వానపత్రాన్నిచ్చి ఆహ్వానించాలని అధికారుల్ని ఆదేశించారు. వారికి ప్రభుత్వం తరఫున ఇచ్చేందుకు ఆప్కో నుంచి నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలన్నారు.

 ప్రతిష్టాత్మకంగా లోగో రూపకల్పన..
 అమరావతి లోగో రూపకల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బాబు సూచిస్తూ.. అది మన సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా ఉండాలన్నారు. ఇందుకోసం నిర్వహిస్తున్న పోటీలో వచ్చిన మూడు ఉత్తమ లోగోలను ఎంపిక చేసి వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆదేశించారు. అంతిమంగా ప్రజలు ఆమోదించిన దాన్నే అమరావతి లోగోగా ఎంపిక చేయాలని నిర్దేశించారు. ప్రజలంతా శంకుస్థాపనలో భాగస్వాములయ్యేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement