
అమరావతి మాస్టర్‌ప్లాన్ విడుదల..
అమరావతి నగర ముసాయిదా బృహత్ ప్రణాళికను (మాస్టర్‌ప్లాన్‌ను) రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శనివారం రాత్రి విడుదల చేసింది
చివరి నిమిషం వరకూ గోప్యత పాటించిన సీఆర్‌డీఏ
సాక్షి, విజయవాడ బ్యూరో: అమరావతి నగర ముసాయిదా బృహత్ ప్రణాళికను (మాస్టర్‌ప్లాన్‌ను) రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శనివారం రాత్రి విడుదల చేసింది. చివరి నిమిషం వరకూ ఈ నోటిఫికేషన్ విడుదల గురించి ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. చివరికి పబ్లిక్ నోటీసు ద్వారా ప్రణాళిక విషయాన్ని బహిర్గతపరిచింది. ప్రణాళిక కాపీలు సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌తోపాటు విజయవాడ, గుంటూరు, తెనాలి, తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నామని ఎవరైనా దీన్ని పరిశీలించవచ్చని అందులో పేర్కొంది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను 30 రోజుల్లోపు తెలపాలని కోరింది. ప్రజారాజధానిగా చెబుతున్న అమరావతి మాస్టర్‌ప్లాన్ విడుదల విషయంలో సీఆర్‌డీఏ గోప్యతపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
9 నగరాలు.. రోడ్లు, మెట్రో రైలు కారిడార్
గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లలో నిర్మిస్తున్న రాజధాని నగరానికి సంబంధించి ప్రతిపాదనలన్నింటినీ మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొంది. అత్యాధునిక రవాణా వ్యవస్థలు, ఎటువైపైనా సులభంగా ప్రయాణించే రోడ్డు మార్గాలు, కాలువలు, చెరువులు, గ్రీనరీతో ఎటుచూసినా ఆహ్లాద వాతావరణం ఉండే బ్లూ, గ్రీన్ ప్రణాళికలు, తొమ్మిది ప్రధానమైన అంశాలతో ఏర్పాటయ్యే నగరాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇందులో పొందుపరిచారు. న్యాయ, విద్య, విజ్ఞానం, ఆరోగ్య, పర్యాటక, దేవాదాయ, ఎలక్ట్రానిక్, ఆర్థిక, క్రీడా నగరాలతోపాటు పరిపాలనంతా ఒకేచోట కేంద్రీకృతమయ్యే ప్రభుత్వ నగరాన్ని రాజధానిలో నిర్మించాలని ప్రతిపాదించారు.
రాజధాని నగరంలో ప్రధాన రహదారులు 87 కిలోమీటర్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాల సముదాయంతోపాటు అన్ని ప్రత్యేక జోన్లను కలుపుతూ 22 కిలోమీటర్ల మెట్రో రైలు కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాజధాని రీజియన్‌లో 75 మీటర్ల వెడల్పుతో అంతర్గత రింగు రోడ్డు, 150 మీటర్ల వెడల్పుతో అవుటర్ రింగురోడ్డుతోపాటు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను ప్రతిపాదించారు. హైస్పీడ్ రైలు కారిడార్, జల రవాణా, సబర్బన్ రైలు, మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ను రీజియన్‌లో ఏర్పాటు చేయనున్నారు. రాజధాని రీజియన్ మొత్తాన్ని ఎనిమిది జోన్లుగా విభజించి వీటిని అభివృద్ధి చేయనున్నారు. ప్రతి జోన్‌లో ఒక ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ భవన సముదాయాల జోన్, పారిశ్రామిక జోన్, విద్యా జోన్, వాణిజ్య జోన్‌లను తొలి ప్రాధాన్యంగా రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు.
పలు మార్పులు, చేర్పులు...
రాజధాని బృహత్ ప్రణాళికను రూపొందించే బాధ్యతను తీసుకున్న సింగపూర్ ప్రభుత్వ సంస్థలు మొదట రాజధాని రీజియన్ (8603.32 చదరపు కిలోమీటర్లు) కోసం కాన్సెప్ట్ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. ఆ తర్వాత రాజధాని నగర మాస్టర్‌ప్లాన్‌ను (217 చదరపు కిలోమీటర్లు) రూపొందించి ఇచ్చింది. అనంతరం జులై 20వ తేదీన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదట నిర్మించే సీడ్ రాజధాని ప్రణాళికను (16.9 చదరపు కిలోమీటర్లు) అందించారు. వీటిపై సీఆర్‌డీఏ, ప్రభుత్వ యంత్రాంగం విస్తృతంగా అధ్యయనం చేసి జాతీయ, అంతర్జాతీయ ప్లానింగ్, రవాణా తదితర వ్యవస్థలకు సంబంధించి అభిప్రాయాలు సేకరించింది.
అభిప్రాయ సేకరణ తర్వాత జల వనరులు, రవాణా వ్యవస్థలో కొన్ని లోపాలను గుర్తించింది. దీంతోపాటు వివిధ దేశాల్లోని అత్యాధునిక నగరాల నిర్మాణ రీతులను పరిశీలించి వాటిని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సింగపూర్ ప్రణాళికలో మార్పులు చేయడంతోపాటు తొమ్మిది ప్రత్యేక నగరాల ఏర్పాటు, పకడ్బందీ రోడ్ల వ్యవస్థ (గ్రిడ్), రైలు మార్గాలను ప్రతిపాదించింది. చైనాకు చెందిన జీఐఐసీ సంస్థ కూడా ప్రణాళికలో పలు మార్పులు సూచించింది. సింగపూర్ సంస్థలైన సుర్బానా, జురాంగ్ ఈ మార్పులన్నీ చేసి ఈ నెల 22వ తేదీన సీఆర్‌డీఏ కమిషనర్‌కు రాజధాని బృహత్ ప్రణాళికను అందించింది. దానిపైనా ప్రభుత్వం కొన్ని మార్పులు సూచించింది. వాటన్నింటినీ చేర్చిన తర్వాత శనివారం ఎట్టకేలకు సీఆర్‌డీఏ ముసాయిదా ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు పబ్లిక్ నోటీసు ద్వారా ప్రకటించింది.
ఈ గ్రామాల్లో ఏర్పాటు
తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, మోదుగులలంక, ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండమరాజుపాలెం, పిచుకలపాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాల్టీలోని నులకపేట, డోలాస్‌నగర్, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, నవులూరు, ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల్లో ఈ ప్రణాళిక అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. వచ్చిన అభ్యంతరాలు, పరిశీలనలను బట్టి ప్రణాళికలో అవసరమైతే మార్పులు చేసి ఆ తర్వాత తుది ప్రణాళికను విడుదల చేయనుంది.