కళాకారులకు మైమ్‌ కళ ఉండాలి

కళాకారులకు మైమ్‌ కళ ఉండాలి


నిజ జీవితంలో తెలియకుండానే

మైమ్‌ కళను అనుసరిస్తుంటాం

రామప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలి

సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి
హన్మకొండ: ప్రతి కళాకారుడు మైమ్‌ కళను కలిగి ఉండాలని సినీ నటుడు, రచయిత  తనికెళ్ల భరణి అన్నారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో మైమ్‌ శిక్షణ కార్యక్రమాన్ని తనికెళ్ల భరణి, ధ్వన్యనుకరణ సామ్రాట్‌ నేరెళ్ల వేణుమాధవ్, సాంస్కృతిక శాఖ రాష్ట్ర సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తో కలిసి వరంగల్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మైమ్‌ కళతో శరీరం తేలికవుతుందన్నారు. నిజ జీవితంలో తెలియకుండానే మైమ్‌ కళను పాటిస్తామన్నారు.ఇతర కళాకారులు మైమ్‌ కళను నేర్చుకోవాల్సిన అవసరముందని, మైమ్‌ తెలిసిన కళాకారులు సులువుగా నటించగలుగుతారన్నారు. అభ్యాసకులు ప్రశ్నించేతత్వం కలిగి ఉండాలన్నా రు. నేరెళ్ల వేణుమాధవ్‌ సహస్ర కంఠకుడని, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ కళలకు, కళాకారులకు రక్షణగా నిలుస్తున్నారన్నారు. రామప్ప శిల్పా కళాసంపద వంటి కళాత్మక కట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదని, రామప్ప శిల్ప కళను, చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కళాభిమాని, సాహిత్యాభిమాని అని అన్నారు.కళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కళలను ప్రజల ముంగింట్లోకి తీసుకెళుతుందన్నారు. మైమ్‌ శిక్షణను ఇందులో భాగంగానే చేపట్టామన్నారు. అరుసం మధుసూదన్‌ (మైమ్‌ మధు) 18 దేశాలలో తిరుగుతూ మైమ్‌ ప్రదర్శనలు ఇస్తూనే నేర్చుకున్నారన్నారు. మైమ్‌లో అంతర్జాతీయ స్థాయి అవార్డు పొందిన ఏకైక కళాకారుడు మధు అని అన్నారు. వరంగల్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రాభివృద్ధితో పాటు, కళలను పెంచిపోషిస్తున్నారన్నారు. కళల్లో వరంగల్‌ జిల్లాను ముందు నిలపాలనే ఆలోచన సీఎం కేసీఆర్‌లో ఉందన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో కళాకారులు, సాహితీవేత్తలను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కళలకు, సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వరంగల్‌లో మైమ్‌ కళలో శిక్షణ కార్యక్రమం చేపట్టడం, ఈ శిక్షణ ఇవ్వడానికి మైమ్‌ మధు ముందుకురావడం అభినందనీయమన్నారు.మైమ్‌ కళాకారుడు అరుసం మధుసూదన్‌ మాట్లాడుతూ మన దేశ టెక్నిక్స్‌ని మనం మరచిపోతున్నామని, వీటిని విదేశాల్లో అనుసరిస్తున్నారన్నారు. శిక్షణకు వెళ్తున్న మనం కూడా మన టెక్నిక్స్‌నే నేర్చుకోవాల్సి వస్తోందన్నారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి శిక్షణ ఇస్తున్నామన్నారు. రాజమార్గంలో వెళ్లాలని, అడ్డదారిలో వెళ్లొద్దని తనకు సూచించిన తల్లిదండ్రుల మార్గంలో నడుస్తున్నానన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు నేరెళ్ల వేణుమాదవ్, కవులు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, గిరిజా మనోహర్‌బాబు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top