'ప్రత్యేక బంద్' సంపూర్ణం.. విజయవంతం

'ప్రత్యేక బంద్' సంపూర్ణం.. విజయవంతం - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ శనివారం వైఎస్సార్ సీపీ  తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది.  ఏపీలోని 13 జిల్లాల్లో ప్రజలు, ఉద్యోగులతో పాటు వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి.. ఏపీ బంద్కు వామపక్షాలు, పెట్రోల్ బంక్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రజా సంఘాల నుంచి కూడా మద్దతు వచ్చింది.

వేకువజాము నుంచే..రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో... పార్టీ శ్రేణులు తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో బంద్ లో పాల్గొన్నాయి. బస్సులను అడ్డుకోవడంతో పాటు,  షాపులను మూసివేయించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 3.30 గంటల నుంచి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బస్టాండ్ నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఆర్టీసీ డిపో ముందు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైఠాయించి బంద్ నిర్వహించాయి.విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచే బంద్ జరిగింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి బస్ డిపో ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. చిత్తూరు జిల్లా పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బంద్ చేశారు.శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్‌సీపీ బంద్ కారణంగా ఒడిశా, ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి. విశాఖ జిల్లా అరకులో స్వచ్చందంగా బంద్ కొనసాగింది. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉదయం 4 గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అంజద్, మేయర్ సురేష్ తదితరులు బంద్‌ను పర్యవేక్షించారు. ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి. గుంటూరు, తిరుపతి ఆర్టీసీ బస్ డిపోల నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. వామపక్షాలతో కలిసి మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్ ముట్టడించి నగరంలో భారీ బైక్ ర్యాలీ చేశారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.భారీ సంఖ్యలో నేతల అరెస్ట్బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 40 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని బంద్ ను అడ్డుకునే యత్నం చేశారు. 


 


అనంతపురం పట్టణంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్యుతాపురంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బంద్ లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.తూర్పుగోదావరి జిల్లాలో బంద్ లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలను అక్రమ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా కొందరు వైస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే,  వైఎస్సార్ సీపీ నేత పెండెం దొరబాబును అరెస్ట్ చేశారు. దీంతో పాటు బంద్ లో పాల్గొన్న 40 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కేంద్ర పాలక మండలి సభ్యుడు అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు, సీపీఎం, సీపీఐ కార్యకర్తలతో కలసి  ఆయన పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో  స్టేషన్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, పలువురు మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.శాంతియుతంగా బంద్ పాటిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.విశాఖలో ధర్నాకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డి సహా పలువురు సీపీఐ, సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తిరుపతి పట్టణంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతపురం జిల్లా ధర్మవరంలో నియోజకవర్గ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని గృహనిర్భందం చేశారు.నెల్లూరు జిల్లాలోని కావలిలో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయగా, గూడురులో మానవహారంతో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను అరెస్ట్ చేశారు.  కుప్పకూలిన గ్రంధి..పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శనివారం పట్టణంలో జరుగుతున్న బంద్ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడున్న సమయంలో ఉన్నట్టుండి పడిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top