
ఆరు నెలల్లో లాభాల్లోకి ఆర్టీసీ
వచ్చే ఆరు నెలల్లో నష్టాలను అధిగమించి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించనున్నట్లు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆరు నెలల్లో నష్టాలను అధిగమించి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించనున్నట్లు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. 43 డిపోలు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. రూ.కోటి 30 లక్షలతో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో చేపట్టనున్న పలు ఆధునీకరణ పనులకు గురువారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్లా బలాలలతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ జేఎండీ రమణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో బస్‌స్టేషన్‌ల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
చార్జీలు పెంచే ఆలోచన లేదు...
తెలంగాణ ఆర్టీసీలో చార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీని వినియోగించుకొనేది ఎక్కువ శాతం పేద ప్రజలేనని, వారిపైన తాము భారం మోపబోమని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఆ రాష్ట్రానికి చెందిన బస్సులే నడుస్తున్నాయని అన్నారు. త్వరలో తెలంగాణ ఆర్టీసీ బస్సులను విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి దూరప్రాంతాలకు నడపనున్నట్లు పేర్కొన్నారు. శబరిమలైకు 200 బస్సులను నడుపనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు.
రూ.1.30 కోట్లతో ఎంజీబీఎస్ ఆధునీకరణ...
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, అదనపు టాయిలెట్లు, ఫ్లోరింగ్, గార్డెనింగ్ తదితర మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు రూ.1.30 కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపన సభలో మంత్రులు నాయిని, తలసాని మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం వివిధ కేటగిరీల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన కండక్టర్‌లు, డ్రైవర్లు, పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అందజేశారు.
త్వరలో 500 కొత్త బస్సులు...
రూ.150 కోట్లతో త్వరలో 500 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. వీటిలో 400 పల్లె వెలుగు బస్సులు కాగా, 100 ఏసీ బస్సులని, వీటితో అన్ని జిల్లా కేంద్రాలను, ప్రధాన పట్టణాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేస్తారన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకొనేందుకు మాత్రమే జీహెచ్‌ఎంసీ రూ.137 కోట్ల సహాయాన్ని అందజేసిందని, ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదన లేదని, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంస్థ పాలకమండలి సభ్యులుగా వ్యవహరిస్తారని చెప్పారు. కాగా, నిరుద్యోగులకు ఉపాధి కోసం 100 సెట్విన్ బస్సులకు ప్రభుత్వం త్వరలో అనుమతి ఇవ్వనుంది.