ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఎన్ఎస్యూఐ నూతన కార్యవర్గ సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేసిన ఆయన.. పాఠశాలల్లో అక్రమ ఫీజులను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మెడికల్ కళాశాలల్లో, డ్రీమ్డ్ యూనివర్సిటీల్లో మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు అమలు చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు.
కార్పోరేట్ కళాశాలల అక్రమాస్తులపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రఘువీరా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రనకై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రీయ విద్యా సంస్థలను వెంటనే ప్రారంభించాలని ఆయన ప్రభత్వాన్ని కోరారు.