కమీషన్ల కక్కుర్తి
హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ వస్తే కమీషన్లు దండుకోవచ్చునన్న రీతిలో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు.
– కేంద్ర మంత్రి వెంకయ్యతో కుమ్మక్కై హోదాను దాటవేస్తున్న బాబు
– పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజం
ధర్మవరం టౌన్ : హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ వస్తే కమీషన్లు దండుకోవచ్చునన్న రీతిలో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి, అక్రమాలే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో విభజన చట్టంలో రూపొందించిన హామీల ప్రకారం ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి రూ.24,350 కోట్ల నిధులను ఇచ్చిందన్నారు.
ఆ నిధులు ఏ ప్రాతిపదికన ఖర్చు చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు, పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి దొరుతుందన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టకుండా హోదా సంజీవని కాదు.. ప్రత్యేక ప్యాకేజీ వస్తే చాలన్న రీతిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో చంద్రబాబు కుమ్మక్కై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అమీర్‌బాషా, పెనుగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేటీ శ్రీధర్, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ రంగన అశ్వర్థనారాయణ, రాప్తాడు ఇన్‌చార్జ్ రమణారెడ్డి పాల్గొన్నారు.


