ప్రభుత్వ వైద్యానికి ప్రైవేటు జబ్బు
ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ ప్రభుత్వం చూస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
	అనంతపురం సప్తగిరి సర్కిల్ : ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ ప్రభుత్వం చూస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓ లాడ్జిలో ఆర్‌ఎంపీల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేడు ప్రభుత్వ వైద్యశాలల్లో పిల్లలను ఎలుకలు కొరికి తినే పరిస్థితి ఏర్పడిందన్నారు.  ప్రభుత్వ వైద్యం 60 శాతం వరకూ కార్పొరేట్‌కు తరలిపోతోందన్నారు.
	
	
	ఆర్‌ఎంపీలపై జరుగుతున్న భౌతిక దాడులను ఆపాలని, వారికి కేటాయించిన నిధులను సత్వరమే విడుదల చేయాలన్నారు.  ఆరోగ్యశ్రీని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆర్‌ఎంపీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ సిద్ధార్థ, ప్రధాన కార్యదర్శి జీఎస్ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు  మస్తానయ్య, సుధాకర్, ట్రెజరర్ వైడీ వర్మ, విశ్వనాథరెడ్డి, దాదాగాంధీ, మహ్మద్ రఫి తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
