గుంటూరు సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ వి.నాగేంద్రరావు (ఐఆర్‌ఎస్)కు జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి అవార్డు లభించింది.
విజయవాడ బ్యూరో: గుంటూరు సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ వి.నాగేంద్రరావు (ఐఆర్‌ఎస్)కు జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి అవార్డు లభించింది. ఈ నెల 24న ఢిల్లీలో జరిగే సెంట్రల్ ఎక్సైజ్ డే వేడుకల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నాగేంద్రరావుకు సమాచారం అందింది. పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామానికి చెందిన నాగేంద్రరావు 1992లో సివిల్ సర్వీసెస్ పరీక్ష పాసై సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.
2002లో అసిస్టెంట్ కమిషనర్‌గానూ, 2015లో అడిషనల్ కమిషనర్‌గానూ పదోన్నతులు పొందిన నాగేంద్రరావు మీరట్, చెన్నై, మంగళూర్ నగరాల్లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సెంట్రల్ ఎక్సైజ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోన్న నాగేంద్రరావు మంచి అధికారిగా కేంద్రప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారు. ఈ నెల 24న ఢిల్లీలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోన్న సందర్భంగా ఈయనను రాష్ట్రపతి అవార్డుకు ఎంపికచేశారు. దేశవ్యాప్తంగా 17మందిని ఎంపిక చేయగా, మన రాష్ట్రం నుంచి ఎంపికైంది నాగేంద్రరావు ఒక్కరే.