టీఆర్‌ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

టీఆర్‌ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే - Sakshi


గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయం

కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరం

లైన్ క్లియర్ కోసం డీఎస్ ప్రయత్నాలు

హరీశ్‌రావు తుది నిర్ణయం కోసం ఎదురుచూపు


 

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అభివృద్ధి మంత్రంతో సీఎం కేసీఆర్ చేపట్టిన రాజకీయ పునరేకీకరణ ఉద్యమానికి జిల్లాలో మరో కాంగ్రెస్ నేత ఆకర్షితుడయ్యారు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి.నందీశ్వర్‌గౌడ్ ‘కారు’ ఎక్కేందుకే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే  మంత్రి టి.హరీశ్‌రావును కలిసి తన మనుసులో మాట చెప్పినట్టు సమాచారం. మంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గులాబీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీలో ఒంటరిగా చేరకుం డా తన వెంట కొంతమంది ప్రజా ప్రతినిధులను కూడా తీసుకువెళ్లేం దుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నందీశ్వర్ వర్గీయులు కొందరు టీఆర్‌ఎస్‌లో చేరారు.

 

 నందీశ్వరే తన అనుచరులను టీఆర్‌ఎస్ వైపు పంపించారని, త్వరలోనే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడిపోతారనే ప్రచారం జరిగింది. నిజానికి 2014 సాధారణ ఎన్నికల ముందే నందీశ్వర్‌గౌడ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో గులాబీ దళపతి కేసీఆర్‌ను ఫాంహౌస్‌లో కలిశారు. ఇక ఆయన చేరిక లాంఛనమే అనుకున్న సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, తన రాజకీయ గురువు డి.శ్రీనివాస్‌తోపాటు, రాహుల్ గాంధీ దూత ఒకరు ఆయనకు ఫోన్ చేసి పార్టీని వీడొద్దని వారించడంతో నందీశ్వర్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సాధారణ ఎన్నికల ముగిసిన నాటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు.

 

 మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ ఆయన ఇంటికే పరిమితమయ్యారు. డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడంతో  టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం నందీశ్వర్‌కు అనివార్యంగా మారింది. డి.శ్రీనివాస్ కూడా మంత్రి హరీశ్‌రావును కలిసి తన శిష్యుడిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించాలని కోరినట్టు తెలిసింది. జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నందీశ్వర్‌ను పార్టీలో తీసుకునే విషయమై హరీశ్‌రావు కొంత ఆచీతూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరో వైపు మంత్రి హరీశ్‌రావుపై ఒత్తిడి తీసుకొచ్చి నందీశ్వర్‌గౌడ్‌ను పార్టీలో చేర్చించడానికి డి.శ్రీనివాస్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నందీశ్వర్‌గౌడ్ బంధువు కూడా పావులు కదుపుతున్నట్టు సమాచారం.

 

  పక్కరాష్ట్ర ప్రభుత్వంలో ఓ కీలక ప్రజాప్రతినిధికి సీఎం కేసీఆర్‌కు గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి ఒకే పార్టీలో పని చేశారు. ఒక దశలో సీఎం కేసీఆర్ ద్వారా ఆయనకు గులాబీ కండువా కప్పే ప్రయత్నం చేయగా.... నందీశ్వర్ మాత్రం జిల్లా మంత్రి హరీశ్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పార్టీలో చేరాలని, అప్పుడే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top