ఎండిన ఆశలు | N0 Hopes | Sakshi
Sakshi News home page

ఎండిన ఆశలు

Aug 26 2016 8:06 PM | Updated on Sep 4 2017 11:01 AM

వట్టెం శివారులో వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయిన మొక్కజొన్న

వట్టెం శివారులో వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయిన మొక్కజొన్న

నాగర్‌కర్నూల్‌: ఈ ఏడాది కూడా కరువు కన్నీళ్లను మిగిల్చింది. వరుణుడు మరోసారి రైతులను మోసం చేశాడు. వరుసగా మూడో ఏడాది కూడా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కరువు తిష్ట వేయడంతో మొక్కజొన్న చేతికందే పరిస్థితి లేదు. పత్తి పరిస్థితి మారీ దారుణంగా మారింది. అక్కడక్కడా కొద్దిపాటి చేలు పండినా నష్టమే మిగిలేలా ఉంది.

కరువు కోరల్లో కందనూలు
  • కరుణించని వరుణుడు 
  •  వానలు రాక మొలకదశలోనే ఎండిన పంటలు 
  •  చిత్తయిన మక్క రైతు, తేలిపోతున్న తెల్లబంగారం 
  •  నష్టాల పాలవుతున్న రైతులు 
 
– నాగర్‌కర్నూల్‌: ఈ ఏడాది కూడా కరువు కన్నీళ్లను మిగిల్చింది. వరుణుడు మరోసారి రైతులను మోసం చేశాడు. వరుసగా మూడో ఏడాది కూడా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కరువు తిష్ట వేయడంతో మొక్కజొన్న చేతికందే పరిస్థితి లేదు. పత్తి పరిస్థితి మారీ దారుణంగా మారింది. అక్కడక్కడా కొద్దిపాటి చేలు పండినా నష్టమే మిగిలేలా ఉంది.  
 
 
                                   ఈ ఏడాదైనా తమ జీవితాలు బాగుపడుతాయనుకున్న రైతుల ఆశలు మరోసారి అడియాశలు అవుతున్నాయి. మూడేళ్లుగా చేసిన అప్పులు ఈ సారి పంటలు పండించి తీర్చుకుందామని అనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. ఖరీఫ్‌ ఆరంభంలో కొంతమేర వర్షాలు పడడంతో సంతోషించిన రైతులు అప్పులు చేసి మరీ కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశారు. అయితే మొదట మురిపించిన వర్షం ముఖం చాటేయడంతో వేసిన పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలోకి రైతులను నెట్టివేసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే కురిసినా జూలై మాసంలో చుక్క వర్షం కూడా పడలేదు. ప్రభుత్వం మాట విని మొక్కజొన్న సాగు భారీగా చేసినా, కంకిదశలో ఒక్క వర్షం కూడా పడకపోవడంతో పంట చేయి దాటిపోయింది. పత్తి రైతును నట్టేట మునిగే పరిస్థితి దాపురించింది. కంది, జొన్న, ఆముదం పరిస్థితి కూడా అలాగే ఉంది. 
 
పంటసాగు ఇలా..
నియోజకవర్గంలోని నాగర్‌కర్నూల్, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లో మొత్తం 71, 148హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో మొక్కజొన్న, వరి, పత్తి, ఆముదం, కంది వంటి పంటలు ఎక్కువగా సాగుచేశారు. ఇప్పటికే మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయి వందశాతం నష్టం రైతులకు కలిగింది. నాగర్‌కర్నూల్‌ మండల నల్లవెల్లి, తెలకపల్లి మండలం రాకొండ, గడ్డంపల్లి మరి కొన్ని గ్రామాల్లో కరువును ముందే ఊహించిన రైతులు తమ పంట చేలను కోసి పశువులకు మేతగా వేస్తున్నారు. 
 
మండలాల వారీగా పరిస్థితి...
        నాగర్‌కర్నూల్‌ మండలంలో 7300హెక్టార్లలో మొక్కజొన్న, 3100హెక్టార్లలో పత్తి, 140 హెక్టార్లలో ఆముదం, 50హెక్టార్లలో వరి, 82హెక్టార్లలో జొన్న, 132హెక్టార్లలో కంది పంటలు పండించారు. ఇప్పటికే వర్షాలు లేక 80శాతం పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దాదాపు నాగర్‌కర్నూల్‌ మండలంలోనే రూ.35 కోట్ల మేర రైతులు నష్టపోయి ఉంటారనేది అంచనా.
– తెలకపల్లి మండలంలో 4369 హెక్టార్లలో మొక్కజొన్న, 6196 హెక్టార్లలో పత్తి, 68హెక్టార్లలో జొన్న, 149హెక్టార్లలో కంది, 37హెక్టార్లలో ఆముదం పంటలు సాగు చేశారు. మొక్కజొన్న, జొన్న పంట దాదాపు ఎండిపోయింది. మరో వారం రోజుల్లో వర్షాలు పడితే పత్తి, కంది పంటల వల్ల కనీసం పెట్టుబడులైనా వస్తాయి. ఈ మండలంలో దాదాపు రూ.27కోట్ల మేర రైతులు నష్టపోయి ఉంటారనేది అంచనా. మొక్కజొన్న పంటలు ఎలాగో చేతికి రావని అనుకున్న రైతులు ఇప్పటికే పొలాల్లో పంటలను తొలగించి, పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు. 
– తాడూరు మండలంలో 6500 హెక్టార్లలో మొక్కజొన్న, 3500హెక్టార్లలో పత్తి, 800హెక్టార్లలో కందులు, 50హెక్టార్లలో జొన్న, 100హెక్టార్లలో ఆముదం పంటలు సాగు చేశారు. అక్కడక్కడా మినహా పూర్తిగా ఎండిపోయింది. పత్తి పూత దశలోనే ఎదుగుదల ఆగిపోయింది. ఈ మండలంలో దాదాపు రూ.23కోట్ల నష్టం ఉంటుంది. 
– బిజినేపల్లి మండలంలో 9200 హెక్టార్లలో మొక్కజొన్న, 7400 హెక్టార్లలో పత్తి, 1000 హెక్టార్లలో జొన్న, 1200 హెక్టార్లలో కంది పంటలను సాగుచేశారు.  ఏడాది గతం కంటే ఎక్కువగా సాగు చేశారు. మొక్కజొన్నలో కంకిదశలో ఎండిపోతుండగా, పత్తి పూత రాలుతోంది. ఇప్పటికే రైతులు దాదాపు రూ.40కోట్ల మేర నష్టపోయి ఉంటారని అంచనా.
– తిమ్మాజీపేట మండలంలో 5531 హెక్టార్లలో మొక్కజొన్న, 5215 హెక్టార్లలో పత్తి, 278 హెక్టార్లలో వరి, 511హెక్టార్లలో జొన్న, 106 హెక్టార్లలో ఆముదం, 471 హెక్టార్లలో కందులు పండించారు. ఈ మండలంలో దాదాపు 25 కోట్ల మేర నష్టం జరిగింంటుందని అంచనా.
 
 
పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య 
కరువు దెబ్బకు అప్పులపాలైన రైతులు తమ జీవితాలను వదులుకుంటున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత దుర్భిక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం నాగర్‌కర్నూల్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. తన ఐదెకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేయగా, అది పూర్తిగా ఎండిపోవడంతో పాటు గతేడాది చేసిన అప్పులు కూడా ఉండటంతో చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
 
 
వర్షపాతం
(జూన్, జూలై, ఆగస్టు 25వ తేదీ వరకు) (మిల్లీమీటర్లలో) 
మండలం     సాధారణ కురిసిన లోటు 
వర్షం వర్షం
నాగర్‌కర్నూల్‌ 298 195 103
తెలకపల్లి 277 134 143
తాడూరు 246 130 116
బిజినేపల్లి 313 125 188
తిమ్మాజీపేట 339 100 239 
 
కాడి వదిలి కాటికి పోయే పరిస్థితి
కాలం బాగుంటుందంటే అప్పులు చేసి పంటలు సాగు చేశాం. ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయాం. ఇప్పుడు కాడి వదిలి అప్పుల్లో కాటికి పోయే పరిస్థితులు వచ్చాయి. మూడేళ్లుగా వరుస కరువుతో తీవ్రంగా నష్టపోయాం. పొట్ట చేతపట్టుకొని వలస పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 
– వి.శివ, ఆనేఖాన్‌పల్లి తండా, కార్కొండ
 
 
పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి
యవసమే జీవనాధారంగా బతికే మాబోటి గిరిజన బతుకులకు ఆధారమైన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. మూడేళ్ల కరువులో పొట్ట చేతపట్టుకొని సంపాదించిందంతా పంటలకే పోతుంది. చేసిన అప్పులు తీర్చలేక ఉన్న పొలాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి. కరువులో సర్కారు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. రెండేళ్లుగా పంటలు నష్టపోయిన నేటికీ రూపాయి కూడా అందకపాయే.
– రాత్లావత్‌ లక్ష్షి్మ, బొర్సుగడ్డ తండా
 
 
 
 
 

Advertisement

పోల్

Advertisement