ఎమ్మెల్యే రాజు (వెర్సెస్) పీవీఎస్‌ఎన్ రాజు

ఎమ్మెల్యే రాజు (వెర్సెస్)  పీవీఎస్‌ఎన్ రాజు - Sakshi


 ‘రాజు’కుంటోంది!

 

ఎమ్మెల్యే రాజు వెర్సెస్ పీవీఎస్‌ఎన్ రాజు

తారస్థాయికి టీడీపీ గ్రూపు రాజకీయాలు

భక్తులకు సేవల్లోనూ రాజకీయ ద్వేషాలు


 

 రావికమతం : చోడవరం టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. రావికమతం మండలం కళ్యాణపులోవ తిరునాళ్లలో తారాస్థాయికి చేరుకున్నాయి. ఏటా ఇక్కడి పోతురాజుబాబు ఆలయం వద్ద టీడీపీ నాయకుడు పీవీఎస్‌ఎన్ రాజు రెండెకరాల స్థలాన్ని చదును చేయించి భారీగా షామియానాలు వేయించేవారు. శివరాత్రి జాతరకు ఇక్కడికి వచ్చే వేలాది మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించి, జాతరలో జాగారానికి పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసేవారు. చిటెకెల భజన, చెట్టుభజన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా టెంట్‌లు వేయించి, స్నానాల రేవుకు చేరుకోలేని వృద్ధులు ,చిన్నారుల కోసం ప్రత్యేక మోటార్లు,పైపులైన్‌తో గట్టువద్ద నీటిజల్లు ఏర్పాటు చేసేవారు. దీనికి వివిధ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాకరించేవారు. ఇదంతా ఎమ్మెల్యే రాజుతో పాటు, ఆయన వర్గీయులకు కంటగింపుగా మారింది. ఒకే పార్టీలో మరోబలమైన గ్రూపును తయారుచేస్తున్నందున పీవీఎస్‌ఎన్ రాజు వద్దకు వెళ్లవద్దంటూ పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులకు పరోక్షంగా హుకుం జారీఅయింది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని ఆయన వద్దకు వెళ్లే సర్పంచ్‌లు,ఎంపీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపు ఉండదంటూ ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్యే మాటగా ఎంపీపీ దంగేటి రామకృష్ణ పదేపదే తెగేసి చెబుతున్నారు. దీంతో ఆపార్టీకి చెందిన వారెవ్వరూ పీవీఎస్‌ఎన్‌ను నేరుగా కలవడంలేదు. ఈ ఏడాది కళ్యాణపులోవ తిరునాళ్లులో పీవీఎస్‌ఎన్ రాజు భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేసినా నలుగురు ఐదుగురు మినహా టీడీపీ వారంతా దూరంగా ఉన్నారు.



ఈ ఏడాది ఎమ్మెల్యే వర్గీయులు ఇంకా పట్టుబిగించారు. తిరునాళ్లలో అన్నసమారాధన చేపట్టాలన్నా తన అనుమతి తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాజు నొక్కి చె ప్పారు. ఎవరెవరు ఏఏ సేవా కార్యక్రమాలు చేపడుతున్నదీ తనకు ముందుగా చెబితే  క్రమ పద్ధతిలో నిర్వహించేలా సూచనలిస్తానని ఉత్సవకమిటీ సభ్యులచే దాతలందరికీ చెప్పించారు. ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది తిరునాళ్లుకు రూ.22 లక్షలు ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయించి సుమారు 20 ఎకరాల్లో చదును చేయించారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజు కనుసన్నల్లోనే పనులన్నీ జరుగుతున్నాయి. ఉచిత అన్నసమారాధనకు 24 కౌటర్లు సిద్ధం చేశారు. అందులో ఒకటి పీవీఎస్‌ఎన్ రాజుకు కేటాయిస్తున్నట్టు ఆయనకు అనుచరుల ద్వారా కబురు పంపారు. అదీకూడా ఒకే కూర,సాంబారు అన్నం పెట్టాలని.. ధనబలముందని రెండు మూడు కూరలు పెట్టకూడదని,  ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదని సమాచారం పంపారు. దీంతో పీవీఎస్‌ఎన్ రాజు మనస్థాపం చెంది ఏర్పాట్లు ఆపేశారు.

 

 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top