మధ్యాహ్న భోజనానికి మంగళం

మధ్యాహ్న భోజనానికి మంగళం - Sakshi

సత్యదేవ డిగ్రీ కళాశాలలో దూరప్రాంత విద్యార్థుల అవస్థలు

గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించిన అన్నవరం దేవస్థానం

అన్నదానం నిధులను దీనికి వెచ్చించరాదన్న ఉన్నతాధికారులు

ఎలాగైనా కొనసాగించాలని కోరుతున్న విద్యార్థులు

అన్నవరం :

దూరప్రాంత విద్యార్థుల కోసం సత్యదేవ డిగ్రీ కళాశాలలో గత ఏడాది ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని అన్నవరం దేవస్థానం నిలిపివేసింది. దీంతో దూరప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచి క్యారియర్‌ తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తరగతులకు ఆలస్యమవుతోందని వాపోతున్నారు.

400 మంది విద్యార్థులకు ప్రయోజనం

అన్నవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యదేవ డిగ్రీ కళాశాలలో 630 మంది చదువుతున్నారు. వీరిలో 400 మంది శంఖవరం, రౌతులపూడి, తొండంగి, తుని మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు. వారి తల్లితండ్రులు చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలుగా ఉంటూ తమ పిల్లలను కళాశాలలో చదివిస్తున్నారు. కాయకష్టంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి.. ఉదయాన్నే తమ పిల్లలకు భోజనం తయారు చేసి ఇవ్వడం  ఇబ్బందికరమే. ఇంట్లో వంట పూర్తయిన తరువాత క్యారియర్‌ సర్దుకుని, సుమారు పది పదిహేను కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ విద్యార్థులు రావాల్సిన పరిస్థితి. దీంతో వారు కళాశాలకు ఆలస్యంగా వస్తున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ 400 మంది విద్యార్థులకు అన్నదానం పథకం నిధులతో మధ్యాహ్న భోజనం పెట్టాలని దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్‌ ఏడో తేదీన అప్పటి దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రామ్‌కుమార్‌తో కలిసి ఈఓ కె.నాగేశ్వరరావు ఈ పథకాన్ని ప్రారంభించారు.  గత మార్చి వరకూ దీనిని అమలు చేశారు. అన్నదాన పథకం ని««దlులను విద్యార్థుల భోజనానికి వెచ్చించడంపై ఆడిట్‌ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతోపాటు ఉన్నతాధికారులు కూడా ఇందుకు అనుమతి నిరాకరించారు. ఫలితంగా ఈ పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది.

ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తే మేలు

కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేసి ఉంటే ఈ ఇబ్బంది తలెత్తి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 400 మంది విద్యార్థులకు భోజనం అంటే రోజుకు కనీసం రూ.10 వేల ఖర్చవుతుంది. ఏడాదికి ఎనిమిది నెలలు కళాశాల పని చేస్తుందనుకుంటే మధ్యాహ్న భోజనానికి సుమారు రూ.25 లక్షలు అవసరం. దేవస్థానం 50 శాతం కేటాయించి, మిగిలిన మొత్తాన్ని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్‌  ద్వారా  ఈ పథకాన్ని కొనసాగిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అంటున్నారు.

సాంకేతిక కారణాలతోనే..

డిగ్రీ కళాశాలలో మ«ధ్యాహ్న భోజనం పథకాన్ని సాంకేతిక కారణాలతో నిలిపివేయాల్సి వచ్చింది. అన్నదాన పథకం నిధులతో ఈ పథకాన్ని నిర్వహించాలని అనుకున్నా సాధ్యపడలేదు. అన్నదాన పథకంలో బయోమెట్రిక్‌ పద్ధతి ప్రవేశపెట్టడంతో రోజూ ఎంతమంది భోజనం చేస్తున్నారో స్పష్టంగా లెక్క తెలుస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు మళ్లీ ప్రయత్నిస్తాం.– కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top