మొలగవళ్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
Jan 4 2017 12:26 AM | Updated on Oct 9 2018 5:39 PM
ఆలూరు రూరల్: మొలగవళ్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆస్పరి మండలం హలిగేరకు చెందిన బంగి హనుమన్న భార్యది మొలగవళ్లి గ్రామం. పుట్టింటికి వచ్చిన భార్య హనుమంతమ్మను, ఇద్దరు కూతుళ్లను తిరిగి తీసుకెళ్లేందుకు వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పని ఉందని హనుమన్న బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికొచ్చాడు. కొద్ది సేపటికి వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందాడు. హనుమన్న మొలగవళ్లి గ్రామంలో ఇంటి నుంచి ఎవరితో బయటకు వెళ్లాడు, తిరిగి ఎవరి సాయంతో ఇంటికి వచ్చాడో కూడా తెలియకపోవడంతో ఆయన మృతిపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం ఆలూరు పోలీసులకు అనుమానస్పదస్థితిలో మృతిచెందాడని ఫిర్యాదు చేశారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఆలూరు ఆస్పత్రికి తరలించారు. ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్‌ఐ ధనుంజయ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.
హత్యకేసులో నిందితుడు
మృతిచెందిన హనుమన్న ఆస్పరి మండలం హలిగేరలో తలారి వర్గానికి చెందిన నల్లన్న హత్య కేసులో ప్రధాన నిందితుడు. 2013లో జరిగిన నల్లన్న హత్యతో గ్రామంలో ఫ్యాక‌్షన్ వాతావరణం నెలకొంది. నల్లన్న హత్యకు ప్రతీకారంగా 2014 జూలై 8వ తేదీన బంగి హనుమన్న వర్గీయులు బంగి శ్రీనివాసులు, బంగి మల్లయ్య, బంగి రామాంజనేయులను దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో బంగి హనుమన్న త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ క్రమంలో అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. హలిగేరలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆలూరు సీఐ శంకరయ్య ఆధ్వర్యంలో ఆస్పరి ఎస్‌ఐ వెంకటరమణ, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ శంకరయ్య గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.
Advertisement
Advertisement