పేదలపై ప్రతాపమా! | Kaasu Mahesh Reddy on govt | Sakshi
Sakshi News home page

పేదలపై ప్రతాపమా!

Aug 29 2017 2:15 AM | Updated on May 29 2018 4:40 PM

పులిచింతల ప్రాజెక్టుకు భూములు, ఇళ్లు ఇచ్చిన పేదలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని వైఎస్సార్‌సీపీ గురజాల

కక్షసాధింపు చర్యలు దారుణం
► ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం
► అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు


గుంటూరు వెస్ట్‌ : పులిచింతల ప్రాజెక్టుకు భూములు, ఇళ్లు ఇచ్చిన పేదలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని వైఎస్సార్‌సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారులను ఉసిగొల్పి అమాయకులపై వేధింపులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక శాసన సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు వ్యక్తిగత కక్షలతో గోవిందాపురంలో నివసిస్తున్న దాదాపు 200 మందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారులు కూడా శాసన సభ్యుడి ఆదేశాల మేరకే ఈ పని చేశామని చెప్పడం దారుణమన్నారు. విద్యుత్‌ సౌకర్యం లేక గ్రామస్తులు అంధకారంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని, వారికేమైనా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామస్తుల సమస్యలను సోమవారం గుంటూరులో మీకోసం కార్యక్రమంలో కలెక్టర్‌ కోన శశిధర్‌ను కలిసి వివరించారు. గ్రామస్తులతో కలసి కలెక్టర్‌ను కలిసిన ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

సాక్షి, అమరావతి బ్యూరో : మాచవరం మండలం గోవిందాపురం గ్రామం పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం గ్రామస్తులు తమ భూములు, ఇళ్లు త్యాగం చేశారు. వారికి కేటాయించిన పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని పక్కన పెట్టేసింది. ప్రస్తుతం గ్రామస్తులు నివసిస్తున్న గ్రామానికి మాత్రం విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసి కక్షసాధింపులకు దిగుతోంది.

కనీసం సర్పంచ్‌కి, గ్రామస్తులకు ముందస్తు సమాచారం కూడా లేకుండా అధికార పార్టీ నేతలే దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు. పది రోజుల క్రితం తాగునీటి సరఫరా నిలిపివేయగా, వినాయక చవితి పండుగ రోజు గ్రామం మొత్తానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. గ్రామస్తులు అధికారుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోయింది. తాము ఏమీ చేయలేమని వారు చేతులెత్తేయడం గమనార్హం.

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైనందునే..
గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే దుగ్ధతోనే అధికారపార్టీ నేతలు వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. బలవంతంగా గ్రామానికి సంబంధించి తాగునీటి వనరు అయిన బోరు, మోటారును పదిరోజుల క్రితమే పీకేశారు. స్థానికంగా ఉన్న చేతిపంపు నీటితోనే గ్రామస్తులు కాలం వెళ్లదీస్తున్నారు. దీనికితోడు నాలుగు రోజులుగా విద్యుత్‌ సరఫరా కూడా తొలగించడంతో వర్షాలకు తోడు, అటవీ ప్రాంతంలో గ్రామం ఉండటంతో రాత్రివేళ అంధకారంలో 200 మంది గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రి వేళ పాములు, విష పురుగుల బారిన పడితే తమకు దిక్కెవరని కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదేమి వివక్ష?
ప్రజలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం పార్టీల పేరుతో వివక్షలకు దిగటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామం గోవిందాపురంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారు గ్రామానికి సమీపంలో పునరావాస కాలనీ నిర్మించుకున్నారు. ఆ కాలనీకి మాత్రం అధికారులు విద్యుత్తుతో పాటు, మౌలిక వసతులు కల్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలం వర్గీయులు మోర్జంపాడులో ఇళ్లు నిర్మించుకుంటున్నారు.. ఇళ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆ కాలనీకి ఇప్పటి వరకు విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. మౌలిక వసతుల జాడే లేదు. నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గీయులను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


ఇంత దయలేని పాలన ఎప్పుడూ చూడలేదు
ఇంత దయలేని పాలనను ఎప్పుడూ చూడలేదు. బీదవారి పైనా వీరి ప్రతాపం? నీళ్లు తొలగించారు, విద్యుత్‌ కట్‌ చేశారు. ప్రభుత్వం, అధికారులే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి. కేవలం కక్షసాధింపు కోసమే ఈ పనిచేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కలెక్టర్‌కు సమస్యను వివరించాం. ఆయన మా అందరికీ న్యాయం చేస్తారని భావిస్తున్నాం.
– ఎం.రామ నరసమ్మ, గోవిందాపురం సర్పంచ్‌

యరపతినేని కక్షసాధింపునకు యత్నిస్తున్నారు
పేరుకే ముంపు గ్రామం అని చెబుతున్నారు. వాస్తవానికి గురజాల ఎమ్మెల్యే యరపతినేని రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు. ఉన్న ఫళంగా కరెంట్‌ తీసేస్తే ఎలా బతకాలి. మా ప్రాంతం అడవికి దగ్గరగా ఉంటుంది. పిల్లా పాపలతో జీవిస్తున్నాం. ఏమైనా అయితే ఎవరు బాధ్యులు. కాసు మహేష్‌రెడ్డి మా తరఫున పోరాడుతున్నారు. ఆయన వెంటే మేమంతా ఉంటాం.
– పి.శేషిరెడ్డి, గోవిందాపురం

వసతులు ఉంటే వెళ్లిపోతాం
ఇది పులిచింతల ముంపు గ్రామం. ఎప్పటికైనా వెళ్లాల్సిందే. మాకు ప్రత్యామ్నయంగా మోర్జం పాడులో నిర్మిస్తున్న గృహాలు ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఇక్కడ ఉన్నాం. అక్కడ ఇళ్లు పూర్తయ్యి, నీరు, విద్యుత్‌ ఉంటే ఎప్పుడైనా వెళ్లిపోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈ విషయమే అధికారులకు చెప్పాం. అయినా వినలేదు. మూడు రోజులుగా కరెంట్‌ లేదు. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఈ విషయం గమనించాలి. మాలాంటి బీదలతో రాజకీయాలు చేస్తే ఎలా. కలెక్టర్‌ మాకు న్యాయం చేయాలి.
– హనుమంతు, గోవిందాపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement