షార్ నుంచి నేటి సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమయ్యారు.
కొనసాగుతున్న కౌంట్‌డౌన్
వాతావరణాన్ని మెరుగ్గా అధ్యయనం చేయనున్న ఇన్‌శాట్-3డీఆర్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05) ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించి బుధవారం మధ్యాహ్నం 11.10కి ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
గురువారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడంతో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. 29 గంటల కౌంట్‌డౌన్ అనంతరం జీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లేందుకు షార్‌లోని రెండో ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ బుధవారం సాయంత్రం షార్‌కు చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను సమీక్షించారు. రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రయోగానికి సుమారు రూ. 250 కోట్లు వ్యయం చేసినట్లు తెలుస్తోంది.
వాతావరణ అధ్యయనానికే ఇన్‌శాట్-3డీఆర్
భూమిపైనే కాకుండా సముద్రాల్లోనూ ఏర్పడే విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరించేలా వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఇన్‌శాట్-3డీఆర్‌ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఈ ఉపగ్రహంలో 6-ఛానల్ ఇమేజర్, 9-ఛానెల్ సౌండర్ అనే పరికరాలు, మెట్రోలాజికల్ డాటా రిలే ట్రాన్స్‌ఫాండర్స్ (డీఆర్‌టీ), శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రిసోర్స్ (ఎస్‌ఏఎస్ అండ్ ఆర్) అనే పరికరాలను అమర్చి పంపుతున్నారు. భూమిపైన, సముద్రాలపై జరిగే మార్పులను ఛాయాచిత్రాలు తీసేందుకు 6 ఛానల్ ఇమేజర్‌ను ఉపయోగిస్తారు. వాతావరణ అధ్యయనానికి ప్రయోగించిన కల్పనా-1, ఇన్‌శాట్-3ఏ ఉపగ్రహాలు కక్ష్య నుంచి ఇప్పటికే సేవలందిస్తున్నాయి.
అయితే రోజు రోజుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం పరవళ్లు తొక్కుతుండడంతో గత ఉపగ్రహాలకంటే మెరుగైన సేవలు అందించేందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంగల పరికరాలను ఈ ఉపగ్రహంలో అమర్చారు. ఈ ఉపగ్రహం కూడా భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య నుంచి పనిచేస్తుంది.
2013 జూలై 26న ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సహకారంతో ప్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా రోదసిలోకి ప్రవేశపెట్టిన ఇన్‌శాట్-3డీ ఉపగ్రహం సేవలు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోవడంతో దాని స్థానంలో ఇన్‌శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు.