
‘పురం’ జలమయం
పట్టణంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
– హిందూపురంలో భారీ వర్షం
– నీట మునిగిన న్యూ హస్నాబాద్
హిందూపురం టౌన్ : పట్టణంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు సెలయేరుల్లా మారాయి. పట్టణంలో 64.4 శాతం వర్షపాతం నమోదైంది. రోడ్లపై మోకాళ్ల లోతుకు నీరు చేరుకున్నాయి. పట్టణంలోని న్యూ హస్నాబాద్ పూర్తిగా నీట ముగినింది. వర్షపు నీరు, మురుగు నీరు కాలువల్లోకి వెళ్లలేక రోడ్లపైకి చేరి ఇళ్లలోకి చేరాయి. దీంతో న్యూ హస్నాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హస్నాబాద్ ప్రాంతవాసులు రాత్రంతా జాగరణ చేశారు. ఇళ్లలోని రేషన్ సరుకులు, బట్టలు పూర్తిగా తడిసిపోయాయి.
అదేవిధంగా పట్టణంలో పలు రహదారుల్లోనూ వర్షపునీరు మోకాళ్ల లోతుకు చేరాయి. రైల్వే రోడ్డులో బాలాజీ సర్కిల్ నుంచి పల్లా రెస్టారెంట్ వరకు రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వాసవీ ధర్మశాల రోడ్డులోనూ ఇదే పరిస్థితి. పట్టణంలోని ముక్కడిపేట, హస్నాబాద్, విద్యానగర్, ఆర్టీసీ కాలనీ, అంబేడ్కర్ నగర్, పరిగి రోడ్డు, మేళాపురం ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.
30 ఏళ్లుగా ఇదే పరిస్థితి – ఫజుల్‌రెహమాన్, న్యూహస్నాబాద్.
న్యూ హస్నాబాద్‌లో 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. చిన్నపాటి వర్షాలకే ఇక్కడి రహదారులు పూర్తిగా జలమయమవుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు కూడా రాని పరిస్థితి నెలకొంది. భారీ వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతున్నాం.
రేషన్ సరుకులు తడిసిపోయాయి – మహేశ్వరి, న్యూ హస్నాబాద్
ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో రాత్రంతా జాగరణ చేశాం. నీరు వంటింట్లోకి చేరడతో రేషన్ సరుకులు మొత్తం తడిసిపోయాయి. వర్షపు నీరు బీరువాల్లోకి నీరు చేరి బట్టలు, పిల్లల యూనిఫారాలు తడిసిపోయాయి. దీంతో పిల్లలు పాఠశాలలకు కూడా వెళ్లలేదు.