షార్ట్‌ సర్క్యూట్‌తో ఏటీఎం కేంద్రం దగ్ధం | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఏటీఎం కేంద్రం దగ్ధం

Published Mon, May 22 2017 10:36 PM

షార్ట్‌ సర్క్యూట్‌తో ఏటీఎం కేంద్రం దగ్ధం - Sakshi

రూ.1.50 కోట్ల నష్టం
ఏలేశ్వరం : పట్టణంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఏటీఎం కేంద్రం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌కు గురై సోమవారం పూర్తిగా దగ్ధమైంది. రూ.1.50 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. వివరాల ప్రకారం స్థానిక నర్సీపట్నం రోడ్‌లో ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిలో రెండు ఏటీఎంలతో పాటు ఒక డిపాజిట్‌ మెషీన్‌ ఉంది. వీటిలో యథావిధిగా నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఉదయం ఏటీఎం కేంద్రం నుంచి మంటలు వ్యాపించడంతో స్ధానికులు ప్రత్తిపాడు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పేలోపు మూడు మెషీన్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. కాగా ఏటీఎం మూడు మెషీన్లు, ఏసీ మెషీన్లు, ఫర్నిచర్‌ విలువ రూ. 1.50 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం రూ.70 లక్షలు ఏటీఎంల్లో ఉంచినట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఆదివారం నగదు లావాదేవీలు జరగడంతో పాటు డిపాజిట్‌ మెషీన్‌లో నగదు జమ కావడంతో ఏమాత్రం నగదు నష్టం జరిగిందో అధికారులు కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఇన్‌చార్జి మేనేజర్‌ రామారావు, అకౌంటెంట్‌ రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement