అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
అప్పులబాధ తాళలేక బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు తెలుగు నరసింహుడు (40) ఆత్మహత్య చేసుకున్నాడు.
సి.బెళగల్: అప్పులబాధ తాళలేక బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు తెలుగు నరసింహుడు (40) ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకరనర పొలంతో పాటు మరో నాలుగు ఎకరాల కౌలు తీసుకుని గ్రామంలో పత్తి, వేరుశనగ పంటలను సాగు చేశాడు. పెట్టుబడి కోసం బయట దాదాపు రూ. 3 లక్షల వరకు అప్పులు చేశాడు. గతేడాది పంటలు పండక నష్టపోగా ఈసారి కూడా పైర్లు ఆశించిన మేర లేకపోవడంతో నరసింహుడికి దిక్కుతోచ లేదు. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పులు ఎలా తీర్చాలోననే బెంగతో శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా నరసింహుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి పురుగుల మందు వాసనను గుర్తించిన భార్య ఈరమ్మ, కుటుంబ సభ్యుల సహాయంతో రాత్రి కర్నూల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కోలుకో లేక ఆదివారం తెల్లవారు జామున అతను మతి చెందాడు .మతునికి భార్యతో పాటు కుమారుడు వీరేంద్ర (3వ తరగతి), కూతురు జయలక్ష్మి (6వ తరగతి) ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.