-
నత్తనడకన డబుల్ బెడ్‌రూం ఇళ్లు
-
మొదటి విడతలో జిల్లాకు 10,282 ఇళ్లు
-
ఎస్‌ఆర్‌నగర్‌లో పునాదులు దాటని నిర్మాణాలు
-
మొదలై ఏడాది దాటినా కనిపించని పురోగతి
-
ఎక్కువ నియోజకవర్గాల్లో టెండర్ల దశలోనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం వరంగల్‌లోనే ప్రారంభమైంది. మొదలైన చోటే దీనికి అడ్డుంకులు ఎక్కువగా ఉన్నాయి. శంకుస్థాపన చేసి ఏడాది దాటినా పూర్తి స్థాయిలో నిర్మాణాలు మొదలుకాని పరిస్థితి నెలకొంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ఇంకా నిర్మాణాల ప్రక్రియ మొదలుకాలేదు. కొన్నిచోట్ల నిర్మాణం మొదలు పెట్టినా ఇళ్లు పునాదుల దశలో, బేస్‌మెంటు స్థాయిలోనే ఉన్నాయి. నిర్దేశిత గడువులోపు ఇళ్లు పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్‌లో పేదల ఇళ్ల స్థానంలో జీప్లస్–1, జీప్లస్–3 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకు రూ.150 కోట్ల నిధులు కేటాయించింది. ఇళ్ల నిర్మాణాలు త్వరతగతిన పూర్తి చేసే బాధ్యతను జిల్లా కలెక్టరు అప్పగించింది. టెండర్ల నిర్వహణ, పాలనపరమైన అనుమతులు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టరు పర్యవేక్షిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మినహాయించి జిల్లా వ్యాప్తంగా టెండర్ల ప్రక్రియను గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తుండగా.. ఇళ్ల నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ చేపడుతోంది. మన జిల్లాకు మెుదటి విడతలో 10,284 డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో పట్టణ ప్రాంతాలకు 2184 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలకు 8100 ఇళ్లు కేటాయించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి 3100, వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‌కు 992, వర్థన్నపేటకు 1192, పాలకుర్తికి 1400, పరకాలకు 800 ఇళ్లు మంజూరయ్యాయి.
మిగిలిన ఏడు నియోజకవర్గాలకు 400 చొప్పున ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాలకు కేటాయించిన ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రేటర్‌వ వరంగల్‌లో 592 ఇళ్లను 92 బ్లాకుల్లో నిర్మిస్తున్నారు. వీటిలో 82 బ్లాకులు జీప్లస్+4, 10 బ్లాకులు జీ+2 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ నమూనాలపై లబ్ధిదారులు సుముఖంగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. కొన్నిచోట్ల స్థలాల ఎంపిక కూడా జరగలేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ప్యాకేజీ పద్ధతిలో టెండర్లు పిలవగా పెద్ద కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి స్థానిక నేతల నుంచి ఆర్థికపరమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో క్లాస్–1కాంట్రాక్టర్లు అనాసక్తితో ఉన్నట్లు తెలిసింది. ఏ గ్రామంలో ఇళ్లు నిర్మిస్తారో అక్కడి వరకే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
నియోజకవర్గాల వారీగా మంజూరైన ఇళ్ల వివరాలు
భూపాలపల్లి – 3100
వర్థన్నపేట – 1192
పాలకుర్తి – 1400
పరకాల – 800
వరంగల్ పశ్చిమ – 992
వరంగల్ తూర్పు – 400
స్టేషన్‌ఘన్‌పూర్ – 400
జనగామ – 400
డోర్నకల్ – 400
మహబూబాబాద్ – 400
నర్సంపేట – 400
ములుగు – 400
గ్రేటర్‌లో ఇలా..
గ్రేటర్‌వ వరంగల్‌లో 592 ఇళ్లను 92 బ్లాకుల్లో నిర్మిస్తున్నారు. వీటిలో 82 బ్లాకులు జీప్లస్+4, 10 బ్లాకులు జీ+2 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ నమూనాలపై లబ్ధిదారులు సుముఖంగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టలేకపోతున్నారు.
గ్రామాల్లో ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. కొన్నిచోట్ల స్థలాల ఎంపిక కూడా జరగలేదు.
– వరంగల్ పశ్చిమ నియోజవర్గానికి 992 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ ఇళ్లన్నీ అంబేద్కర్‌నగర్‌లోనే నిర్మిస్తున్నారు. 592 ఇళ్లను జీప్లస్+3 పద్ధతిలో 37 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. వీటిలో 11 బ్లాకుల్లో ఫ్లింత్ లెవల్, 14 బ్లాకుల్లో పుట్టింగ్గుల వరకు పూర్తయ్యాయి. మరో 12 బ్లాకుల్లో మట్టి పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనులకు రూ.2.11 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. కాంట్రాక్టర్లు పనులను సాగదీస్తుండడంతో నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తయ్యేది అంతుచిక్కడం లేదు.
– వరంగల్ తూర్పు నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని ఒక్కచోటే నిర్మిస్తున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు. ధరలు నిర్ధారణ కాకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు.
– వర్థన్నపేట నియోజకవర్గానికి 1192 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. 792 ఇళ్లను గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్‌ఆర్‌నగర్‌లో నిర్మిస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన 400 ఇళ్లను 16 ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఈ పనులను చేపట్టేందుకు ఈ నెల 30న టెండర్లు పిలిచారు. ఈ నెల 12న తుది గడువుగా నిర్ణయించారు.
– స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గానికి కేటాయించిన 400 డబుల్ బెడ్రూం ఇళ్లను12 ప్రాంతాల్లో నిర్మించనున్నారు. వీటిలో రెండు లేవుట్లలో నిర్మించే ఇళ్లకు టెండర్లు ఖరారు చేశారు. మిగిలిన 10 ప్రాంతాలకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకురాలేదు. రెండోసారి టెండర్లు ఆహ్వానించారు.
– జనగామ నియోజకవర్గానికి కేటాయించిన 400 డబుల్ బెడ్రూం ఇళ్లను 14 ప్రాంతాల్లో నిర్మిస్తారు. ఆయా ప్రాంతాల వారీగా టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రెండోసారి టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు.
– పాలకుర్తి నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్రూం ఇళ్లను 34 ప్రాంతాల్లో నిర్మించనున్నారు. ఈ ఇళ్లను నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. రెండు ప్రాంతాల్లో 95 ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. మిగిలిన ఇళ్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
– ములుగు నియోజకవర్గంలోని 13 ప్రాంతాల్లో 400 ఇళ్లను నిర్మిస్తారు. ఐదు ప్రాంతాల్లోనే స్థలాలు ఎంపిక చేశారు. వీటికే నిర్మాణ అంచనా నివేదికలు రూపొందిస్తున్నారు. ఇంకా టెండర్లు పిలువలేదు.
– పరకాల నియోజకవర్గానికి 800 డబుల్ బెడ్ రూం ఇళ్లు 800 మంజూరయ్యాయి. ఇందులో రెండు ప్రాంతాల్లో 151 ఇళ్లు నిర్మించేందుకు ఎస్టిమేట్లు రూపొందిస్తున్నారు. స్థలాల ఎంపికలో జాప్యం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి.
– మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గానికి 400 చొప్పున ఇళ్లు మంజూరుకాగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు జూలై 30న టెండర్లు పిలిచారు.
– భూపాలపల్లికి 3100, నర్సంపేట 400 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాలను ఎంపిక చేసే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.