నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.లెనిన్‌బాబు డిమాండ్ చేశారు.
నెల్లూరు (సెంట్రల్) : నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.లెనిన్‌బాబు డిమాండ్ చేశారు. నెల్లూరు సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో ఉద్యోగాల భర్తీలో సీఆర్‌డీఏకు అధికారాన్ని ఇవ్వకుండా ఏపీపీఎస్సీ ద్వారానే రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కూడా ఒకే ప్రాంతంలో కాకుండా 13 జిల్లాలో చేయాలన్నారు.
అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూసి వేయడం చాలా అన్యాయం అన్నారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షులు సిరాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు కరీముల్లా, అహ్మద్, సునీల్, సౌజన్య పాల్గొన్నారు.