breaking news
Lenin Babu
-
రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి
నెల్లూరు (సెంట్రల్) : నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.లెనిన్‌బాబు డిమాండ్ చేశారు. నెల్లూరు సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో ఉద్యోగాల భర్తీలో సీఆర్డీఏకు అధికారాన్ని ఇవ్వకుండా ఏపీపీఎస్సీ ద్వారానే రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కూడా ఒకే ప్రాంతంలో కాకుండా 13 జిల్లాలో చేయాలన్నారు. అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూసి వేయడం చాలా అన్యాయం అన్నారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షులు సిరాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు కరీముల్లా, అహ్మద్, సునీల్, సౌజన్య పాల్గొన్నారు. -
గిరిజన మహిళపై దుబ్బాక ఎస్ఐ లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కోరిక తీరిస్తేనే అనుకూలంగా వ్యవహరిస్తానంటూ దుబ్బాక ఎస్ఐ లెనిన్‌బాబు తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ చల్లాపూర్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వి.వెంకటలక్ష్మి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయవాది తీగల రాంప్రసాద్‌గౌడ్ నేతృత్వంలో బాధిత మహిళ శుక్రవారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్తి కోసం తన అన్న రామచంద్ర తల్లిని వేధింపులకు గురిచేస్తున్నారని, తరచూ కొడుతున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి ప్రశ్నించినందుకు తనపై కూడా దాడి చేశారని, కర్రతో చితకబాదారని వెంకటలక్ష్మి పేర్కొన్నారు. అన్న దాడి చేసిన ఘటనపై సెప్టెంబరు 19న దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. తన ఫిర్యాదును పక్కనబెట్టిన ఎస్సై లెనిన్‌బాబు తనను దుర్భాషలాడారని,‘కేసు నమోదు చేయను, ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ బెదిరింపులకు గురిచేశాడని వాపోయారు. తామే రామచంద్రపై దాడి చేసినట్లుగా తప్పుడు కేసు నమోదు చేసి తమను రిమాండ్‌కు తరలించారని కన్నీటిపర్యంతమయ్యారు. బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆపడం లేదని, నిత్యం పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆమె తెలిపారు. తన కోరిన తీరిస్తేనే రామచంద్రపై కేసు నమోదు చేస్తానంటూ బెదిరిస్తున్నారన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న లెనిన్‌బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్...ఈ వ్యవహారంపై ప్రత్యక్షంగా విచారణ జరపాలని సిద్దిపేట డీఎస్పీని ఆదేశించిస్తూ నోటీసులు జారీచేసింది. అలాగే బాధితురాలికి రక్షణ కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.