
మీకెందుకు నిధులివ్వాలి?
విశాఖపట్నం :‘పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. మా వాళ్లకు మేలు చేసుకోవద్దా..?
నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
వారి ప్రతిపాదనలకు నిధులిచ్చేది లేదన్న ముఖ్యమంత్రి
కరెన్సీ కష్టాలను వివరించినా స్పందన శూన్యం
విశాఖపట్నం :‘పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. మా వాళ్లకు మేలు చేసుకోవద్దా..?
అదే పనిచేస్తున్నా.. మీరు ప్రతిపాదించిన పనులకు నిధులు ఇవ్వాలన్న రూల్ ఎక్కడా లేదు. ఇవ్వాల్సిన అవసరం లేదు... మీకు ఇచ్చే ప్రసక్తి కూడా లేదు’ సమస్యలు వివరించడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు అన్న మాటలివి..
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కేటారుుంపులో జరుగుతున్న వివక్షపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో చర్చించిన అంశాలు, చంద్రబాబు స్పందించిన తీరును మాడుగుల, పాడేరు ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి శుక్రవారం రాత్రి సాక్షికి ఫోన్‌లో వివరించారు. సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలమంతా అపారుుంట్‌మెంట్ తీసుకుని మరీ సీఎంను కలిశామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు.. ఇబ్బందులను సీఎం దష్టికి తీసుకెళ్తే కనీస స్థారుులో స్పందించలేదన్నారు. పైగా తమ విజ్ఞప్తులను పట్టించుకోనవసరం లేదనట్టుగా వ్యవహరించారని ఎమ్మెల్యేలు చెప్పారు.
సీఎం దృష్టికి కరెన్సీ కష్టాలు
పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. గత 15 రోజులుగా పనిపాట్లు మానుకొని గంటల తరబడి బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఏంల వద్ద పడిగాపులు పడుతున్నారని, చిన్న నోట్లు దొరక్క నరకం చూస్తున్నారని వివరించామన్నారు. నోట్ల రద్దు మంచి నిర్ణయమే అరుునప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పర్యావసానాలు ఇలాగే ఉంటాయని సీఎంకు వివరించామని, సాధ్యమైనంత త్వరగా ఈ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీనికి సీఎం స్పందిస్తూ చూస్తాం.. చేస్తాం అంటూ బదులిచ్చారే తప్ప ప్రభుత్వపరంగా ఉపశమన చర్యలు ఏం తీసుకుంటున్నారో చెప్పలేదన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, రుణమాఫీ కాకపోవడం వలన, బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం వలన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని సీఎం దష్టికి తీసుకెళ్తే.. అందరికీ రుణమాఫీ చేశాం.. రైతులెవరూ కష్టాల్లో లేరన్నట్టుగా మాట్లాడారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పారు.
ప్రతిపాదనలు ఇచ్చినా పట్టించుకోలేదు..
టీడీపీ ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్టుగానే నియోజకవర్గాల అభివృద్ధికి తమకు కూడా నిధులు ఇవ్వాలని సీఎంను కోరామని ఎమ్మెల్యేలు వివరించారు. ఈమేరకు తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సీఎంకు అందజేశామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాబలంతో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తాముండగా.. తమ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు ఇచ్చి మరీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌స(ఎస్‌డీఎఫ్)ను వారికి కేటారుుంచి.. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తమకు నిధులివ్వక పోవడం అన్యాయమని సీఎంకు వివరించామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ మీకు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారన్నారు. ‘మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నారుు కదా.. అలాంటప్పుడు మీకెందుకు నిధులివ్వాల’ని ప్రశ్నించారని ఎమ్మెల్యే ముత్యాలనాయుడు చెప్పారు. మీరిచ్చే ప్రతిపాదనలకు నిధులిచ్చే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారని ఆయన చెప్పారు. సీఎం స్పందనపై ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేల వినతిని కనీసంగా కూడా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. సీఎం అహంకార వైఖరి మరోసారి తేటతెల్లమైందన్నారు.