మెట్‌పల్లిరూరల్ : మండలంలోని కొండ్రికర్లకు చెందిన ఆటో డ్రైవర్ డబ్బ సుధీర్(26)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గ్రామ శివారులోని పెద్దాపూర్ రోడ్డులో సెల్‌ఫోన్ టవర్ పక్కన ఉన్న నీరు లేని వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడేశారని పేర్కొన్నారు. శుక్రవారం ఆటో నడిపిన సుధీర్ రాత్రి ఇంటికి వచ్చాడు.
-
బీర్ సీసాతో పొడిచి, బావిలో పడేసిన వైనం దుండగులు
మెట్‌పల్లిరూరల్ : మండలంలోని కొండ్రికర్లకు చెందిన ఆటో డ్రైవర్ డబ్బ సుధీర్(26)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గ్రామ శివారులోని పెద్దాపూర్ రోడ్డులో సెల్‌ఫోన్ టవర్ పక్కన ఉన్న నీరు లేని వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడేశారని పేర్కొన్నారు. శుక్రవారం ఆటో నడిపిన సుధీర్ రాత్రి ఇంటికి వచ్చాడు. నిద్రకు ఉపక్రమిస్తుండగా అతడికి ఫోన్ వచ్చింది. మాట్లాడుకుంటూ బయటకు వెళ్లిన వచ్చిన సుధీర్ అర్ధరాత్రి వరకూ ఇంటికి రాలేదు. ఉదయం సుధీర్ మృతదేహాన్ని గ్రామస్తులు బావిలో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావికి సమీపంలో బీరు సీసాల గాజు ముక్కలు, ప్లాస్టిక్ గ్లాసులు లభించాయి. పోలీసులు శవాన్ని బయటకు తీయించి పంచనామా చేశారు. సుధీర్ సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ చేసింది ఎవరో తెలియరాలేదని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుధీర్ చిన్నపుడే అతడి తండ్రి మృతి చెందగా, వికలాంగుడైన అన్నను తల్లి గంగవ్వ పెంచి పోషించింది. ఆసరగా ఉంటాడనుకున్న కొడుకు హత్యకు గురి కావడంతో తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది.