ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో తగిన వసతులు కల్పించేందుకు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 38,895, రెండవ సంవత్సరం పరీక్షలకు 32,664 మంది, రెండవ సంవత్సరం పరీక్షలకు ప్రయివేటు విద్యార్థులు 5,248 మంది హాజరవుతున్నారని, వీరికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన సదుపాయాలు కల్పించాలన్నారు.
పరీక్షలకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడపాలని ఆర్‌టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షలకు 113 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక‌్షన్ విధించాలన్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో వెలుతురుతో పాటు తగిన ఫర్నిచర్ ఉండేలా చూసుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంచాలని, నీటి సదుపాయం కల్పించాలన్నారు. శ్రీశైలం నుంచి కర్నూలుకు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకునేలా బస్సులు నడపాలన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనమతించబోమన్నారు. సమావేశంలో ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి, డీఎంహెచ్‌ఓ మీనాక్షిమహదేవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.