కోతల తర్వాత .. విశ్రాంతి అవసరం | anantapur agriculture story | Sakshi
Sakshi News home page

కోతల తర్వాత .. విశ్రాంతి అవసరం

Jun 13 2017 10:06 PM | Updated on Jun 4 2019 5:04 PM

కోతల తర్వాత .. విశ్రాంతి అవసరం - Sakshi

కోతల తర్వాత .. విశ్రాంతి అవసరం

కాయకోత పూర్తయిన మామిడి తోటలకు కొద్దిరోజులు విశ్రాంతిని ఇవ్వాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : కాయకోత పూర్తయిన మామిడి తోటలకు కొద్దిరోజులు విశ్రాంతిని ఇవ్వాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. జూన్‌ మాసంలో మామిడి, సపోటా తోటల్లో యాజమాన్య చర్యలను వివరించారు.

+ కాయ కోత పూర్తయిన మామిడి తోటలకు అవకాశం ఉంటే నీటి తడి ఇవ్వాలి. తర్వాత 20 రోజుల పాటు పూర్తీగా విశ్రాంతి ఇవ్వాలి. అనంతరం జాగ్రత్తగా కత్తిరింపులు చేయాలి. గాలి వెలుతురు, సూర్యకిరణాలు బాగా తగిలేలా కత్తిరించాలి. అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు, రెమ్మలు, పూత కొమ్మలు, గొడుగు కొమ్మలు అంటే చిటారు కొమ్మలను తీసివేయాలి. కత్తిరింపుల తర్వాత కోసిన భాగాలకు బోర్డోపేస్టు లేదా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ పేస్టు పూయాలి. తొలకరి వర్షాల తర్వాత తోటలను శుభ్రం చేసి బాగా దున్నుకోవాలి. చెట్ల చుట్టూ పెద్ద పాదులు చేసుకోవాలి. ఎకరాకు 10 కిలోలు జీలుగ లేదా 25 కిలోలు జనుము లాంటి పచ్చిరొట్ల విత్తనాలు వేసుకుని 45 నుంచి 50 రోజుల సమయంలో భూమిలో కలియదున్నితే భూసారం బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టుకు బాగా చివికిన పశువుల ఎరువు 100 కిలోలు లేదా 10 కిలోల వర్మీకంపోస్టు వేసుకోవాలి. చెట్టు ప్రధాన కాండం నుంచి 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల దూరంలో పాదులు చేసుకుని ఎరువులు వేయాలి.

+ సపోటా తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఎండిన కొమ్మలు, తెగుళ్లు సోకిన కొమ్మలు తీసివేయాలి. చెట్ల లోపలి భాగంలో ఎండ తగలని కొమ్మలు, వంకర టింకర పెరిగినవి, గుబురుగా ఉన్న కొమ్మలు కత్తిరించేయాలి. కొత్తగా సపోటా సాగు చేసే రైతులు పొలం బాగా దున్నుకోవాలి. ఒక మీటరు వెడల్పు, ఒక మీటర్‌ లోతుగా గుంతలు తవ్వి ఒక్కో చెట్టు 10 మీటర్ల దూరంలో నాటుకోవాలి.
+ దానిమ్మ మొక్కలకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. కత్తిరింపులు చేయడం, పాదులు తవ్వుకోవడం, ఎరువులు వేయడం లాంటి చేయకూడదు. ఒక శాతం బోర్డోమిశ్రమం మందును 20 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేసుకుంటే బ్యాక్టీరియా మచ్చ తెగులును అదుపు చేయవచ్చు.

+ ద్రాక్ష తోటలపై 500 పీపీఎం సైకోసిల్‌ ద్రావణం పిచికారి చేయాలి. కొమ్మలు ముదరడానికి కత్తిరించిన 45 నుంచి 120 రోజుల వరకు సిఫారసు చేసిన మోతాదుల్లో పొటాష్‌ ఎరువులు వేయాలి. మజ్జిగ తెగులు నివారణకు ముందుగా 1 శాతం బోర్డోమిశ్రమం పిచికారి చేసిన తర్వాత రెండో సారి 2.5 గ్రాములు మెటలాక్సిల్‌+ మాంకోజెబ్, మూడోసారి 3 గ్రాములు సెమోక్సానిల్‌ + మాంకోజెబ్, నాలుగోసారి 3 గ్రాములు ఫోసిటైల్‌ అలుమినియం లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
+ నిమ్మలో తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద లాంటి పచ్చిరొట్ట పైర్లు వేసుకుని పూత సమయంలో కలియదన్నితే భూసారం పెరుగుతుంది. సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేయాలి. సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లేతాకులపై పిచికారి చేసుకోవాలి. చెట్ల మొదళ్లకు బోర్డో పేస్టు పట్టించాలి. కొత్త చిగుర్లను ఆశించే పేనుబంక, నల్లదోమ, ఆకుముడుత, ఆకులు తినే సీతాకోకచిలుక పురుగులను నివారించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement