నులిపురుగులతో జాగ్రత్త ! | agriculture story | Sakshi
Sakshi News home page

నులిపురుగులతో జాగ్రత్త !

Apr 30 2017 11:30 PM | Updated on Jun 4 2019 5:04 PM

నులిపురుగులతో జాగ్రత్త ! - Sakshi

నులిపురుగులతో జాగ్రత్త !

కూరగాయలు, పండ్లతోటలకు నష్టం కలిగించే వాటిలో నులిపురుగులు (నెమటోడ్స్‌) ప్రధానమైనవని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ తెలిపారు.

-  అరటి రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి
– కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్‌ జాన్‌సుధీర్‌


అనంతపురం అగ్రికల్చర్‌ :   కూరగాయలు, పండ్లతోటలకు నష్టం కలిగించే వాటిలో నులిపురుగులు (నెమటోడ్స్‌) ప్రధానమైనవని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ తెలిపారు. కంటికి కనబడనంత స్థాయిలో ఉండే నులిపురుగులు అరటిని ఆశించి అపార నష్టాన్ని కలిగిస్తాయన్నారు. వీటి నివారణకు రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.

అరటిలో నులిపురుగులు
కాండం కుళ్లు తెగుళ్లు, ముక్కుపురుగు, పేనుబంక, పనామా, వెర్రి తెగులు తదితర చీడపీడలు అరటిని ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటితో పాటు ఒక్కోసారి నులిపురుగలు కూడా అపార నష్టాన్ని కలిగిస్తాయి. కంటికి కనిపించని నులిపురుగులు పిల్ల వేర్లను ఆశించి వాటి నుంచి రసం పీల్చడం వల్ల అరటి మొక్కలు కుంగిపోతాయి. అరటి తోటల్లో మొక్కల చివరనున్న ఆకు ఎండిపోవడం, అరటిగెల పరిమాణం, పండ్ల సంఖ్య తగ్గిపోవడం, అభివృద్ధి చెందకమునుపే పండిపోవడం వంటి రోగలక్షణాలు తోటల్లో కనిపిస్తాయి. ఇలాంటి మొక్క వేర్లను పరిశీలిస్తే మూడు రకాలైన నులిపురుగులు వేర్ల లోపలి భాగంలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ పురుగులు మొదట తోటలో అక్కడక్కడా పాయలుగా కనిపించి ఆ తర్వాత తోట అంతా ఆక్రమిస్తాయి. ఈ పురుగులు ఎక్కువగా అరటి రెండో పంటకు ఆశిస్తాయి. కోత కోసిన తరువాత దాని వేర్ల నుంచి పుట్టుకువచ్చే కొత్త పిలకలకు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఎందుకంటే పురుగులకు కావాల్సిన కొత్త వేర్లు ఉంటాయి. వేర్ల పైభాగాన గోధుమ రంగు కండె ఆకారంలో మచ్చలు ఉంటాయి. వీటి సంఖ్య ఎక్కువైనప్పుడు వేర్ల లోపలి భాగమంతా కుళ్లినల్లగా మారిపోతుంది. దీని వల్ల అరటి మొక్క పటుత్వం కోల్పోయి పడిపోవచ్చు. ఈ పురుగులు ఇతర సూక్ష్మజీవులతో కలిసి వేర్లు కుళ్లేలా చేస్తాయి. దీని వల్ల పనామా అనే తెగుళ్లు అరటి తోటలకు సంక్రమిస్తుంది.

నివారణ
పురుగులు ఎక్కువగా ఉన్న తోటల్లో మొదట పంట కోసిన తర్వాత దాని నుంచి వచ్చే పిలకలను పెంచకూడదు. ఎక్కువ నులిపురుగులు ఆశించిన తోటల్లో 6 నుంచి 8 నెలల పాటు పంట సాగు చేయకుండా ఎండబెడితే ఫలితం ఉంటుంది. విత్తనము పిలకలను 55 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వేడినీళ్లలో 10 నిమిషాలు ఉంచి నాటితే మంచి ఫలితం ఉంటుంది.  పిలకలను శుద్ధి చేసి వాటిని బురద మట్టిలో ముంచి వాటిపై 40 గ్రాములు ఫ్యూరడాన్‌ గుళికలు చల్లాలి. ఆరిన తర్వాత నాటుకోవాలి. ఇలా చేయడం వల్ల విత్తన పిలకల నుంచి సంక్రమించే నులిపురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement