ఆ కుటుంబాన్ని పట్టించుకోరూ.. | Sakshi
Sakshi News home page

ఆ కుటుంబాన్ని పట్టించుకోరూ..

Published Wed, Apr 18 2018 1:20 PM

Young Man Died In Road Accident In Ktr Road Show - Sakshi

చందంపేట(దేవరకొండ) : ఏడడుగులు వేశారు.. నిండునూరేళ్లు కలిసి జీవించాలని కలలు కన్నారు.. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ నవ వధువు ఆశలు 16 రోజులకే ఆవిరయ్యాయి. ఓ రాజకీయ బహిరంగ సభ రూపంలో తన భర్తను కోల్పోయింది. ఫ్లెక్సీలు, ప్రచార బోర్డులు నిషేధించినప్పటికీ అధికారుల ఉదాసీనత వైఖరితో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒక కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. ఈనెల 5న మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిన వాహనం ఓ యువకుడి మరణానికి కారణమైంది. దీనికి బాధ్యులైన అధికారులు కాని, నాయకులు కాని, ఆ కుటుంబం దిక్కు చూడని వైనమిది.. ఈనెల 5న మిర్యాలగూడలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

పట్టణమంతా ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశారు. ఈ క్రమంలో దేవరకొండ మండలం మడమడక పంచాయతీకి చెందిన భూతరాజు వేణు అనే యువకుడు మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటూ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. మార్చి 5న మిర్యాలగూడలో కేటీఆర్‌ బహిరంగ సభకు సంబంధించి అద్దంకి– నార్కట్‌పల్లి బైపాస్‌ హనుమాన్‌పేట ఫ్లై ఓవర్‌ వద్ద డివైడర్లపై ఫ్లెక్సీలు కట్టడానికి టాటా ఏసీ బండిని రోడ్డుపై నిలిపి ఉంచారు. అప్పుడే తన పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న వేణు రోడ్డుపై ఉన్న టాటా ఏస్‌ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో ఆటోలో ఉన్న ఫ్లెక్సీ కర్రలు వేణు ఛాతి భాగంలో బలంగా గుచ్చుకున్నాయి. గాయాలపాలైన వేణు ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలోనే మృతి చెందాడు.

పారాణి ఆరకముందే..
మృతుడు నూక రాజు వేణు పేద కుటుంబానికి చెందినవాడు. 16 రోజుల క్రితమే చందంపేట మండలం తెల్దేవర్‌పల్లికి చెందిన అనూషతో వివాహమైంది. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన అనూష చేతి పారాణి ఆరక ముందే భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు జోక్యం చేసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. ఇప్పటి వరకు ఆ  కుటుంబానికి సాయం అందలేదని రజకసంఘం నేతలు ఆరోపిస్తున్నారు. 

నేనేం పాపం చేశా..
నా పెళ్లయి కేవలం 16 రోజులే అయ్యింది. భర్తే సర్వస్వం అనుకొని అత్తారింటికి వచ్చిన నా ఆశలు, కలలు ఆవిరయ్యాయి. నేనేం పాపం చేశాను. నా భర్త మృతి నాలో తీరని శోకాన్ని నింపింది. నా తల్లిదండ్రులు, అత్తింటివారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.– అనిత, వేణు భార్య

న్యాయం చేయాలి..
నా అల్లుడు చనిపోయినప్పుడు న్యాయం చేయాలని ఘటన జరిగినప్పుడు మంత్రిని కలిసేందుకు ప్రయత్నించాను. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు జోక్యం చేసుకొని ఆర్థిక సాయం చేస్తానని సర్దిచెప్పాడు. కాని ఇప్పుడు మా గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మాకు న్యాయం చేయాలి.– రాసమళ్ల తిరుపతయ్య, అనిత తండ్రి

Advertisement
Advertisement