
బంజారాహిల్స్: తన భర్త మరణానికి కారకులైన వారికి శిక్ష పడేలా చేసేందుకు ఓ మహిళ అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించింది. కోర్టుల చుట్టూ తిరిగి సరైన ఆధారాలు సమర్పించి నిందితులకు జైలు శిక్ష పడే వరకు ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లా, కేశపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన కూన రాజ్‌కుమార్, కూన సరోజ దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఉదయ్‌నగర్‌లో పాత పేపర్ల దుకాణ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరికి కుమార్తె ప్రవళిక , కుమారుడు అరుణ్‌కుమార్ ఉన్నారు. కాలేజీకి వెళ్లే ప్రవళికను అదే ప్రాంతానికి చెందిన సాగర్ అనే యువకుడు వెంటపడి వేధించేవాడు. దీనిపై ప్రశ్నించినందుకు 2013 మార్చి 27న ఆమె తండ్రి రాజ్‌కుమార్‌ను హత్య చేశాడు. ఈ కేసులో సాగర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసు నమోదు కావడంతో సరోజ న్యాయం కోసం అప్పటి నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది.
కోర్టుకు వెళ్లిన ప్రతిసారీ నిందితులకు శిక్షపడాలంటూ న్యాయమూర్తిని వేడుకునేది. 30 సార్లు కోర్టుకు హాజరై కేసుకు సంబందించి సరైన సాక్ష్యాలు సమర్పించింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన తలొగ్గలేదు. నిందితులు కేసు వెనక్కి తీసుకోవాలని కాళ్లా, వేళ్లాపడ్డా వినిపించుకోలేదు. రౌడీలతో బెదిరించినా వెరవలేదు. తన భర్త చాలా మంచివాడని అలాంటి వాడిని పొట్టనపెట్టుకోవడమే కాకుండా పసుపు కుంకుమలకు తనను దూరం చేశాడని కోర్టులో బోరుమనేది. ఒక వైపు కూతురిని ఇంజనీరింగ్, కుమారుడిని ఇంటర్ చదివిస్తూనే దుకాణం నడుపుకుంటూ మరో వైపు కోర్టుకు హాజరయ్యేది. పనిదినాల్లో తప్పనిసరిగా కోర్టుకు వెళ్లి న్యాయమూర్తిని కలిసి మొరపెట్టుకునేది. ఆమె పోరటం ఫలించడంతో న్యాయమూర్తి నలుగురు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. తనకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా సరోజ ఆనందం వ్యక్తం చేసింది. తన పిల్లలకు తండ్రి లేకుండా చేసిన వారికి జైలు ఒక్కటే గతి అని పేర్కొంది. సరోజ చూపిన తెగువను పోలీసులు కూడా అభినందించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా నిలిచినందుకు న్యాయమూర్తి కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
హత్య కేసులో నిందితులకు జైలు
బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఉదయ్‌నగర్‌లో 2013 మార్చి 27వ తేదీన కూన రాజ్‌కుమార్ అనే వ్యాపారిని హత్య చేసిన ఘటనలో అదే ప్రాంతానికి చెందిన ఎ–1 జి. సాగర్, ఎ–2జి.శ్రీకాంత్, ఎ–3 జి. స్వరూపారాణి, ఎ–4 నాగయ్యలకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం నాంపల్లిలోని రెండవ అదనపు మెజిస్ట్రేట్ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. తన కూతురిని వెంబడిస్తూ వేధిస్తున్నాడన్న కారణంగా ఇదేమిటని అడిగినందుకు కక్ష పెంచుకున్న జి.సాగర్ హోలీ పండుగ రోజున రంగులు పూసే నెపంతో రాజ్‌కుమార్ ఇంటికి వచ్చి తన చిన్నాన్న నాగయ్య, చిన్నమ్మ స్వరూపారాణి, చిన్నాన్న కొడుకు శ్రీకాంత్‌తో కలిసి రాజ్‌కుమార్‌పై పిడుగుద్దుల గుద్దడంతో అతను మృతి చెందాడు. ఐపీసీ సెక్షన్ 302 కింద ఈ నలుగురిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులు నలుగురికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.