అమెరికాలో చోటుచేసుకున్న దారుణం

In US Mother And Daughter Charged For Killing Woman And Cutting Child From Her Womb - Sakshi

వాషింగ్టన్‌ : 19 ఏళ్ల మార్లేన్‌ ఓచోయో లోపెజ్‌ కనిపించకుండా పోయి నెల రోజులు అవుతుంది. కనిపించకుండా పోయిన నాటికే తను నిండు గర్భవతే కాక ఆమెకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. సరిగ్గా నెల రోజుల క్రితం మార్లేన్‌.. డే కేర్‌ సెంటర్‌లో ఉన్న కుమారున్ని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఓ రోజు గడిచింది. కానీ మార్లేన్‌ జాడ లేదు. ఈ లోపు డేకేర్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. నిన్నటి నుంచి మార్లేన్‌ కుమారుడు డేకేర్‌ సెంటర్‌లోనే ఉన్నాడని.. అతన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని తెలిపారు. దాంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. కొడుకును తీసుకొస్తానని చెప్పిన మార్లేన్‌ ఎక్కడికి వెళ్లిందో వారికి అర్థం కాలేదు. దాంతో తెలిసిన వారందరికి ఫోన్‌ చేసి.. మార్టేన్‌ గురించి ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ రోజు నుంచి నిన్నటి వరకూ మార్లేన్‌ ఇంటికి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగిలింది. మార్లేన్‌ బదులు ఆమె బూడిద ఇంటికి చేరింది. అది చూసి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జరిగిన ఘోరం గురించి విన్న తర్వాత ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. లోకంలో ఇంతటి దుర్మార్గులు కూడా ఉన్నారా అని వాపోతున్నారు. మార్లేన్‌ ఇంటి నుంచి వెళ్లిన రోజు ఏం జరిగిందో పోలీసులు తెలిపిన వివరాలు. గర్భవతిగా ఉన్న మార్లేన్‌ ఆర్థిక పరిస్థితులు మాత్రం అంత బాగాలేవు. దాంతో తనకు పుట్టుబోయే బిడ్డకు ఏదో ఓ సాయం చేయాడంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంతో మార్లేన్‌ గర్భవతి అనే విషయం చాలా మందికి తెలిసింది. మార్లేన్‌ అభ్యర్థనకు చాలా మంది స్పందించారు.

ఇలా స్పందించిన వారిలో క్లారిస్సా ఫిగ్యురోవా(46) కూడా ఉంది. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలో కొడుకును డేకేర్‌ సెంటర్‌ నుంచి తీసుకురావడానికి వెళ్తున్న మార్లేన్‌కు, క్లారిస్సా ఫోన్‌ చేసింది. తన ఇంట్లో చిన్న పిల్లల బట్టలు ఉన్నాయి.. వచ్చి తీసుకెళ్లమని చెప్పింది. దాంతో మార్లేన్‌ డేకేర్‌ సెంటర్‌ దగ్గరకు వెళ్లకుండా క్లారిస్సా ఇంటికి వెళ్లింది. అదే ఆమె చేసిన తప్పు. బట్టల కోసం ఇంటికి వచ్చిన మార్లేన్‌ను.. క్లారిస్సా, ఆమె కూతురు, కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌ కలిసి హత్య చేశారు. అనంతరం మార్లేన్‌ గర్భం నుంచి బిడ్డను బయటకు తీసి.. ఆమె బాడీని కాల్చేశారు. ఆమె కారును ఆ ప్రాంతంలోని ఓ పార్కింగ్‌ ఏరియాలో భద్రపరిచారు. బలవంతంగా బిడ్డను బయటకు తీయడంతో ఆ చిన్నారి అస్వస్థతకు లోనయ్యింది. బిడ్డ శరీరం తెల్లగా పాలిపోయింది. దాంతో 911 నంబర్‌కు ఫోన్‌ చేసి.. తనకు, తన బిడ్డకు సాయం చేయాల్సిందిగా కోరింది క్లారిస్సా. ఆమె సంభాషణ మొత్తం వారి దగ్గర రికార్డయ్యింది.

ఈ లోపు మార్లేన్‌ కనిపించడం లేదనే ఫిర్యాదు వచ్చిది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు క్లారిస్సా మీద అనుమానం వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లి చెక్‌ చేయగా.. అక్కడ మార్లేన్‌ గురించి ఆనవాలు లభ్యమయ్యాయి. అంతేకాక క్లారిస్సా ఇంటికి కొద్ది దూరంలో మార్లేన్‌ కార్‌ పార్క్‌ చేసి ఉన్న విషయం కూడా వారి దృష్టికి వచ్చింది. క్లారిస్సాను విచారించగా.. తన కొడుకు పురిట్లోనే చనిపోయాడని.. అప్పటి నుంచి ఎవరైనా చిన్న బాబును పెంచుకోవాలని అనుకున్నానని.. కానీ సాధ్యపడలేదని క్లారిస్సా తెలిపింది. ఇంతలో సోషల్‌ మీడియాలో మార్లేన్‌ తన బిడ్డకు సాయం చేయమని కోరడంతో.. ఆమె బిడ్డను దొంగతనం చేయాలని భావించినట్లు ఒప్పుకుంది. ఈ క్రమంలో బట్టలు ఇస్తానని చెప్పి మార్లేన్‌ను ఇంటికి పిలిచి ఆమెను హత్య చేసినట్లు వెల్లడించింది. ఇందుకు తన కూతురు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ సాయం చేశారని తెలిపింది. ప్రస్తుతం క్లారిస్సా, ఆమె కుమార్తె జైలులో ఉన్నారు. మార్లెన్‌ బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి.. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top