ఆస్తి కోసం ‘శవ’ పంచాయితీ

Two Wives Clashed In Front of Husband Dead body at Hanamkonda - Sakshi

సాక్షి, హన్మకొండ: కష్టపడి ఆస్తిని సంపాదించిన వారు కాటికి పోయారు. కానీ వారి వారసులుగా చెప్పుకుని తేరగా వచ్చే ఆస్తి కోసం మృతదేహాన్ని ముందర పెట్టుకుని పంచాయితీకి దిగారు. మావన సంబంధాలకు మచ్చతెచ్చే అమానవీయ ఘటన గురువారం హన్మకొండలోని గుడిబండల్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గుడిబండల్‌కు చెందిన పిట్టల స్వామి కొన్ని సంవత్సరాల క్రితం కొమురమ్మ(76)ను పెళ్లి చేసుకున్నాడు. కొమురమ్మకు సంతానం కలగకపోవడంతో లచ్చమ్మను మరో పెళ్లి చేసుకున్నాడు. లచ్చమ్మకు 9 మంది సంతానం. కాగా సుమారు దశాబ్దకాలం క్రితం స్వామి మృతి చెందాడు. ఆయన సంపాదించిన ఆస్తిని ఇద్దరు భార్యలకు చెందేలా రాసిచ్చి కాలం చేశాడు.

ఇదిలా ఉండగా కొమురమ్మ(76) బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతురాలు కొమురమ్మ సోదరి వెంకటమ్మ కూతురు వచ్చి మాపెద్దమ్మ ఆస్తిని తనకు రాసిచ్చిందని, ఆస్తి తనకే దక్కుతుందని గొడవకు తెరలేపింది. దీంతో లచ్చమ్మ వారసులు మీకెలా చెందుతుందని, ఇది మా నాన్న సంపాధించిన ఆస్తి కాబట్టి తమకే దక్కుతుందని, అలా తమ పెద్దమ్మ రాసిచ్చిందని వాదనకు దిగారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్త పోలీస్‌ ఠాణా మెట్లక్కెంది. కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు ముందుగా దహన సంస్కారాలు కానివ్వండి అని చెప్పడంతో గురువారం సాయంత్రం దహన సంస్కారాలు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top