ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సులు

Two person Died In RTC Bus Accident In Peddapalli - Sakshi

ఉమ్మడికరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల, హుజూరాబాద్‌లలో ఆదివారం ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సిరిసిల్ల రగుడు శివారులో జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ వైద్యుడు జలగం యాదగిరిరావు(45), హుజూరాబాద్‌లోఆర్టీసీ డిపో క్రాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రభాకర్‌ (46) అనే ఎల్‌ఐసీ ఉద్యోగి మృతి చెందాడు. 

సిరిసిల్లక్రైం/సిరిసిల్లటౌన్‌: సిరిసిల్ల రగుడు శివారులో ఆదివారం బైకుపై వస్తున్న ప్రభుత్వ వైద్యుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని సాయి మణికంఠ ఫంక్షన్‌హాల్‌లో బంధువుల పెళ్లికి ప్రభుత్వ వైద్యుడు జలగం యాదగిరిరావు(45) హాజరయ్యారు. భోజనం చేసి బైకుపై సిరిసిల్లకు రావడానికి రంగినేని ట్రస్ట్‌ ప్రాంతంలో యూటర్ను తీసుకుంటుండగా కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల వైపు వస్తున్న నాన్‌స్టాప్‌ బస్సు వేగంగా ఢీకొట్టింది. బస్సు అతివేగంతో ఉండటంతో బ్రేకులు సరిగా పడక ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో యాదగిరిరావుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా చేసి పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ నారా గౌడ్‌పై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య శ్వేత, కుమారుడు కృతిక్, కూతురు ఉన్నారు.

జిల్లా వైద్యశాఖలో విషాధం..
రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ యాదగిరిరావు మృతిచెందడం రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యశాఖలో పెను విషాదం నెలకొంది. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామ వాస్తవ్యులైన ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైర్డ్‌ అయిన జలగం మాధవరావు–భారతమ్మల కుమారుడు యాదగిరిరావు తల్లిదండ్రులతోపాటు సిరిసిల్ల అనంతనగర్‌లో నివాసముంటున్నాడు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్‌సీలో యాదగిరిరావు ఐదేళ్లపాటు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం నగునూరులోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థలో మెడిసిన్‌లో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకున్న స్థానికులు వందల సంఖ్యలో సంఘటన స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం కోసం జిల్లా ఏరియాస్పత్రికి తీసుకురాగా ఆస్పత్రి ప్రాంగణం రోధనలతో దద్దరిల్లింది. సిరిసిల్లలో వైద్యుడిగా యాదగిరిరావు మంచి కీర్తి గడించారు.ఆయన మృతికి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఐఎంఏ అధ్యక్షుడు చింతోజు శంకర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తిరుపతి, ప్రముఖ వైద్యులు పెంచలయ్య, మానేరు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంతాపం ప్రకటించారు.

బస్సు ఢీకొని ఎల్‌ఐసీ ఉద్యోగి మృతి
హుజూరాబాద్‌: పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  ప్రభాకర్‌ (46) అనే ఎల్‌ఐసీ ఉద్యోగి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన ప్రభాకర్‌ (46) పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరిత్యా పట్టణంలోని కాకతీయకాలనీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటికి నిత్యవసర వస్తువులు తీసుకొని వెళ్తుండగా ఆర్టీసీ డీపో నుంచి బయటకు వస్తున్న బస్సు ఢీకొనడంతో ప్రభాకర్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతివార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top