పోడు.. గోడు!  

Two Farmers Suicide For Land - Sakshi

సాగు వద్దంటున్న అటవీశాఖ

ఆందోళనలో గిరిజన రైతులు

ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న వైనం

ఇల్లెందు (ఖమ్మం) : ఏజెన్సీలో పోడు సాగు గిరిజన రైతుల పాలిట ప్రాణ సంకటంగా మారుతోంది.. అటవీహక్కుల చట్టం కంటే ముందు నుంచి సాగులో ఉన్న భూములకు పట్టాలు రాలేదని గిరిజనులు వాపోతుండగా.., చట్టాన్ని సాకుగా చూపి ఆ తర్వాత నరికి భూములకు పట్టాలు పొందడం సాధ్యం కాదంటూ అటవీశాఖ పేర్కొంటోంది.

ఇదిలా ఉండగా అటవీహక్కుల చట్టం తర్వాత నరికి భూముల్లో హరితహారంలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ మూడేళ్లుగా ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది.. కానీ గిరిజన రైతులు కూడా అదే పట్టుతో ఉన్నారు. ఇల్లెందు ఏరియాలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో అటు అటవీశాఖ, ఇటు ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీకి, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఈ సమస్య గుదిబండగా మారింది. 

మొన్న మంకిడి కృష్ణ: ఇల్లెందు మండలం మసివాగు – కోటగడ్డకు చెందిన మంకిడి కృష్ణ ఊరికి సమీపంలో పోడు సాగు చేసుకుంటున్నాడు. జూన్‌ 29న ఆ భూమిలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వచ్చారు. దీంతో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు.

అటు కుటుంబ సభ్యులు, ఇటు అటవీశాఖ ఉద్యోగులు హుటాహుటిన ఇల్లెందు తరలించి వైద్యం అందించారు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కృష్ణ ఖమ్మంలో వారం రోజులు పాటు ఉన్నత వైద్యం పొంది రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు.  

నిన్న కున్సోత్‌ చంద్రు: మంకిడి కృష్ణ సంఘటన మరువకముందే రాఘబోయినగూడెం పంచాయతీ బోడియాతండాకు చెందిన కున్సోత్‌ చంద్రు పురుగుల మందు తాగి ఖమ్మంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండడంతో తీవ్ర మనస్థాపం చెంది అక్కడే పురుగు మందు తాగాడు.

కుటుంబ సభ్యులు హుటాహుటిని ఇల్లెందు వైద్యశాలకు, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ఈ రెండు సంఘటనలు ఇల్లెందు ఏరియాలో సంచలనంగా మారాయి. 20 ఏళ్ల క్రితం కున్సోతో చంద్రు, ఆయన కుమార్తె భద్రమ్మ, మరో నలుగురు రైతులు బోడియాతండా సమీపంలో 30 ఎకరాలు సాగు చేస్తున్నట్లు, ఈ భూమి విషయంలో అటవీశాఖ తమదేనని పేర్కొనడంతో ఆ రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు.  

పట్టాపత్రం లేదంటే ..ఆ భూమి అటవీ శాఖదేనంటా 

అటవీ ప్రాంతంలో ఏ వ్యక్తి వద్ద భూమి ఉన్నా అందుకు తగిన హక్కు పత్రం లేదంటే ఆ భూమి అటవీశాఖదేనని, దాన్ని స్వాధీనం చేసుకుని హారితహారంలో మొక్కలు నాటుతామని మూడు నెలల క్రితమే ఇల్లెందులో రెండు జిల్లాల అటవీశాఖ డీఎఫ్‌ఓలు రాంబాబు, కృష్ణగౌడ్, ఎఫ్‌డీఓ అశోక్‌రావు, రేంజర్‌ వెంకన్నలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎఫ్‌ఓ రాజారావు స్పష్టం చేశారు.

కానీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు రైతులకు చెందిన భూములకు ప్రభుత్వం ఇటీవల రైతుబంధు పథకం వర్తించింది. పట్టా పత్రాలు ఉన్నప్పటికీ అటవీశాఖ ఆ భూములను తమ భూములుగా పేర్కొంటుండడంతో సమస్య జఠిలంగా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top