breaking news
podu cultivation
-
పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ..
-
ఏమిటీ ‘పోడు’ పని
సాక్షి, నెట్వర్క్ : అడవి.. తనను నమ్ముకున్నోళ్లకు, అమ్ముకుంటున్నోళ్లకు మధ్య నలిగిపోతోంది. ఆక్రమణలు, దౌర్జన్యాల ఆటవిక చేష్టలకు చిక్కిశల్యమైపోతూ ‘అరణ్య‘రోదన చేస్తోంది. పలుకుబడిగల పెద్దలు, రాజకీయ ముసుగులోని స్థానిక నాయకులు, కబ్జాదారులు వనా లను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఆదివాసీ, గిరిజన తెగలకు అడవిపై జన్మతః ఓ ‘హక్కు’ ఉంటుంది. అలా వారికి సంక్రమించిన హక్కుల్లో ‘పోడు వ్యవసాయం’ ఒకటి. ఇప్పుడా హక్కుకు, అడవికి ముప్పొచ్చింది. వనజీవన విధానాన్ని నాశనం చేస్తూ, అడవిబిడ్డలను తరిమేస్తూ, అడవులను నరికేస్తూ, ఆక్రమించేస్తూ రకరకాల ముసుగుల్లో గిరిజనేతరులు పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ‘పోడు’పేరుతో నడుస్తోన్న పాడు దందా.. చోటుచేసుకుంటున్న ఆటవిక దాడులు, అటవీ ఆక్రమణలు ఎందాకా వెళ్తాయనేది అంతుబట్టని విషయంగా మారింది. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26.9 లక్షల హెక్టార్లు (24 శాతం). ప్రభుత్వం దీన్ని 33శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఓ పక్క ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే.. మరోపక్క అటవీ భూముల ఆక్రమణ, చెట్ల నరికివేత వంటి విధ్వంసకర చర్యలతో పర్యావరణం తీవ్రంగా నష్టపోతోంది. అడవుల ఆక్రమణ, నరికివేత వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 10శాతానికే పరిమితమైందనేది ఒక అంచనా. దేశంలోనే వేగంగా అటవీ విస్తీర్ణం తరిగిపోతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ‘కాకులు దూరని కారడవి’అనేది పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకతప్పదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు, ఆదివాసీల పేరుతో గిరిజనేతరులు సాగిస్తున్న సంప్రదాయేతర పోడు సాగు, అడవుల నరికివేత వంటి పరిణామాలు ‘అడవులకు పట్టిన క్యాన్సర్’అని వారంటున్నారు. ‘పోడు’పేరుతో పాడు ఆక్రమణలు గిరిజనులు, ఆదివాసీల పోడు వ్యవసాయం ప్రత్యేకమైనది. అడవుల్లోని వాలు గల ప్రాంతాల్లో ఉండే చిన్నపాటి పొదలు, మొక్కల్ని నరికి సేద్యానికి అనువుగా మలుచుకుంటారు. ఈ విధానంలో దుక్కు దున్నరు. నాగలికి ఎడ్లను కట్టరు. ఒక చిన్నపాటి పుల్ల (దీనిని ‘కచల్’అంటారు)తో భూమిని లోతుకు పెళ్లగించి విత్తనాలు విత్తుతారు. వీరు సాగుచేసే పంటలు కూడా రాగులు, సజ్జలు, జొన్నలు ఇతర చిరుధాన్యాలే. ఈ పంటలకు పూర్తిగా పశువుల పెంటనే ఎరువుగా వినియోగిస్తారు. ఒకేచోట రెండు మూడు పంటల కంటే ఎక్కువ సాగు చేయరు. స్థిర వ్యవసాయం కంటే కూడా చాలా సహజ పద్ధతుల్లో సాగే ఈ పోడు వ్యవసాయం విధానాల వల్ల అడవులకు, పర్యావరణానికి కానీ పూచిక పుల్లంత హాని కూడా జరగదు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పోడు భూముల విస్తీర్ణం భారీగా ఉంది. ఈ భూములపై కన్నేసిన ఆయా జిల్లాల్లోని స్థానిక నాయకులు ఆదివాసీలను మచ్చిక చేసుకుని, వారిని బినామీలుగా మార్చుకుని పోడు భూముల్ని చెరబట్టారు. గిరిజనుల పేరుతో తామే సాగుచేయడం మొదలుపెట్టారు. అసలైన పోడు వ్యవసాయానికి అర్థం మార్చేస్తూ.. అడ్డొచ్చిన మొక్కల్ని, చెట్లను నరికేస్తూ.. అడవులను మైదానాలుగా మార్చేసి సేద్యం చేయడం మొదలుపెట్టారు. అటవీ అధికారులతో పాటు ప్రభుత్వమూ చూసీ చూడనట్టు వదిలేయడంతో అడవులు ఆగమైపోతున్నాయి. పోడు, ఇతర అటవీ భూముల తదాగాలు చెలరేగినా, ఘర్షణలు తలెత్తినా గిరిజనులను ముందుంచి ‘వివాదాస్పదం’చేయడం మొదలైంది. అందుకు తాజా ఉదాహరణలే మొన్న సిర్సాలా, కొత్తగూడెం ఉదంతాలు. ఎక్కడికక్కడ అడవులు హాంఫట్ ప్రస్తుతం పోడుతో పాటు అటవీ భూములు ఎంతెంత ఎక్కడ ఆక్రమణకు గురయ్యాయో కూడా అటవీ శాఖ వద్ద సరైన లెక్కలు లేని దుస్థితి. ఎడాపెడా అడవులను ఆక్రమించేస్తున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన వారున్నారు. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26,90,370 హెక్టార్లు కాగా, ఇందులో 2,94,693 హెక్టార్ల భూమి ఆక్రమణల చెరలో ఉంది. ఇది దాదాపు 11 శాతానికి సమానం. మొదట పోడు పట్టాలున్న ఆదివాసీలు, గిరిజనులను ముగ్గులోకి దించుతున్న ఆక్రమణదారులు.. వారిని ముందుంది అడవుల ఆక్రమణకు తెగబడుతున్నారు. ఆపై నెమ్మదిగా కొద్ది కొద్దిగా ఆక్రమణలను విస్తరించుకుంటూ పోతున్నారు. ఈ ఆక్రమణల పర్వం ప్రస్తుతం చేయి దాటిపోయిన స్థితికి చేరింది. అడవిపై హక్కెవరిది? 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) కింద పోడు భూముల పట్టాలిచ్చింది కొందరికే. ఇప్పటికీ ఆయా జిల్లాల్లో వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ మూడు తరాలుగా (కనీసంగా 75 ఏళ్లు) అక్కడ నివాసం కలిగి ఉంటే.. వారికి సహజంగా అటవీ భూములపై హక్కులు కల్పించాల్సి ఉంది. కానీ, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం తదితర జిల్లాల్లో వందేళ్లకు పైబడి అడవుల్లో ఉంటున్న వారికీ పట్టాలు అందని పరిస్థితి ఉంది. అటవీ హక్కుల చట్టం కింద 2017 చివరి వరకు 11 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 దరఖాస్తులు అందాయి. వీటిలో 6,30,714 ఎకరాలకు 1,83,107 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. సామూహిక (కమ్యూనిటీ) కేటగిరీ కింద 4,70,605 ఎకరాలకు 3,427 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వేల మంది ఇప్పటికీ అటవీ హక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే.. రెండు కేటగిరీల కింద 82,572 దరఖాస్తులను తిరస్కరించగా, తమ వద్ద మాత్రం 9,743 దరఖాస్తులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని అటవీ, ఐటీడీఏ రికార్డులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, అటవీ శాఖ.. హక్కు పత్రాలున్న తమ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి చూపిస్తున్న ఉత్సాహం గిరిజనేతరుల ఆక్రమణలపై మాత్రం కిమ్మనడం లేదనే ఆరోపణలున్నాయి. పోడు భూముల్లో కార్పొరేట్ సాగు భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల, కన్నాయిగూడెం, పాత కన్నాయిగూడెం గ్రామాల్లో వందల ఎకరాల పోడు భూములున్నాయి. ఇవన్నీ స్థానిక నాయకుల గుప్పిట్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సమీపంలో గల ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దొరమామిడి, పూచికపాడు, కన్నాపురం ప్రాంతాలకు చెందిన బడా గిరిజనేతర రైతులు ఈ పోడు భూముల్లో కార్పొరేట్ స్థాయిలో పంటల సాగు చేస్తున్నారు. అలాగే ఈ జిల్లాకు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో గొత్తికోయలు ఇక్కడకు వలస వచ్చి అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్నారు. ఒకటి రెండు పంటలు వేసిన అనంతరం ఆ భూముల్ని గిరిజనులు, గిరిజనేతరులకు అమ్మేస్తున్న దాఖలాలు ఉన్నాయి. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో 90 వేల ఎకరాల అటవీ భూముల్లో అక్రమంగా పోడు వ్యవసాయం సాగుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇక, మహబూబాబాద్ జిల్లాలో 4,096.95 హెక్టార్లలో అక్రమంగా పోడు సాగుతోంది. చాలామంది ఆదివాసీలు, గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో తమ అటవీ భూముల్ని భూస్వాములు, స్థానిక నాయకుల చేతుల్లో పెడుతున్నారు. ఇలా లక్షల ఎకరాలు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ‘పోడు’చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో దాదాపు 10వేల ఎకరాల్లో అక్రమంగా పోడు సేద్యం సాగుతోంది. ఈ భూమిలో హక్కు పత్రాలున్నదెంత? లేనిదెంత? అనేది అధికారుల వద్దే లెక్కా పత్రం లేదు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన వ్యాపారి జనగం పాపారావు, పెద్దల్లాపురం గ్రామానికి చెందిన రామారావు వంద ఎకరాల చొప్పున, ఇదే గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్ రామ్‌చందర్ 70 ఎకరాల్లోనూ బినామీ పేర్లపై పోడు సాగు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో 30వేల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఈ డివిజన్లోని సార్సాలలో ఇటీవల అటవీశాఖ అధికారిణిపై దాడికి పాల్పడిన వారిలో పోచం అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈయన 40 ఎకరాల వరకు అటవీ భూమిని కబ్జా చేసినట్టు తేలింది. గిరిజనుల పేరుతో ఈయనకు డివిజన్ వ్యాప్తంగా వందల ఎకరాలను బినామీ పేర్లతో కబ్జా చేసినట్టు ప్రచారం సాగుతోంది. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన ఓ ప్రముఖుడు తనతో పాటు తన బంధువులు, తన కింద పని చేసే వారి పేర్లపై నెమళ్లగుట్ట, జబ్బోనిగూడెం అటవీ ప్రాంతంలోని 50 ఎకరాల్లో జామాయిల్ తోటలు పెంచుతున్నారు. ఇందులో ఈయన పేరిట 15 ఎకరాల వరకు రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, మిగతా భూమి తన పెట్రోలు బంకులో పనిచేసే సిబ్బంది పేర్లపై ఉన్నట్టు సమాచారం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని గోగుపల్లి, పప్కాపురం, చిన్నబోయినపల్లి శివారు ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు అడవుల్లోని చెట్లను కొట్టించి, కూలీలతో వ్యవసాయం చేయిస్తున్నారు. చిన్నబోయినపల్లిలోని వందల ఎకరాల భూమి గిరిజనేతరుల చేతుల్లోనే ఉండగా.. ఈ వివాదం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. అడవిలో ఆస్పత్రి ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆస్పత్రి భవనం. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా గట్లమల్లారానికి చెందిన దుస్సా సమ్మయ్య ప్రైవేట్ వైద్యుడు,. అధికార పార్టీ నేతగానూ ప్రచారం చేసుకుంటాడు. తప్పుడు ధ్రువపత్రాలతో మొదట 5సెంట్ల భూమి కొనుగోలు చేసిన ఆయన మరో పది సెంట్ల వరకు పక్కనే ఉన్న అటవీ భూమిని ఆక్రమించి రెండంతస్తుల వైద్యశాలను నిర్మించారు. అనుమతుల ప్రక్రియ నిమిత్తం అటవీ అధికారి రూ.3 లక్షలు తీసుకున్న ఇక్కడ బహిరంగంగా చెప్పుకుంటారు. ప్రధాన రహదారి పక్కనే.. 70% అటవీ భూమిలో, 30% ప్రభుత్వ భూమిలో కనిపించే భవనం.. అటవీ భూముల ఆక్రమణకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నిజానికి ఈ ప్రాంతంలో ‘170 యాక్ట్’అమల్లో ఉంది. అంటే, ఇక్కడ పట్టా భూమిలో వెంచర్ వేయడానికి కూడా వీల్లేదు. కానీ, రెండంతస్తుల భవనం కళ్లెదుటే కనిపిస్తున్నా.. పట్టించుకునే అటవీ, రెవెన్యూ అధికారులే లేరు. సర్కారు ఉద్యోగి ‘పాడు’దందా ఈ చిత్రంలో కనిపిస్తున్నది పోడు పేరుతో అక్రమంగా సాగు చేస్తున్న భూమి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలానికి చెందిన హాస్టల్ వార్డెన్ గుస్సా స్వామి.. మండలంలోని వివిధ ప్రాంతాల్లో 55 ఎకరాల్లో అక్రమంగా పోడుసాగు చేస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కానీ తీగలాగితే.. ఇది 300 ఎకరాలుగా తేలింది. ఈయన భార్య సర్పంచ్ కూడా. మొత్తానికి ఈయన పోడు దందాపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన దరిమిలా సస్పెండ్ అయ్యారు. తిరిగి విధుల్లో కూడా చేరిపోయాడు. ఈ జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఖాసీం 18 ఎకరాల్లో అక్రమంగా పోడు సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందిన మరుక్షణమే ఈయన కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలోకి దూకేశారు. కేసు కాకుండా తప్పించుకున్నారు కానీ, పోడు భూమిని మాత్రం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. (ఫొటో20: కొత్తగూడెం మండలంలో గుస్సా స్వామి ఆధీనంలో అక్రమంగా సాగవుతున్న భూమి) గిరిజనేతరులే కొట్టిస్తున్నారు అటవీహక్కుల చట్టం కింద అక్రమంగా పట్టాలు పొందాలనే దురుద్దేశంతో గిరిజనేతరులు.. గొత్తికోయలతో అడవుల్ని కొట్టిస్తున్నారు. చెల్పాక అటవీ ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన నాయకులు వందెకరాలకు పైగా అడవిని కొట్టించి పోడు వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అర్హులైన గిరిజనులకు న్యాయం చేయాలి. – తోలెం కిష్టయ్య, ముల్లకట్ట, ఏటూరు నాగారం -
‘పోడు’ పట్టాల పంపిణీ వైఎస్ ఘనతే
పర్ణశాల: ఏజెన్సీలో గిరిజనులు పోడుగొట్టి సాగు చేస్తున్న పదివేల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుం దని మాజీ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. దుమ్ముగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రధాన హామీలైన దళితులకు మూడేకరాల భూమి, కేజీ టు పీజీ విద్యాతో పాటు మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ వంటివి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదాయం వచ్చే పథకాలైన మిషన్ భగీరథ, కాకతీయ వంటి వాటికే కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతా అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం ఖాయ మని అన్నారు. తెలంగాణలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. సమావేశంలో డివిజన్ ఇన్చార్జ్ నల్లపు దుర్గాప్రసాద్, కృష్టార్టునరావు, లంక శ్రీనివాసరావు, బైరెడ్డి సీతారామారావు, ప్రసాద్, శ్రీలక్ష్మి, వేమనరెడ్డి, అప్పలరెడ్డి పాల్గొన్నారు. -
పోడు.. గోడు!
ఇల్లెందు (ఖమ్మం) : ఏజెన్సీలో పోడు సాగు గిరిజన రైతుల పాలిట ప్రాణ సంకటంగా మారుతోంది.. అటవీహక్కుల చట్టం కంటే ముందు నుంచి సాగులో ఉన్న భూములకు పట్టాలు రాలేదని గిరిజనులు వాపోతుండగా.., చట్టాన్ని సాకుగా చూపి ఆ తర్వాత నరికి భూములకు పట్టాలు పొందడం సాధ్యం కాదంటూ అటవీశాఖ పేర్కొంటోంది. ఇదిలా ఉండగా అటవీహక్కుల చట్టం తర్వాత నరికి భూముల్లో హరితహారంలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ మూడేళ్లుగా ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది.. కానీ గిరిజన రైతులు కూడా అదే పట్టుతో ఉన్నారు. ఇల్లెందు ఏరియాలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో అటు అటవీశాఖ, ఇటు ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఈ సమస్య గుదిబండగా మారింది. మొన్న మంకిడి కృష్ణ: ఇల్లెందు మండలం మసివాగు – కోటగడ్డకు చెందిన మంకిడి కృష్ణ ఊరికి సమీపంలో పోడు సాగు చేసుకుంటున్నాడు. జూన్ 29న ఆ భూమిలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వచ్చారు. దీంతో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. అటు కుటుంబ సభ్యులు, ఇటు అటవీశాఖ ఉద్యోగులు హుటాహుటిన ఇల్లెందు తరలించి వైద్యం అందించారు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కృష్ణ ఖమ్మంలో వారం రోజులు పాటు ఉన్నత వైద్యం పొంది రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు. నిన్న కున్సోత్ చంద్రు: మంకిడి కృష్ణ సంఘటన మరువకముందే రాఘబోయినగూడెం పంచాయతీ బోడియాతండాకు చెందిన కున్సోత్ చంద్రు పురుగుల మందు తాగి ఖమ్మంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండడంతో తీవ్ర మనస్థాపం చెంది అక్కడే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిని ఇల్లెందు వైద్యశాలకు, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ఈ రెండు సంఘటనలు ఇల్లెందు ఏరియాలో సంచలనంగా మారాయి. 20 ఏళ్ల క్రితం కున్సోతో చంద్రు, ఆయన కుమార్తె భద్రమ్మ, మరో నలుగురు రైతులు బోడియాతండా సమీపంలో 30 ఎకరాలు సాగు చేస్తున్నట్లు, ఈ భూమి విషయంలో అటవీశాఖ తమదేనని పేర్కొనడంతో ఆ రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పట్టాపత్రం లేదంటే ..ఆ భూమి అటవీ శాఖదేనంటా అటవీ ప్రాంతంలో ఏ వ్యక్తి వద్ద భూమి ఉన్నా అందుకు తగిన హక్కు పత్రం లేదంటే ఆ భూమి అటవీశాఖదేనని, దాన్ని స్వాధీనం చేసుకుని హారితహారంలో మొక్కలు నాటుతామని మూడు నెలల క్రితమే ఇల్లెందులో రెండు జిల్లాల అటవీశాఖ డీఎఫ్ఓలు రాంబాబు, కృష్ణగౌడ్, ఎఫ్డీఓ అశోక్‌రావు, రేంజర్ వెంకన్నలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎఫ్ఓ రాజారావు స్పష్టం చేశారు. కానీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు రైతులకు చెందిన భూములకు ప్రభుత్వం ఇటీవల రైతుబంధు పథకం వర్తించింది. పట్టా పత్రాలు ఉన్నప్పటికీ అటవీశాఖ ఆ భూములను తమ భూములుగా పేర్కొంటుండడంతో సమస్య జఠిలంగా మారింది. -
రగిలిన పోడు వివాదం
పోడుసాగు దారులకు, అటవీశాఖ అధికారులకు మధ్య నెలకొన్న వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దుగినేపల్లి పంచాయతీ టీ. కొత్తగూడెం, భీమవరం గ్రామాల మధ్య ఉన్న అటవీభూములను కొంతకాలంగా టి. కొత్తగూడెం గ్రామానికి చెందిన వారు సాగు చేస్తున్నారు. ఈ విషయంపై కొంత కాలంగా పోడుదారులకు, అటవీశాఖ అధికారులకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ సంవత్సరం పోడు సాగు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ గురువారం రాత్రి ట్రాక్టర్ ద్వారా భూములు దున్నుతుండగా సమాచారం అందుకున్న ఏడూళ్లబయ్యారం ఫారెస్ట్ రేంజర్ ఈ. లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. వారిని ఆపేందుకు యత్నించగా ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన టి.కొత్తగూడెం గ్రామానికి చెందిన కొంతమంది రేంజర్ లక్ష్మణ్‌పై దాడికి దిగారు. అదే విధంగా ఫారెస్ట్ శాఖకు చెందిన వాహనం టైర్ల గాలి తీసి సిబ్బంది వద్ద ఉన్న 3 సెల్ ఫోన్లు, రూ.5 వేలు నగదు లాక్కున్నారు. దీంతో అక్కడి నుండి తప్పించుకున్న ఫారెస్ట్ అధికారులు ఏడూళ్ళబయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అరెస్ట్‌లు, కేసులు నమోదు.. అటవీశాఖ అధికారి, సిబ్బందిపై దాడికి దిగినందుకు టి. కొత్తగూడేనికి చెందిన ఏడుగురిని శుక్రవారం ఏడూళ్లబయ్యారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. దాడికి ప్రధాన కారణమైన దాట్ల గోపాలనర్సరాజు( వాసుబాబు), ఆర్. మలచ్చు, దినసరపు బలవరెడ్డి, తొండపు నరేష్‌రెడ్డి, ఎస్కె సర్వర్, దావీద్, ఎస్కె. రజాక్ పాషాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు దాడిలో పాల్గొన్న మరో ముగ్గురు దొడ్డా వెంకటేశ్వర్లు, కిరణ్, గాదె సమ్మిరెడ్డిలు పరారీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఘర్షణకు దిగిన మరో 100 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను మణుగూరు కోర్టులో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.