ఘొల్లుమన్న గోస్తనీ | Sakshi
Sakshi News home page

ఘొల్లుమన్న గోస్తనీ

Published Wed, Jul 22 2020 9:29 AM

Two Child And Grand Mother Deceased in Gosthani River - Sakshi

పశ్చిమగోదావరి ,తణుకు: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారులు ఇక లేరన్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుతున్న పెద్ద దిక్కు సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. ఒకే కుటుంబంలో ముగ్గురు గోస్తనీ నదిలో పడి మృత్యువాత పడటంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తణుకు మండలం వెంకట్రాయపురం పరిధిలో మంగళవారం జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వేల్పూరు రోడ్డులో స్థానిక వీమాక్స్‌ థియేటర్‌ ఎదురుగా నివాసం ఉంటున్న వడ్లమూడి వరప్రసాద్, ప్రసన్నకుమారి దంపతుల ఇద్దరు కుమారులు వడ్లమూడి అభిషేక్‌ (7), వడ్లమూడి జాన్‌కెల్విన్‌(5) స్థానికంగా ప్రైవేటు స్కూలులో మొదటి తరగతి, ఎల్‌కేజీ చదువుతున్నారు.

వీరు నివాసం ఉంటున్న ఇంటికి దగ్గర్లో గోస్తనీ కాల్వ రేవు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటున్నారు. గమనించిన వీరి అమ్మమ్మ మానుకొండ సావిత్రి (60) వారిని హెచ్చరించింది. దీంతో ఆందోళనకు గురైన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయారు. వెంటనే సావిత్రి ఆందోళనతో వారిని రక్షించేందుకు కాల్వలో దూకేసింది. ముగ్గురూ  నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో గమనించిన స్థానికులు రక్షించే యత్నం చేశారు. అప్పటికే వీరంతా మృతి చెందడంతో వీరభద్రపురం సమీపంలో మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాలను బంధువులకు అప్పగించారు. తణుకు రూరల్‌ ఎస్సై ఎన్‌.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆడుకుంటూ అనంతలోకాలకు..
కలిసిమెలిసి ఆడుకున్న అన్నదమ్ములు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. అప్పటి వరకు కళ్ల ముందు మెదిలిన చిన్నారుల మృతదేహాలను చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. వీమాక్స్‌ థియేటర్‌ ఎదురుగా గోస్తనీ కాల్వ సమీపంలో నివాసం ఉంటున్న మానుకొండ సావిత్రి తన కుమార్తె ప్రసన్నకుమారిని తాడేపల్లిగూడెంకు చెందిన వడ్లమూడి వరప్రసాద్‌కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. వరప్రసాద్‌ తాడేపల్లిగూడెంలో ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పని చేస్తుండగా తల్లి ప్రసన్నకుమారి స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కాల్వ రేవు వద్ద ఆడుకుంటున్న అభిషేక్, జాన్‌కెల్విన్‌లను అమ్మమ్మ సావిత్రి హెచ్చరించారు. కాల్వలో పడిపోతారు వచ్చేయండ్రా అంటూ మందలించే క్రమంలో ఆందోళనతో భయపడి ప్రమాదవశాత్తూ చిన్నారులు ఇద్దరూ కాల్వలో పడిపోయారు. వీరిని రక్షించే క్రమంలో సావిత్రి కూడా దూకేయడంతో మృత్యువాత పడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వీరిని రక్షేంచేందుకు విశ్వప్రయత్నం చేశారు. వీరభద్రపురం సమీపంలో మృతదేహాలను గుర్తించినా.. వీరిలో అభిషేక్, సావిత్రి బతికే ఉన్నారంటూ వీరిద్దరినీ స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. 

Advertisement
Advertisement