యువకునిపై క్రూరత్వం

Tortured On Young Man In Anantapur - Sakshi

చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ వేసి చిత్రహింసలు

చెన్నంపల్లి సమీపాన కల్వర్టు వద్ద ఘటన

ఓ యువకుడిని దుండగులు క్రూరంగా హింసించారు. రాత్రి నుంచి ఉదయం వరకూ తీవ్రగాయాలతో కల్వర్టు వద్ద పడి ఉన్న అతడిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా.. కుటుంబ కలహాల కారణంగా దారుణం చోటు చేసుకుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.  

కళ్యాణదుర్గం: కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన సునీల్‌ అనే యువకుడు వ్యవసాయ పనులతోపాటు జీవాల వ్యాపారం చేసేవాడు. ఏడాది కిందట చెన్నంపల్లికి చెందిన నవితతో వివాహమైంది. వీరికి ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. సునీల్‌ శనివారం మధ్యాహ్నం కురాకులపల్లిలో అనంతపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి నరసింహప్పతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బెంగుళూరులో ఉన్న సోదరి విమలకు సమాచారం తెలియడంతో అదే రోజు సాయంత్రం 5.27 నిమిషాలకు సునీల్‌ సెల్‌ 95530 60686కు కాల్‌ చేసింది. ఫోన్‌ రింగైనా సమాధానం రాలేదు. తిరిగి రాత్రి 10.15 నిమిషాలకు మరోసారి కాల్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో మరింత ఆందోళనకు గురయ్యారు.  

చిత్రహింసలకు గురిచేసి..కల్వర్టు వద్ద పడేసి..
చెన్నంపల్లి సమీపాన తన మామ తోట దగ్గరలోని పేరూరు కెనాల్‌ కల్వర్టు కింద సునీల్‌ పడి ఉన్నాడు. చేతులు, కాళ్లు కట్టేసి మూతికి ప్లాస్టర్‌ వేసి ఉంది. శరీరమంతా గుండు సూదులతో గుచ్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి నొప్పులతో మూలుగుతున్న సునీల్‌ దొర్లుకుంటూ కల్వర్టు బయటకు చేరుకున్నాడు. ఆదివారం ఉదయం చెన్నంపల్లికి చెందిన నరసింహులు, అమర్‌లు అయ్యంపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చి.. అక్కడి నుంచి పేరూరుకు వెళ్లే సమయంలో సునీల్‌ను గమనించారు. కట్లు విప్పి.. మూతికి వేసిన ప్లాస్టర్‌ను తీసేశారు. అనంతరం అతడి మామకు సమాచారం అందించి.. కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడు సునీల్‌ను సీఐ శివప్రసాద్, రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌లు వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించినా అపస్మారకస్థితిలో ఉన్నందున ఫలితం లేకపోయింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని అనంతపురం తీసుకెళ్లారు.   

ఘటనపై అనుమానాలు
సునీల్‌పై జరిగిన దాడి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల వ్యాపార లావాదేవీల్లో విభేదాలు తలెత్తడం వల్ల ఈ విధంగా చేశారా..? నెల కిందటే పుట్టింటికి వెళ్లిపోయిన భార్యతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా దాడి జరిగిందా.. అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.   తన బంధువైన ఓ వ్యక్తి ఆర్థికలావాదేవీల విషయంలో ఇలా చేశారంటూ స్పృహలోకి వచ్చిన తర్వాత సునీల్‌ చెప్పడంతో కంబదూరు ఎస్‌ఐ రాగిరి రామయ్య సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top